పల్లెకు పోండి... ప్రచారం చేయండి... | Go to villeges and make propaganda | Sakshi
Sakshi News home page

పల్లెకు పోండి... ప్రచారం చేయండి...

Published Fri, Aug 12 2016 11:23 PM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM

ఆయిల్‌ ప్రింట్‌లో చంద్రబాబు ఫొటోతో ముద్రించిన ఆహ్వాన పత్రిక

ఆయిల్‌ ప్రింట్‌లో చంద్రబాబు ఫొటోతో ముద్రించిన ఆహ్వాన పత్రిక

 పుష్కరాల నేపథ్యంలో ప్రజలవద్దకు అధికారులు
 సర్కారు పాలనపై విస్తత ప్రచారానికి శ్రీకారం
రోజుకో అంశంపై గ్రామ, వార్డు స్థాయిలో ప్రచారం
ఉదయమే ఉత్తర్వులు... హడావుడిగా ఏర్పాట్లు
\కార్యక్రమంపై ఉద్యోగుల్లో సర్వత్రా అసంతప్తి
 
 
విజయనగరం గంటస్తంభం:  చేసే పనికన్నా ప్రచారానికే పెద్దపీట వేసే మన సర్కారు... పుష్కరాలనూ దీనికి అనుకూలంగా మలచుకుంటోంది. కష్ణా తీరానికి జిల్లా అధికారులు, ఉద్యోగులను తరలించిన పాలకులు... పాలన పడకేసిందన్న అపప్రధనుంచి తప్పించుకునేందుకు కొత్త ప్రణాళిక రచించారు. వివిధ అంశాలపై ప్రజలను చైతన్యపరిచేందుకు జన్మభూమి తరహాలో పల్లెపల్లెకూ ఉన్న కొద్దిపాటి అధికారుల్నీ పంపించాలని ఆదేశాలు అందాయి. పుష్కరాలు పూర్తయ్యేవరకూ అక్కడకు తరలివెళ్లేలా... సర్కారు కార్యక్రమాలపై చైతన్యపరిచేలా... కార్యక్రమాలు రూపొందాయి. పుష్కరాలను తెలుగుదేశం ప్రభుత్వం సొంత ప్రచారానికి వాడుకుంటోంది. ఇవి ముగిసేంతవరకూ అధికారులు గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు గురించి తెలియజేయాలని కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందుకు సంబంధించి అధికారులకు ప్రణాళికా శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం ఆగస్టు 12వ తేదీ నుంచి 23వ తేదీ వరకు గ్రామ, వార్డు స్థాయిలో అవగాహన కార్యక్రమాలు జరుగుతాయి. గ్రామ, వార్డుస్థాయి జన్మభూమి కమిటీలు, గ్రామస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రభుత్వ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తారు.
 
 
రెండు బందాలుగా అధికారులు
మండలస్థాయి అధికారులు జన్మభూమి మాదిరిగా రెండు బందాలుగా విడిపోయి ఒకరోజులో వీలైనన్ని గ్రామాల్లో పర్యటించి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక బందానికి తహసీల్దారు, మరో బందానికి ఎమ్పీడీవో నాయకత్వం వహిస్తారు. పురపాలక సంఘాల్లో బందాలకు కమిషనర్, ఇతర అధికారులు నాయకత్వం వహిస్తారు. వీరు కూడా వీలైనన్ని వార్డులు సందర్శిస్తారు. జిల్లాలో డీపీవో సహకారంతో కలెక్టర్, మండలాల్లో ఎమ్పీడీవో, పురపాలకసంఘాల్లో కమిషనరు కార్యక్రమాలను పర్యవేక్షించి విజయవంతం చేయాల్సి ఉంటుంది. గ్రామస్తాయిలో అధికారులతోపాటు ఆశవర్కరు, ఏఎన్‌ఎం, అంగన్వాడీ కార్యకర్త, జిల్లా కలెక్టర్‌ ఆదేశాల ప్రకారం నియమితులయ్యే సిబ్బంది పాల్గొంటారు. పురపాలకసంఘాల్లో అవసరమైన సిబ్బందిని కలెక్టర్‌ అనుమతితో కమిషనర్‌ నియమిస్తారు. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
 
