ప్రభుత్వ దుకాణం
ప్రభుత్వ దుకాణం
Published Fri, Jan 20 2017 11:28 PM | Last Updated on Tue, Sep 5 2017 1:42 AM
- నాట్ ఫర్ సేల్ ఉన్నా రూ.8 చొప్పున వసూలు
- సమాధానం చెప్పలేకపోతున్న ఏఎన్‌ఎంలు
- ఉచితంగానే పంపిణీ చేస్తున్న కేంద్రం
- విమర్శలకు తావిస్తున్న సర్కారు తీరు
యుక్త వయస్సు బాలికల వ్యక్తిగత పరిశుభ్రతకు కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా పంపిన శానిటరీ న్యాప్‌కిన్లను రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకుంటోంది. వీటిపై ‘నాట్ ఫర్ సేల్’ అని ముద్రించి ఉన్నా అధికారికంగా వీటిని రూ.8లకు విక్రయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం విమర్శలకు తావిస్తోంది.
కర్నూలు(హాస్పిటల్):
రాష్ట్రీయ కిశోర స్వాస్త్య కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం యుక్త వయస్సు బాలికలకు శానిటరీ న్యాప్‌కిన్లను పంపిణీ చేస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలోని 13 జిల్లాలతో పాటు కర్నూలుకు న్యాప్‌కిన్లు సరఫరా చేశారు. వీటిని ఏపీఎంఎస్‌ఐడీసీ కొనుగోలు చేసి జిల్లా కేంద్రాలకు పంపిణీ చేసింది. ఇక్కడి నుంచి పీహెచ్‌సీలకు.. అక్కడ నుంచి ఏఎన్‌ఎంలకు, వారి నుంచి ఆశా వర్కర్లకు ఈ న్యాప్‌కిన్లు చేరుతున్నాయి. వారు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోని యుక్త వయస్సు బాలికలకు వీటిని ఉచితంగా అందజేయాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వీటిని ఒక్కొక్కటి రూ.8లకు విక్రయించాలంటూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఈ మేరకు ఇప్పటికే 10 పీహెచ్‌సీలకు ఇవి చేరాయి. నన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో రెండు రోజులుగా వీటిని యుక్త వయస్సు బాలికలకు పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక ఆశా వర్కర్లు రూ.8ల చొప్పున వీటిని విక్రయిస్తున్నారు. ఇందుకు ఒక్కో ప్యాకెట్‌కు ఒక్క రూపాయి కమీషన్ వస్తుంది. మిగిలిన రూ.7లను ఆశా వర్కర్లు డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీకి జమ చేయాలి. జిల్లా సొసైటీ వారు ఈ మొత్తాన్ని స్టేట్ హెల్త్ సొసైటికి డిపాజిట్ చేస్తారు. కాగా ఈ ప్యాకెట్‌లపై నాట్ ఫర్ సేల్(విక్రయించకూడదు) అని ఉండటంతో వాటిని కొనుగోలు చేసిన బాలికలు, వారి తల్లిదండ్రులు ఆశాలను, ఏఎన్‌ఎంలను ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తే మీరు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఆశాలు తీవ్ర మనోవేదనకు లోనవుతున్నారు.
రూ.8ల చొప్పున కొన్నాం
మా పిల్లల కోసం రూ.8ల చొప్పున న్యాప్‌కిన్‌లు కొనుగోలు చేశాం. కానీ ప్యాకెట్లపై నాట్ ఫర్ సేల్ అని ముద్రించి ఉంది. ప్రభుత్వం ఉచితంగా ఇవ్వమని చెబితే వీరు అమ్ముకుంటున్నారనే అనుమానం వస్తోంది. వీరు చూస్తే ప్రభుత్వమే మాకు అమ్మాలని చెప్పిందని చెబుతున్నారు.
–ఆనంద్, నన్నూరు
విక్రయించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు
యుక్త వయస్సు బాలికలకు పంపిణీ చేసే శానిటరీ న్యాప్‌కిన్లను ఉచితంగా పంపిణీ చేయడం కుదరదు. వాటిపై పొరపాటుగా నాట్ ఫర్ సేల్ అని ముద్రించినట్లు ఉన్నారు. వీటిని ఒక్కొక్కటి రూ.8ల చొప్పున విక్రయించాలని ప్రభుత్వమే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
–హేమలత, ఆర్‌బీఎస్‌కే జిల్లా కో ఆర్డినేటర్
Advertisement
Advertisement