మంగళగౌరి వ్రతంలో అమ్మవారికి పెట్టిన నైవేద్యం
శ్రావణం.. శుభకరం
Published Tue, Aug 9 2016 12:15 AM | Last Updated on Tue, Oct 9 2018 5:11 PM
మదనపల్లె సిటీ
సుముహుర్తాలకు శ్రావ్యమైనది.. మేఘ, వర్ష పరియమైనది.. పుడమి తల్లికి పచ్చదనం నింపేది.. వ్రతాలు, నోములు.. పూజలకు నెలవైనది.. మంగళ కరమైనది.. శుభకరంగా నిలిచే మాసం శ్రావణం. అందుకే ఈ నెల లక్ష్మీమాసంగా పేరు పొందింది. శ్రావణం ప్రారంభమైన నేపథ్యంలో ఈ నెలపై ప్రత్యేక కథనం.
శ్రావణం రాకతో ఊరు వాడా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఆలయాలు సొబగులు దిద్దుకున్నాయి. ప్రతి ఇంటా గడపలు రంగవల్లికలతో ముస్తాబవుతున్నాయి. ముహూర్తాలు వచ్చేశాయి. అమ్మవారి ఆలయాలు కొత్తకళను సంతరించుకున్నాయి. మనసుకు ప్రశాంతత కల్పించే ఈ మాసంలో మహిళలు సకల సౌభాగ్యాలతో పాటు శ్రీమహాలక్ష్మి అమ్మవారి కటాక్షం పొందేందుకు వ్రతాలు, ఉపవాసాలు, ఆరాధనలు ప్రారంభించారు. మహిళలంతా భక్తిప్రపత్తులతో శ్రీగౌరి, శ్రీ మహాలక్ష్మి వ్రతాలు, కుంకుమపూజలు ఆచరిస్తున్నారు. పున్నమి చంద్రుడు శ్రవణా నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసంలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క విశిష్టత ఉంటుందని ప్రముఖ వేదపండితులు లక్ష్మణస్వామి తెలిపారు.
శ్రావణ శుక్రవారం పూజలు ప్రారంభం
జిల్లాలో శ్రావణ శుక్రవారం పూజలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఒక శుక్రవారం గడిపోవడంతో మహిళలు రాబోవు వారాల్లో పూజలకు సమాయత్తమవుతున్నారు. ఈ మాసంలో వచ్చే అన్ని శుక్రవారాల్లోనూ శ్రావణ లక్ష్మి పూజలు చేస్తారు. ఈ ఏడాది శ్రావణమాసంలో నాలుగు శుక్రవారాలు, నాలుగు మంగళవారాలు వచ్చాయి. ఆగస్టు 22న వరలక్ష్మివత్రం చేయాల్సి ఉంది. వివాహితులు ఈ నెలలో నోములు, వ్రతాలతో గడుపుతారు. వరలక్ష్మివత్రం రోజున అమ్మవారికి కలశం పెట్టి నిండుగా అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. ఇలా చేస్తే అయురారోగ్యాలతో పాటు సౌభాగ్యం లభిస్తుందని విశ్వాసం.
ఆలయాలు ముస్తాబు
శ్రావణ మాసం సందర్భంగా జిల్లాలోని పలు అమ్మవారి ఆలయాలుతో పాటు ప్రముఖ ఆలయాలు ముస్తాబయ్యాయి. ఆలయాల్లో నిత్యం వ్రతాలు, హోమాలు నిర్వహిస్తున్నారు. ఈ వ్రతాలు, హోమాల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని, తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు.
పండుగల మాసం.. శ్రావణం
శ్రావణ మాసం పండుగలు, వ్రతాలకు ప్రతీతి. ఈ నెలలో ప్రధానంగా 7వ తేదీన నాగుల పంచమి, 12న వరలక్ష్మీవ్రతం, 13న తిరుమల శ్రీవారి పవితోత్సవం ప్రారంభం, 14న పుత్ర ఏకాదశి, 16న తిరుమల శ్రీవారి పవితోత్సవాలు సమాప్తం, 18న రాఖీ పౌర్ణమి, 21న సంకష్ట హరచతుర్థి, 25న శ్రీకష్ణుడి జన్మదినమైన గోకులాష్టమి, అలాగే హయగ్రీవ, రాఘవేంద్ర జయంతులు, పుత్రదా, కామికి ఏకాదశలు ఈ నెలలోనే వస్తాయి. తమ భర్తలు, కుమారులు పంటపొలాల్లో సంచరించే సమయంలో ఎలాంటి హానీ తలపెట్టోందని నాగేంద్రుడిని మహిళలు పూజించే పండుగే నాగుల పంచమి. సోదర క్షేమాన్ని, తమకు రక్షణ భాగ్యాన్ని కల్పించమని కోరుతూ నిర్వహించేదే రాఖీ పౌర్ణమి మరో ముఖ్యమైన వేడుక. అలాగే యజ్ణోపవీతాన్ని ధరించేందుకు జంధ్యాల పౌర్ణమి. గ్రామదేవతలను కొలిచేందుకు పోలాల అమావాస్య పండుగలను ఈ మాసంలో వస్తాయి.
వ్రతాలకు ప్రతీతి
శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మహిళలు మంగళగౌరిని పూజిస్తారు. పార్వతీ దేవికి మరో పేరే మంగళగౌరి. కొత్తగా వివాహమైన వధువులు ఈ వ్రతం ఆచరిస్తే సౌభాగ్యం. ఐదోతనం కలకాలం సిద్ధిస్తుందని విశ్వాసం. మరో ముఖ్యమైన శ్రీవరలక్ష్మీ వ్రతం ఆచరిస్తే అష్టలక్ష్మిలను కొలిచినట్టే. పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం ఆచరించడానికి జిల్లాలోని మహిళలు ఎదురుచూస్తున్నారు.
నిత్యదర్శనం.. యోగ్యదాయకం
వ్రతాలు, నోములు అచరించడం వీలుకానివారు నిత్యం ఆలయాలను సందర్శించి దైవదర్శనం చేసుకోవడం ద్వారా విశేష ఫలితాన్ని పొందవచ్చు. ఉపవాసదీక్ష చేస్తే దైవానుగ్రహానికి మార్గం సుగమవుతుంది. మనిషిలో ప్రవర్తలోనూ విశేష మార్పు వస్తుంది.
––విశేశ్వరస్వామి, జిల్లా అర్చక సమాఖ్య అధ్యక్షుడు
Advertisement