రోజుకో కార్యక్రమంపై అవగహన   
రోజుకో కార్యక్రమంపై అవగాహన కల్పించేలా ప్రణాళిక రూపొందించారు. 12వతేదీన నీటి నిర్వహణ, సాగునీరు, నదుల అనుసంధానంపై అవగాహన కల్పించాలి. ఈ బాధ్యత డ్వామా, నీటిసంరక్షణ శాఖలు చూస్తాయి. 13న పట్టణాభివద్ధిశాఖ, పురపాలక అధికారులు అమరావతి రాజధాని నిర్మాణంపైనా, 14న అటవీశాఖ వనం–మనం, 15, 16న వ్యవసాయ, అనుబంధశాఖలు సంబంధిత పథకాలపైనా, 17న విద్యాశాఖ విద్య, వత్తినైపుణ్యంపైనా, 18న వైద్య ఆరోగ్య, ఎన్టీఆర్‌ వైద్యసేవ అధికారులు ఆరోగ్యం, జీవన విధానం పెంపు, మంచి అలవాట్లు, చెడు వ్యవసనాలు, పౌష్టికాహారం, 19న వెలుగు, మెప్మా, డీఆర్‌డీఏ, పరిశ్రమల శాఖ పేదరికంపై గెలుపు, ఆదాయ మార్గాల వద్ధి, ఉపాధికల్పన, 20న పరిశ్రమలశాఖ, వెలుగు, మెప్మాలు మౌలిక సదుపాయాలు, పరిశ్రమల అభివద్ధిపైనా, 21న పురపాలక, ఆర్‌డబ్ల్యూఎస్, వైద్య ఆరోగ్యశాఖ స్వచ్ఛభారత్‌పైనా, 22న రెండెంకెల వద్ధిపైనా, 23న ఐటీశాఖ సాంకేతిక పరిజ్ఞానంపైనా అవగహన కల్పించాలని నిర్ణయించారు. 
 
 
హడావుడి ఏర్పాట్లపై అధికారుల్లో విముఖత
వాస్తవానికి కార్యక్రమం 12వ తేదీ నుంచి జరగాల్సి ఉంది. కానీ ప్రభుత్వం నుంచి శుక్రవారమే ఉత్తర్వులు రావడంతో తొలిరోజు కార్యక్రమం జరగలేదు. 13వ తేదీ నుంచైనా కార్యక్రమాలు చేపట్టేందుకు ఏర్పాటు చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ అధికారులతో సమావేశమై మార్గదర్శకాలు వివరించారు. ఇంత ఆదరాబాదరాగా కార్యక్రమం నిర్వహించాలని చెప్పడంపై అధికారుల్లో అసంతప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికే రెండు విడతల జన్మభూమి కార్యక్రమాల్లో ప్రజలనుంచి వ్యతిరేకత రావడంతో ఈసారి ఎలా వెళ్లగలమని వారంతా తర్జనభర్జనలు పడుతున్నారు. మళ్లీ రేషన్‌కార్డులు, ఇళ్లస్థలాలు, ఇళ్లపై తప్పకుండా ఒత్తిళ్లు వస్తాయని భయపడుతున్నారు. అసలు పుష్కరాలు అక్కడ జరిగితే ఈ ప్రచారం ఎందుకన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది.
 
 
ఆహ్వానంపేరుతో నిధుల దుబారా
ఇక పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామని తెలియజేసేందుకు ఆహ్వాన పత్రాలకోసం చంద్రబాబునాయుడు నిధుల్ని దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కష్ణ పుష్కరాలకు రావాలంటూ సీఎం ఫొటోతో రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలకు ఆహ్వాన పత్రికలు వచ్చాయి. అమరావతి నుంచి వచ్చిన ఈ ఆహ్వాన పత్రికలను మండల, గ్రామ స్థాయిలో ఉండే ప్రజాప్రతినిధులకు పంపిణీ చేసే పనిలో రెవెన్యూ అధికారులు ఉన్నారు. సీఎం ఆహ్వాన పత్రికలు పంపిస్తే తప్ప పుష్కరాలకు ప్రజాప్రతినిధులు వెళ్లరా అంటూ ప్రజలు గుసగుస లాడుతున్నారు. పుష్కరాలకు రావాలంటూ ఆయిల్‌ ప్రింట్‌లో ఆహ్వాన పత్రికల కోసం కోట్లాది రూపాయలు వెచ్చించడం దారుణమన్న చర్చ జరుగుతోంది. ఓ వైపు పల్స్‌ సర్వేలో ఉన్న రెవెన్యూ అధికారులు ఈ ఆహ్వాన పత్రికల పంపిణీ చేయడం తలనొప్పిగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement
Advertisement