ఫ్యాన్లు తిరగవు.. లైట్లు వెలగవు!
– ఎంఎం వార్డులో రోగుల అవస్థలు
– మరుగుదొడ్ల శుభ్రతా నామమాత్రమే
– ఫిర్యాదుచేసినా పట్టించుకోని అధికారులు
- ఇదీ సర్వజనాస్పత్రి దుస్థితి
అనంతపురం మెడికల్ : పేదలకు పెద్ద దిక్కుగా ఉన్న ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో రోగుల అవస్థలు వర్ణణాతీతం. ఫ్యాన్లు తిరక్క.. లైట్లు వెలగక రాత్రి వేళ చీకట్లోనే గడపాల్సిన దుస్థితి. ఎంఎం (మేల్ మెడిసిన్) వార్డులో నెల రోజులుగా ఈ పరిస్థితి ఉన్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. ఇక్కడ సుమారు 85 మంది వరకు రోగులు వివిధ వ్యాధులతో చికిత్స పొందుతున్నారు. వార్డులోని మొదటి గదిలో ఐదు లైట్లు, మూడు ఫ్యాన్లు, రెండో గదిలో ఏడు లైట్లు, మూడో గదిలో ఒక లైట్, నాలుగో గదిలో ఒక లైట్, ఆరు ఫ్యాన్లు కొద్ది రోజులుగా పని చేయడం లేదు. దీంతో రోగులు, వారి సహాయకులు అవస్థలు పడుతున్నారు. రాత్రి అయితే గదుల్లో చీకటి నెలకొంటోంది. ఇక్కడి పరిస్థితిని వార్డు డ్యూటీల్లో ఉన్న సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోతోంది. ఇప్పటికే నాలుగు సార్లు ఫిర్యాదు చేశారు. అయినా వారిలో చలనం లేదు. పైగా వార్డులో సిబ్బంది కొరత కూడా వేధిస్తోంది. నర్సింగ్ విద్యార్థులు మధ్యాహ్నానికే వెళ్లిపోతుండడంతో స్టాఫ్ నర్సులపై పనిభారం పడుతోంది.
అందుబాటులో లేని ఎంఎన్‌ఓ
జ్వరాలు, గుండె సంబంధిత వ్యాధులు, ఇతరత్రా జబ్బులతో ఇక్కడికొచ్చే వారికి స్కానింగ్, పరీక్షలు చేయాల్సి వస్తే అంతే. ఒక ఎంఎన్‌ఓను కేటాయించగా సమయానికి ఆయనా అందుబాటులో ఉండని పరిస్థితి. ఇక పరిశుభ్రత కూడా నామమాత్రంగా ఉంది. వార్డుల్లోని మరుగుదొడ్లు దుర్వాసన వస్తున్నాయి. రోజూ మూడు సార్లు శుభ్రం చేయాల్సి ఉన్నా మధ్యాహ్నం మాత్రమే శుభ్రం చేస్తున్నట్లు రోగులు చెబుతున్నారు. వ్యర్థ పదార్థాలను వేయడానికి వార్డు బయట ప్రత్యేక బిన్స్ ఏర్పాటు చేయాల్సి ఉన్నా కొన్ని మాత్రమే దర్శనమిస్తున్నాయి. నిబంధనల ప్రకారం నాలుగు రకాల బిన్స్ ఉండాలి. వాటిలో సూది మందులు, ఆహార పదార్థలు, జీవ వ్యర్థాలు వంటికి వేరుచేసి వేయాలి. కానీ ఎలా పడితే అలా పడేస్తున్నారు. నీడిల్స్ కిందే పడి ఉండడంతో చిన్న పిల్లలు దాన్ని తీసుకునే అవకాశం లేకపోలేదు. వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. ఇక రాత్రి వేళ దోమల బెడద కూడా ఎక్కువగా ఉందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నా యాజమాన్యం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
రాత్రయితే చీకటే
నాది కర్నూలు జిల్లా జొన్నగిరి. మలేరియా రావడంతో ఇక్కడే చికిత్స తీసుకుంటున్నా. కొన్ని రోజులుగా వార్డులో లైట్లు వెలగడం లేదు. రాత్రిపూట దోమలు ఎక్కువగా ఉన్నాయి. రోగం నయం అవుతుందో లేదో తెలీదు కానీ కొత్త రోగాలొస్తాయేమోనని భయంగా ఉంది. - : స్వామినాయక్
బాత్‌రూంలు కంపు కొడుతున్నాయ్
నాది శింగనమల మండలం మదిరేపల్లి. గుండెనొప్పిగా ఉండడంతో పది రోజుల నుంచి ఇక్కడే ఉన్నా. ఉదయాన్నే బాత్‌రూంకు వెళ్లాలంటే కంపుకొడుతోంది. శుభ్రం చేయడం లేదు. ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. - : వెంకటనాయుడు