Rimes Hospital
-
రిమ్స్‌లో శిశువు అపహరణ
ఆదిలాబాద్: ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో నవజాత శిశువును అపహరించిందో మహిళ. సీసీ కెమెరాలకు చిక్కకుండా ఆస్పత్రి నుంచి బయటపడి.. పక్కా ప్రణాళికతో జిల్లా దాటేందుకు పన్నిన వ్యూహం బెడిసికొట్టింది. ఫిర్యా దు అందిన క్షణాల్లోనే స్పందించిన పోలీసులు.. రెండు గంటల వ్యవధిలోనే శిశువును తల్లి ఒడికి చేర్చారు. ఈ ఘటన మంగళవారం రిమ్స్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ఇటీవల హైదరాబాద్ సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ఆస్ప త్రిలో శిశువు కిడ్నాప్ ఘటన మరువకముందే ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో పసికందు అపహరణ కలకలం సృష్టిం చింది. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం చోరపల్లికి చెందిన గణేష్ భార్య మమత ఆరు రోజుల క్రితం రిమ్స్ ఆస్పత్రిలో మగ శిశువుకు జన్మనిచ్చింది. మంగళవారం డిశ్చార్జి కావాల్సి ఉంది. ఆదిలాబాద్ పట్టణం పిట్టలవాడకు చెందిన సోయం పుష్పలత, నగేష్ దంపతులకు సంతానం లేదు. వీరిద్దరూ గతంలో రిమ్స్ ఆస్పత్రిలో పని చేశారు. పుష్పలత ఏఎన్ఎంగా శిక్షణ పొం దగా.. నగేష్ ఫుడ్ స్టోర్‌లో పని చేశాడు. పిల్లలు లేకపోవడంతో రిమ్స్‌లో శిశువును అపహరించాలని నిర్ణయించారు. వీరికి ఆస్పత్రి పరిసరాలు తెలిసి ఉండటంతో సీసీ కెమెరాలకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వేకువజామున 3 గంటల ప్రాంతంలో శిశువును అపహరించిన పుష్పలత.. రేడియాలజీ విభా గంలోకి వెళ్లి అక్కడ ఉన్న చిన్న గేటు నుంచి ఆస్పత్రి బయటపడింది. అయితే.. మమత స్పృహలోకి వచ్చి శిశువు కనిపించకపోవడంతో తెల్లవారుజామున 3.15కి రిమ్స్ పోలీసు ఔట్ పోస్టు సిబ్బందికి ఫిర్యాదు చేసింది. వేకువజామున చెక్‌పోస్టులు.. తనిఖీలు సమాచారం అందుకున్న ఆదిలాబాద్ డీఎస్పీ నర్సింహారెడ్డి, టూటౌన్ సీఐ స్వామి రిమ్స్‌కు చేరుకుని ఘటన వివరాలను ఎస్పీ విష్ణు ఎస్ వారియర్‌కు తెలిపారు. ఆయన ఆదేశాల మేర కు సరిహద్దు ప్రాంతాలతోపాటు మండలాల్లో ఎస్ఐలు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. నేరడిగొండ చెక్‌పోస్టు వద్ద జీపులో వెళ్తున్న మహిళను అనుమానించిన పోలీసులు ఆమె వివరాలు అడగడంతో అసలు విషయం బయటపడింది. తాను తీసుకెళ్తున్న పసికందును రిమ్స్ నుంచి తెచ్చానని చెప్పడంతో పోలీసులు పుష్పలత, నగేష్‌లను అదుపులోకి తీసుకున్నారు. శిశువుపై ఉన్న చిన్న గుడ్డ ఆధారంగా గుర్తుపట్టిన తల్లి తన బిడ్డేనని చెప్పడంతో ఆమెకు అప్పగించారు. నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. -
క్యాన్సర్‌కు చికిత్స
