CENTRAL ZONE CRICKET
-
‘అండర్–19’ విజేత నారాయణ
ఒంగోలు: అండర్–19 సెంట్రల్ జోన్ విజేతగా ఒంగోలు నారాయణ జూనియర్ కాలేజీ జట్టు నిలిచింది. స్థానిక ఏబీఎం డిగ్రీ కాలేజీలో గురువారం సెంట్రల్ జోన్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. కందుకూరు టీఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఒంగోలు నారాయణ జట్టు మధ్య జరిగిన మ్యాచ్‌లో కందుకూరు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత ఓవర్లలో 59 పరుగులు చేసి టీఆర్ఆర్ జట్టు ఆలౌటయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నారాయణ జట్టు 11 ఓవర్లలో లక్షా్యన్ని ఛేదించి జయకేతనం ఎగురవేసింది. ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన జట్లను ఆర్ఐఓ రమేశ్‌బాబు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతో పాటూ ఆటల్లోనూ రాణించి ఉజ్వల భవిష్యత్ సాధించాలని ఆకాంక్షించారు. అండర్–19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి ఎం హరనాథబాబు, ఏబీఎం జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ మోజెస్ దయానందం, ఫిజికల్ డైరెక్టర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు సీహెచ్ వెంకటేశ్వరరావు, కార్యదర్శి నరసింహారావు, ఏబీఎం జూనియర్ కాలేజీ పీడీ కే డేవిడ్‌రాజు, రాజు, కాశీరత్నం పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయిలో సత్తా చాటాలి
– సెంట్రల్ జోన్ సెక్రటరీ కోకా రమేష్ ఒంగోలు: సెంట్రల్ జోన్ పరిధిలో నాలుగు జిల్లాల మధ్య జరిగిన పోటీల్లో ప్రతిభ కనబరిచి సెంట్రల్ జోన్ జట్టుకు ఎంపికైన క్రీడాకారులు సత్తా చాటాల్సిన అవసరం ఉందని సెంట్రల్ జోన్ క్రికెట్ కార్యదర్శి కోకా రమేష్ అన్నారు. మంగళవారం స్థానిక ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆవరణలో నిర్వహించిన సెంట్రల్‌జోన్ అంతర్ జిల్లాల పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పోటీల్లో బాగా ప్రతిభ కనబరిచిన వారినే సెంట్రల్ జోన్ జట్టుగా ఎంపిక చేశామన్నారు. అయితే ఈ పోటీల్లో పదేళ్లలోపు పిల్లలైన హాసిని, చైత్రిని, వర్షిత, హాసినిలు కూడా బాగా రాణించారన్నారు. ఎంపిక కాని వారు డీలా పడాల్సిన అవసరం లేదన్నారు. తప్పకుండా మిగిలిన ఏజ్ గ్రూపుల్లో తప్పకుండా రాణిస్తారన్నారు. పీడీసీఏ జిల్లా కార్యదర్శి చింతపల్లి ప్రతాప్‌కుమార్ మాట్లాడుతూ జిల్లా నుంచి సెంట్రల్ జోన్ జట్టుకు ఎంపికైన తాళ్లూరి మల్లిక, పీవీ సుధారాణిలను అభినందించారు. -
సెంట్రల్‌జోన్ సీనియర్ ఉమన్ క్రికెట్ టీం ఎంపిక
ఒంగోలు: సెంట్రల్ జోన్ సెక్రటరీ కోకా రమేష్ ఆధ్వర్యంలో మంగళవారం సెంట్రల్ జోన్ ఉమన్ క్రికెట్ టీం ఎంపిక చేశారు. స్థానిక శర్మ కాలేజీ గ్రౌండ్లో ప్రారంభమైన ఈ సెంట్రల్ జోన్ పరిధిలోని ప్రకాశం, కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జట్ల మధ్య గత కొన్ని రోజులుగా జరుగుతున్న మ్యాచ్‌లలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులతో టీం ఎంపిక పూర్తి చేశారు. ఎంపికలో సెలక్షన్ కమిటీ చైర్మన్ సయ్యద్ ఆలీ, కోకా రమేష్, ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చింతపల్లి ప్రతాప్కుమార్లతోపాటు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఉమన్ టీం కోచ్ ఎస్.