‘డ్వామా’లో మెగా డ్రామా
- ఉపాధి సిబ్బందికి ప్రభుత్వ ప్రోత్సాహకం
- జిల్లాకు సుమారు రూ.74 లక్షలు విడుదల
- ఖాతాల్లోకి వేయడంలో అధికారుల నిర్లక్ష్యం
- ‘మెగా చెక్’ పేరుతో ప్రచార ఆర్భాటానికి ఏర్పాట్లు
- బాబు, చినబాబుతోనే ఇప్పించాలని ప్లాన్
సంక్షేమ పథకాలను నిరుపేదల దరికి చేర్చడంలో విఫలమవుతున్న ప్రభుత్వం... ఆ అప్రతిష్టను తొలగించుకునేందుకు నానా పాట్లు పడుతోంది. అందువల్లే అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ ప్రచారం చేసుకునే పనిలో నిమగ్నమైంది. అందులో భాగంగానే ‘డ్వామా’లో మెగా డ్రామా ప్రదర్శనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉపాధిహామీ సిబ్బందికి మంజూరైన ప్రభుత్వ ప్రోత్సాహక మొత్తాన్ని పంపిణీ చేసేందుకు ‘మెగా’ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
- అనంతపురం టౌన్
కరువు జిల్లాలో వలసలు నివారించేందుకు చేపట్టిన ‘ఉపాధి’ హామీ పథకం కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్ల అబాసుపాలవుతోంది. ఈ క్రమంలోనే దిద్దుబాటు చర్యలకు దిగిన గ్రామీణాభివృద్ధి శాఖ బాగా పని చేస్తున్న ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఇచ్చి పని దినాలు పెంచేలా ప్రణాళిక సిద్ధ౾ చేసింది. అందులో భాగంగా ఉపాధిహామీ పథకం సిబ్బంది గ్రామాల్లో ఎన్ని కుటుంబాలకు, ఎన్ని వంద రోజులు పని కల్పిస్తే అన్ని వందల రూపాయలు మంజూరు చేసింది.
జిల్లాకు రూ.74 లక్షలు
జిల్లాలో 2016–17 ఆర్థిక సంవత్సరానికి గాను ఉపాధి హామీ పథకంలో 73,971 కుటుంబాలకు వంద రోజుల పనిదినాలు పూర్తి చేసుకున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం 73,971 కుటుంబాలకు వంద రోజులు కల్పించినందుకు రూ.100 చొప్పున రూ.73,97,100 మంజూరు చేసింది. వంద రోజులు పనిదినాలు కల్పించడంలో భాగస్వాములైన మేట్లు /జూనియర్ మేట్లు /సీనియర్ మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లకు రూ.30 చొప్పున, టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ.15 చొప్పున, ఈసీకి రూ.10, ఏపీఓలకు రూ.10, కంప్యూటర్ ఆపరేటర్‌కు రూ.5 చొప్పున పారితోషకం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కలను బట్టి చూస్తే ఏపీఓ, జేఈ, కంప్యూటర్ ఆపరేటర్లకు రూ.వేలల్లో పారితోషకాలు అందుతాయి.
వీలైతే బాబు..లేదంటే చినబాబు
జిల్లాకు మంజూరు చేసిన ప్రోత్సాహక మొత్తాన్ని 15 రోజుల్లోపు సిబ్బందికి అందజేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. రెండు నెలలైనా నేటికీ ఖాతాల్లోకి డబ్బులు పడలేదు. అసలు విషయం ఏంటని ఆరా తీస్తే.. విడుదలైన మొత్తాన్ని నేరుగా ఉద్యోగుల ఖాతాల్లోకి వేస్తే ప్రభుత్వానికి ఎలాంటి క్రెడిట్ రాదు. అదే ప్రత్యేక కార్యక్రమం చేపడితే కొద్దోగొప్పో ప్రచారం దక్కుతుంది. ఈ మేరకు డ్వామా అధికారులు కూడా సన్నాహాలు చేస్తున్నారు. వీలైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. కాకుంటే గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ‘మెగా’ చెక్ ఇప్పించాలని భావిస్తున్నారు. పనిలో పనిగా ‘థ్యాంక్యూ సీఎం’ కార్యక్రమం కూడా చేపట్టాలన్న ఆలోచనలో ఉన్నారు. అయితే చంద్రబాబు కన్నా చినబాబు చేతుల మీదుగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే రాజకీయంగా ఆయనకు కాస్త మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుందని, ఆ దిశగానే జిల్లా యంత్రాంగం అడుగులు వేస్తోంది. మరోవైపు నిధులు విడుదలైనా మంజూరులో జాప్యంపై ఉద్యోగులు మండిపడుతున్నారు.