‘గోదావరి’ది అదే జోరు
‘గోదావరి’ది అదే జోరు
Published Sun, Jul 17 2016 11:30 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM
- సెంట్రల్ జోన్ విన్నర్‌గా నిలిచిన
- పశ్చిమగోదావరి
- నేడు ప్రకాశం.. కృష్ణా జట్ల మధ్య మ్యాచ్
ఒంగోలు: సెంట్రల్ జోన్ సీనియర్ ఉమన్ క్రికెట్ పోటీల్లో పశ్చిమగోదావరి జట్టు మూడో మ్యాచ్‌లోను జోరు కొనసాగించింది. ఆదివారం స్థానిక శర్మా కాలేజీ ఆవరణలో పశ్చిమగోదావరి.. గుంటూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పశ్చిమగోదావరి జట్టు ఏకంగా 167 పరుగుల ఆధిక్యంతో విజయబావుటా ఎగురవేసింది. తొలుత ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు ఇరుజట్ల క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ క్రికెట్‌లో మహిళలు రాణించడం శుభపరిణామమన్నారు. కృషిచేస్తే సాధించలేనిది ఏదీ లేదనేదానికి ఉదాహరణే మీరు అని, మీరు బాగా రాణించి ఇతర బాలికలకు స్ఫూర్తిగా నిలవాలని పిలుపునిచ్చారు. అనంతరం మ్యాచ్ ప్రారంభించే సమయంలోనే వర్షం ప్రారంభమైంది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన పశ్చిమగోదావరి జట్టు క్రీడాకారులు గుంటూరు బౌలర్లను చీల్చి చెండాడారు. కేవలం 103 బంతులను ఎదుర్కొన్న జి.సత్యవాణి అజేయంగా 85 పరుగులు చేయగా, సీహెచ్ కవిత 91 బంతులు ఎదుర్కొని అజేయంగా 69 పరుగులు చేసి గుంటూరు బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ఈ క్రమంలో మరోమారు వర్షం ప్రారంభం కావడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. దీంతో అప్పటికి పశ్చిమగోదావరి జట్టు 32.2 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 196 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదిస్తూ అంపైర్లు ప్రకటించారు. దీంతో జె.వి.డి. విధానం ప్రకారం పరిశీలించగా పశ్చిమగోదావరి జట్టు స్కోరు 198కి పెరిగింది. 199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుంటూరు జట్టు నిర్ణీత 25 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్లు కోల్పోయి కేవలం 31 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో పశ్చిమగోదావరి జట్టు 167 పరుగుల భారీ స్కోరుతో విజయాన్ని కైవసం చేసుకుంది. ఇప్పటివరకు జరిగిన టోర్నమెంట్‌లో తాను ఆడిన మూడు మ్యాచ్‌ల్లోను విజయాన్ని కైవసం చేసుకొని టోర్నమెంట్ విన్నర్‌గా పశ్చిమ గోదావరి జట్టు నిలిచింది. సోమవారం ప్రకాశం, కృష్ణా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది.
Advertisement
Advertisement