శ్రీనివాసరెడ్డి ఉన్నారు. సెంట్రల్ జోన్ టీం : ఎస్.మేఘన(కెప్టెన్–కృష్ణా జిల్లా), ఆర్.కల్పన–వికెట్ కీపర్ (వైస్ కెప్టెన్–కృష్ణా జిల్లా), పీవీ సుధారాణి, టి.మల్లిక(ప్రకాశం), సీహెచ్.ఝాన్సీలక్ష్మి(గుంటూరు), జి.స్నేహ, ఎం.భావన,కె.థాత్రి, ఎల్ఎస్ఎస్ తేజస్విని(కృష్ణా), జి.నవ్యదుర్గ, సీహెచ్.కవిత, వికెట్ కీపర్ కె.హెప్సీబా, ఇ.సత్యవాణి, ఎం.లావణ్య(పశ్చిమ గోదావరి)లను ఎంపిక చేశారు. స్టాండ్‌బైలుగా టి.ఉమాదేవి(పశ్చిమగోదావరి), ఎన్.జ్యోతిర్మయి, కె.ఆకాంక్ష(కృష్ణా), కె.శ్రీఅమృత(గుంటూరు), పి.కల్పన, సింధుశ్రీ(ప్రకాశం జిల్లా)లు ఎంపికయ్యారు. ఈ జట్టుకు కోచ్‌గా ఎస్.రమాదేవి, డి.చంద్రికలు ఎంపికయ్యారు. -
‘గోదావరి’ది అదే జోరు
- సెంట్రల్ జోన్ విన్నర్‌గా నిలిచిన - పశ్చిమగోదావరి - నేడు ప్రకాశం.. కృష్ణా జట్ల మధ్య మ్యాచ్ ఒంగోలు: సెంట్రల్ జోన్ సీనియర్ ఉమన్ క్రికెట్ పోటీల్లో పశ్చిమగోదావరి జట్టు మూడో మ్యాచ్‌లోను జోరు కొనసాగించింది. ఆదివారం స్థానిక శర్మా కాలేజీ ఆవరణలో పశ్చిమగోదావరి.. గుంటూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పశ్చిమగోదావరి జట్టు ఏకంగా 167 పరుగుల ఆధిక్యంతో విజయబావుటా ఎగురవేసింది. తొలుత ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు ఇరుజట్ల క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ క్రికెట్లో మహిళలు రాణించడం శుభపరిణామమన్నారు. కృషిచేస్తే సాధించలేనిది ఏదీ లేదనేదానికి ఉదాహరణే మీరు అని, మీరు బాగా రాణించి ఇతర బాలికలకు స్ఫూర్తిగా నిలవాలని పిలుపునిచ్చారు. అనంతరం మ్యాచ్ ప్రారంభించే సమయంలోనే వర్షం ప్రారంభమైంది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన పశ్చిమగోదావరి జట్టు క్రీడాకారులు గుంటూరు బౌలర్లను చీల్చి చెండాడారు. కేవలం 103 బంతులను ఎదుర్కొన్న జి.సత్యవాణి అజేయంగా 85 పరుగులు చేయగా, సీహెచ్ కవిత 91 బంతులు ఎదుర్కొని అజేయంగా 69 పరుగులు చేసి గుంటూరు బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ఈ క్రమంలో మరోమారు వర్షం ప్రారంభం కావడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. దీంతో అప్పటికి పశ్చిమగోదావరి జట్టు 32.2 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 196 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదిస్తూ అంపైర్లు ప్రకటించారు. దీంతో జె.వి.డి. విధానం ప్రకారం పరిశీలించగా పశ్చిమగోదావరి జట్టు స్కోరు 198కి పెరిగింది. 199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుంటూరు జట్టు నిర్ణీత 25 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్లు కోల్పోయి కేవలం 31 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో పశ్చిమగోదావరి జట్టు 167 పరుగుల భారీ స్కోరుతో విజయాన్ని కైవసం చేసుకుంది. ఇప్పటివరకు జరిగిన టోర్నమెంట్లో తాను ఆడిన మూడు మ్యాచ్‌ల్లోను విజయాన్ని కైవసం చేసుకొని టోర్నమెంట్ విన్నర్‌గా పశ్చిమ గోదావరి జట్టు నిలిచింది. సోమవారం ప్రకాశం, కృష్ణా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది.