gopalamithras
-
భిక్షాటనతో గోపాలమిత్రల నిరసన
అనంతపురం అగ్రికల్చర్: అకారణంగా తమను విధుల నుంచి తొలగించడంతో ఉపాధిలేక రోడ్డున పడ్డామని విధుల నుంచి తొలగించిన గోపాలమిత్రల సంఘం నాయకుడు వెంకటేష్ ఆందోళన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కోసం అందరి వద్ద మోకరిల్లుతున్నా... తమ గోడు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విధుల్లోకి తీసుకోవాలంటూ స్థానిక పశుశాఖ, డీఎల్‌డీఏ కార్యాలయం ఎదుట గోపాలమిత్రలు చేపట్టిన ఆందోళన కార్యక్రమం బుధవారం 12వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా గోపాలమిత్రలు కలెక్టరేట్ ఎదుట మూగిటలు చేతపట్టుకుని భిక్షాటనతో నిరసన కార్యక్రమం కొనసాగించారు. ఉపాధి లేక రోడ్డున పడిన తమకు భిక్షం వేయాలని కోరారు. డీఎల్‌డీఏ ఓవో కక్షకట్టి తమను తొలగించారని విమర్శించారు. తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమన్నారు. అంతవరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పెద్దన్న, ఓబుళపతి, గురివిరెడ్డి, ఓబయ్య, జగన్మోహన్రెడ్డి, శివారెడ్డి, బాలరాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
న్యాయం జరిగే వరకూ పోరాటం
అనంతపురం అగ్రికల్చర్: విధుల్లోంచి తప్పించిన తమను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలనే ప్రధాన డిమాండ్‌తో గోపాలమిత్రలు చేస్తున్న ధర్నా బుధవారం ఐదో రోజుకు చేరుకుంది. స్థానిక పశుసంవర్ధకశాఖ, డీఎల్‌డీఏ కార్యాలయం ఎదుట ఐదో రోజు గోపాలమిత్రలు మోకాళ్లపై నిల్చుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకుడు వెంకటేష్ మాట్లాడుతూ... ఐదు రోజులుగా ధర్నా చేస్తున్నా.. ఒక్కరూ తమ గోడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి లేక కుటుంబాలు రోడ్డున పడ్డామని, కుటుంబ పోషణ భారమై నరసింహులు అనే గోపాలమిత్ర ఆత్మహత్యాయత్నం చేసి చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్, పశుశాఖ, డీఎల్‌డీఏ అధికారులు తమకు న్యాయం చేయడానికి ముందుకు రావాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామన్నారు. తమకు న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తామన్నారు. -
గోపాలమిత్రలను తొలగించడం అన్యాయం
అనంతపురం అగ్రికల్చర్: న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని అడిగిన పాపానికి 67 మంది గోపాలమిత్రలను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అన్యాయమని గోపాలమిత్రల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.వెంకటేశు శుక్రవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. గోపాలమిత్రలను తొలగించినట్లు ‘సాక్షి’లో పత్రికలో ప్రచురితమైన కథనంపై వివరణ కోరేందుకు డీఎల్‌డీఏ కార్యాలయానికి వెళ్లగా సీఈఓ ఇచ్చిన పత్రికా ప్రకటనతో తమకు సంబంధం లేదని చైర్మన్, ఈఓలు చెప్పారన్నారు. 16 సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో నెట్టుకొస్తున్న తరుణంలో ఉన్నఫలంగా తొలగిస్తే ఆయా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి కల్పించారన్నారు. తొలగించిన వారికి విధుల్లోకి తీసుకోకుంటే రైతులు, ప్రజల సాయంతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. తీసుకునే ప్రసక్తేలేదు: తొలగించిన 67 మంది గోపాలమిత్రలను మళ్లీ తీసుకునే ప్రసక్తే లేదని ఏపీ ఎల్డీఏ సీఈఓ డాక్టర్ ఈడీ కొండలరావు స్పష్టం చేశారు. వరుణయాగం కోసం శుక్రవారం జిల్లాకు వచ్చిన ఆయన సాక్షితో మాట్లాడుతూ... అవకాశం ఇచ్చినా వారి నుంచి స్పందన లేకపోవడంతో తొలగించినందున మరో అవకాశం ఉండబోదన్నారు.