రిమ్స్ ఆరోగ్యశ్రీ వార్డులో చికిత్స పొందుతున్న ఈమె పేరు భీంబాయి. కుమురంభీం జిల్లా తిర్యాణికి చెందిన ఈమె కొంతకాలంగా కడుపులో గడ్డతో బాధపడుతోంది. పేదరికం కారణంగా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లలేని పరిస్థితిలో 20 రోజుల క్రితం రిమ్స్‌కు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుంది. కడుపులో క్యాన్సర్ గడ్డ ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకుని చికిత్స అందించారు. మంగళవారం రోజు హైదరాబాద్ నుంచి వచ్చిన ఆంకో సర్జన్ డాక్టర్ గిరీష్ రిమ్స్ డైరెక్టర్ అశోక్, వైద్య బృందంతో కలిసి భీంబాయికి ఆపరేషన్ చేశారు. క్యాన్సర్ గడ్డను తొలగించి భీంబాయి మళ్లీ ప్రాణం పోశారు. ఎన్నో రోజులుగా కడుపులో గడ్డతో బాధపడుతున్న రూపాయి ఖర్చు లేకుండా ఆపరేషన్ చేశారని ఆమెతోపాటు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పేదలకు వరప్రదాయినిగా ఉన్న రిమ్స్ ఆస్పత్రిలో మరిన్ని అత్యాధునిక సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. రెండు నెలల క్రితం జిల్లా కేంద్రం ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రిలో ప్రారంభమైన క్యాన్సర్ శస్త్రచికిత్సల సేవలు క్యాన్సర్ బాధితులకు ఎంతో ఊరటనిస్తున్నాయి. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వివిధ రకాల క్యాన్సర్‌తో ఎంతోమంది బాధపడుతున్నారు. ఆర్థికంగా ఉన్నవారు నాగ్‌పూర్, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటుండగా.. పేదవారు చిన్న చిన్న వైద్య పరీక్షలతోనే కాలం వెల్లదీస్తున్నారు. రిమ్స్‌లో కా>్యన్సర్కు వైద్య సేవలు అందుతున్నట్లు ఇంకా చాలామందికి తెలియకపోవడంతో దూరభారమైన ఇతర ప్రాంతాలకు వైద్యం కోసం వెళ్తున్నారు. క్యాన్సర్ బాధితులకు రిమ్స్‌లో అందుతున్న సేవలపై కథనం. ఇప్పటి వరకు 25 శస్త్రచికిత్సలు.. రిమ్స్ ఆస్పత్రిలో 15 రకాల క్యాన్సర్‌కు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యమైన శస్త్రచికిత్సలు సంబంధించిన థైరాయిడ్, అండాశయం, గర్భకోశ, నోటిక్యాన్సర్, ఛాతి క్యాన్సర్ వంటి వాటికి శస్త్రచికిత్సలు చేస్తున్నారు. ఇప్పటివరకు 25 రకాల క్యాన్సర్ ఆపరేషన్లు చేశారు. ఆపరేషన్ థియేటర్లో ప్రత్యేక వైద్య పరికరాలు కాట్రేమిషన్, ప్లాస్టర్ల ద్వారా శస్త్రచికిత్సలు చేస్తున్నారు. ఆంకో సర్జన్‌తోపాటు 12 మంది వైద్య నిపుణుల బృందం ఆపరేషన్లలో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలియక ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 500 నుంచి 600 మంది వరకు క్యాన్సర్ బాధితులు ఉండొచ్చని వైద్య శాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. జిల్లా మహారాష్ట్ర సరిహద్దులో ఉండడంతో ఈ ప్రాంతంలో గుట్కా, తంబాకు తినే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో ఎక్కువ మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. పలువురు రక్త, కాలేయ, ఎముకలు, నోటి, కడుపు, అన్నవాహిక, ఊపిరితిత్తుల క్యాన్సర్లతో బాధపడుతున్నారు. సరైన వైద్య సేవలు లేక ఉమ్మడి జిల్లాలో ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారు ఈ వ్యాధికి గురైతే సుదూర ప్రాంతాలకు వెళ్లలేక, ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు చేయించుకోలేక దేవుడిపై భారం వేసి ఇక్కడే అందుబాటులో ఉన్న చికిత్స తీసుకుంటున్నారు. దీంతో వారికి పూర్తిస్థాయి చికిత్స అందక మృత్యువాత పడుతున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే ఆసిఫాబాద్, నిర్మల్, తిర్యాణి, భైంసా, కాగజ్‌నగర్, తదితర దూర ప్రాంతాల నుంచి క్యాన్సర్ బాధితులు వస్తున్నారు. ఆరోగ్యశ్రీ అండగా.