న్యాయం జరిగే వరకూ పోరాటం
అనంతపురం అగ్రికల్చర్: విధుల్లోంచి తప్పించిన తమను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలనే ప్రధాన డిమాండ్‌తో గోపాలమిత్రలు చేస్తున్న ధర్నా బుధవారం ఐదో రోజుకు చేరుకుంది. స్థానిక పశుసంవర్ధకశాఖ, డీఎల్‌డీఏ కార్యాలయం ఎదుట ఐదో రోజు గోపాలమిత్రలు మోకాళ్లపై నిల్చుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకుడు వెంకటేష్ మాట్లాడుతూ... ఐదు రోజులుగా ధర్నా చేస్తున్నా.. ఒక్కరూ తమ గోడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉపాధి లేక కుటుంబాలు రోడ్డున పడ్డామని, కుటుంబ పోషణ భారమై నరసింహులు అనే గోపాలమిత్ర ఆత్మహత్యాయత్నం చేసి చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్, పశుశాఖ, డీఎల్‌డీఏ అధికారులు తమకు న్యాయం చేయడానికి ముందుకు రావాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామన్నారు. తమకు న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తామన్నారు.