భిక్షాటనతో గోపాలమిత్రల నిరసన
అనంతపురం అగ్రికల్చర్: అకారణంగా తమను విధుల నుంచి తొలగించడంతో ఉపాధిలేక రోడ్డున పడ్డామని విధుల నుంచి తొలగించిన గోపాలమిత్రల సంఘం నాయకుడు వెంకటేష్ ఆందోళన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కోసం అందరి వద్ద మోకరిల్లుతున్నా... తమ గోడు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విధుల్లోకి తీసుకోవాలంటూ స్థానిక పశుశాఖ, డీఎల్‌డీఏ కార్యాలయం ఎదుట గోపాలమిత్రలు చేపట్టిన ఆందోళన కార్యక్రమం బుధవారం 12వ రోజుకు చేరుకుంది.
ఈ సందర్భంగా గోపాలమిత్రలు కలెక్టరేట్ ఎదుట మూగిటలు చేతపట్టుకుని భిక్షాటనతో నిరసన కార్యక్రమం కొనసాగించారు. ఉపాధి లేక రోడ్డున పడిన తమకు భిక్షం వేయాలని కోరారు. డీఎల్‌డీఏ ఓవో కక్షకట్టి తమను తొలగించారని విమర్శించారు. తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమన్నారు. అంతవరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పెద్దన్న, ఓబుళపతి, గురివిరెడ్డి, ఓబయ్య, జగన్‌మోహన్‌రెడ్డి, శివారెడ్డి, బాలరాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.