ధర్మాస్పత్రుల్లో అధర్మ పాలన
►సిబ్బంది ఇష్టారాజ్యం
►ప్రసవంలో మగపిల్లాడైతే ఓ రేటు...
►ఆడపిల్లయితే మరో రేటు
►కొరవడిన జవాబుదారితనం
కడప రూరల్ : ఇటీవల ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రిలో చోటు చేసుకున్న సంఘటనతో అందరూ నిశ్చేష్టులయ్యారు. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు అసహనానికి గురై ఏకంగా హెచ్‌ఐవీ రోగి నుంచి సేకరించిన రక్తం సిరంజితో దాడికి పాల్పడటం దారుణం. ఈ సంఘటనతో అసలు ధర్మాసుపత్రుల్లో ఇంకా ఏం జరుగుతోందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. మొత్తం మీద ఎప్పటినుంచో వైద్య విధానం గాడితప్పిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలోని ఆస్పత్రులు
కడపలో ప్రధాన ఆస్పత్రి రిమ్స్ ఉంది. ఈ ఆస్పత్రిలో 24 గంటలు నిరంతరాయంగా వైద్య సేవలను అందించాలి. వైద్య విధాన పరిషత్‌లో ఒకటి ప్రొద్దుటూరులో జిల్లా ఆస్పత్రి, పులివెందులలో ఏరియా ఆస్పత్రితోపాటు 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 3, 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 9, మొత్తం 14 హాస్పిటల్స్ ఉన్నాయి. ఇవన్నీ దాదాపుగా 24 గంటలు పనిచేయాలి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో 75 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు), 448 సబ్ సెంటర్లు ఉన్నాయి. ఇవి ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్య సేవలు అందిస్తాయి.
సిబ్బంది ఇష్టారాజ్యం
కాగా, ఈ హాస్పిటల్స్‌లోని సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కడపరిమ్స్ తర్వాత వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలోని ఆస్పత్రులు కీలకంగా మారాయి. ఎందుకంటే రిమ్స్ తర్వాత ఇవి దాదాపుగా 24 గంటలు వైద్య సేవలను అందించాలి. ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రిలో ఇటీవల జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే! ఇంకా అక్కడ ఎన్నో లోపాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే రాజంపేటలో చీకటిపడితే వైద్యం అందని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ నలుగురికిగాను ముగ్గురు డాక్టర్లు మాత్రమే పనిచేస్తున్నారు. సాయంత్రం పూట ఏవైనా కేసులు వస్తే అక్కడిసిబ్బంది కడపకు రెఫర్ చేస్తున్నారు. అలాగే మైదుకూరు ఆస్పత్రి పరిస్థితి కూడా అధ్వాన్నంగా మారింది. అక్కడ ఒక ఫార్మసిస్టును ఏడాది క్రితం సస్పెండ్ చేశారు. ఇంతవరకు ఆ స్థానంలో ఎవరినీ నియమించలేదు. ఇదీ 30 పడకల హాస్పిటల్. ఆరుగురికిగాను నలుగురు మాత్రమే వైద్యులు పనిచేస్తున్నారు. గతంలో నెలకు ఇక్కడ 60 కాన్పులు జరిగేవి. ఇప్పుడు మహా అంటే 13కూడా జరగని పరిస్థితి ఏర్పడింది. కాగా జమ్మలమడుగు హాస్పిటల్‌లో గైనకాలజిస్టుల కొరత ఉంది. చివరికి ఇక్కడ ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చే వైద్యుడు కూడా లేకపోవడం దారుణం.
ప్రధానంగా దాదాపుగా అన్ని హాస్పిటల్‌లో జబ్బుకో రేటును నిర్ణయించారు. ముఖ్యంగా ప్రసవాలకు సంబంధించి మగపిల్లవాడు జన్మిస్తే రూ. 3–5 వేల వరకు, అదే ఆడపిల్ల జన్మిస్తే రూ. 2–3 వేల వరకు వసూలు చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇదేమిటని ప్రశ్నిస్తే ప్రైవేటు ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకుంటే రూ. 40–50 వేలు కట్టాలి కదా....ఇక్కడ ఆ మాత్రమైనా ఇవ్వలేరా? అని సిబ్బంది ఎదురు ప్రశ్నిస్తున్నట్లుగా సమాచారం.
ప్రైవేటు వైద్యానికే వైద్యుల మొగ్గు
దాదాపు అన్ని ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు తాము ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు వైద్యానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రోగులు ఎవరైనా ప్రభుత్వ ఆస్పత్రులకు వెళితే అక్కడ పరీక్షించి నామమాత్రంగా వైద్య సేవలు అందించి తమ క్లినిక్‌లకు రావాలని చెబుతున్నటు తెలుస్తోంది. దీంతో సాయంత్రం పూట వైద్యం కోసం హాస్పిటల్స్‌కు వెళ్లిన వారు అక్కడ డాక్టర్లు లేకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీయక తప్పని పరిస్థితి ఏర్పడింది. గాడి తప్పిన వైద్య విధానాన్ని సరిదిద్ది ధర్మాస్పత్రుల్లో ధర్మ పాలన జరిగేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.