క్రీడలతోనే మానసిక వికాసం
Published Fri, Sep 30 2016 11:56 PM | Last Updated on Fri, May 25 2018 5:52 PM
– డీఎస్పీ కృష్ణమూర్తి
– అండర్–19 చెస్ విజేతలు అభిరాం, శ్రేష్ణనాదకర్ణి
మహబూబ్‌నగర్ క్రీడలు : క్రీడలతో మానసిక వికాసంతోపాటు దేహదారుఢ్యంగా ఉండొచ్చని డీఎస్పీ కృష్ణమూర్తి అన్నారు. జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక రాజేంద్రనగర్‌లోని న్యూరిషి పాఠశాలలో జిల్లాస్థాయి అండర్–19 చెస్ టోర్నీ కమ్ సెలక్షన్స్ నిర్వహించారు. బహుమతుల ప్రదానోత్సవానికి డీఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం క్రీడలకు ప్రాధాన్యత పెరిగిందన్నారు. క్రీడల్లో రాణించేవారు చదువులో కూడా ముందుంటారని తెలిపారు. నైపుణ్యంగల క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. తాను మొదటగా ఫిజికల్ డైరెక్టర్‌గా పనిచేసినట్లు గుర్తుచేశారు. జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ మద్ది అనంతరెడ్డి మాట్లాడుతూ ఆటల్లో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించి క్రీడాస్ఫూర్తి చాటాలని పిలుపునిచ్చారు. చెస్ మేదస్సుకు సంబంధించిదని, దీంట్లో ఎత్తు, పైఎత్తులు ఉంటాయని తెలిపారు. జిల్లా క్రీడాకారులు చెస్‌లో జాతీయ, అంతర్జాతీయస్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామలక్ష్మయ్య, ప్యాట్రన్ లయన్ నటరాజ్, కృష్ణ, రవి తదితరులు పాల్గొన్నారు.
చెస్ టోర్నీ ఫలితాలు
జిల్లాస్థాయి అండర్–19 టోర్నీకి జిల్లా వ్యాప్తంగా క్రీడాకారులు పాల్గొన్నారు. బాలుర విభాగంలో అభిరాం (అలంపూర్) ప్రథమ, వికాస్ (కల్వకుర్తి), ఆదిత్య (వనపర్తి), సుచంద్రపాల్ (కల్వకుర్తి), బాలికల విభాగంలో శ్రేష్ణనాదకర్ణి ప్రథమ, స్రవంతి (మహబూబ్‌నగర్), మోనిక (గట్టు), అనిత (వనపర్తి) మిగతా స్థానాల్లో నిలిచారు. వీరు ఖమ్మంలో ఈ నెల 3నుంచి 5 వరకు జరిగే అండర్–19 రాష్ట్రస్థాయి టోర్నీలో పాల్గొంటారని జిల్లా చెస్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.
Advertisement