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం పేదలకు అండగా నిలుస్తోంది. లక్షల రూపాయల విలువ చేసే శస్త్రచికిత్సలు ఉచితంగా చేస్తున్నారు. కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యం చేసుకునే స్థోమత లేని పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందుతోంది. ఇందులో భాగంగానే రిమ్స్‌లో జరుగుతున్న క్యాన్సర్ శస్త్రచికిత్సలు ఆరోగ్యశ్రీ పథకం కింద చేస్తున్నారు. థైరాయిడ్, గర్భాశయం, నోటి, అండాశయం వంటి క్యాన్సర్ శస్త్రచికిత్సలకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.2 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇకా రవాణా చార్జీలు, వ్యక్తిగత చార్జీలు అంటే మరో రూ.50 వేలు ఖర్చవుతాయి. అలాంటిది రిమ్స్‌లో ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్లు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే సూపర్ స్పెషాలిటీ ఆంకో సర్జన్‌కు రూ.6 వేలు చెల్లిస్తున్నారు. ఆపరేషన్‌కు ఉపయోగించే ప్రత్యేక పరికరాలు ఆరోగ్యశ్రీ కిందనే కొనుగోలు చేస్తారు. ఆపరేషన్ తర్వాత రోగికి అవసరమైన వైద్య పరీక్షలు, మందులు ఆరోగ్యశ్రీ వార్డులోనే అందుతాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎంఐసీయూలో సైతం క్యాన్సర్ వాధ్యిగ్రస్తులను ఉంచుతున్నారు. నాలుగేళ్లుగా బాధపడ్డ.. నాలుగు సంవత్సరాలుగా థైరాయిడ్‌తో బాధపడ్డాను. నాలుగు రోజుల క్రితం రిమ్స్‌కు వైద్యం కోసం వచ్చి అడ్మిట్ అయ్యా. ప్రైవేట్‌లో కూడా దీనికి వైద్యం లేకపోవడంతో ఎంతో ఇబ్బందులు పడ్డా. రిమ్స్‌లో అడ్మిట్ అయ్యాక వెంటనే డాక్టర్ ఆపరేషన్ చేస్తామని చెప్పారు. ఎక్కువ రోజులు కూడా ఉంచుకోకుండా నాలుగు రోజుల్లోనే ఆపరేషన్ చేశారు. ఇప్పుడు పాణం మంచిగనిపిస్తుంది. వారం రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామన్నారు. – ఎల్లమ్మ, జైనథ్ సద్వినియోగం చేసుకోవాలి రిమ్స్‌లో క్యాన్సర్ సేవలు అందుబాటులోకి రావడంతో ఉమ్మడి జిల్లా ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. క్యాన్సర్ బాధితులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా క్యాన్సర్ ఆపరేషన్లు చేస్తున్నాం. ప్రత్యేక వైద్య నిపుణుల సహాయంతో, ఆధునిక పరికరాలు అందుబాటులో ఉంచాం. చాలామందికి రిమ్స్‌లో క్యాన్సర్ ఆపరేషన్లు జరుగుతున్నట్లు అవగాహన లేదు. ఇప్పటికైనా వ్యాధిగ్రస్తులు గుర్తించి వైద్య సేవలు పొందాలి. – డాక్టర్ అశోక్‌కుమార్, రిమ్స్ డైరెక్టర్ -
ఆస్పత్రిలో అమృతాహారం!
శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ఆరోగ్య ప్రదాయినిగా జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్)కి పేరు. దీన్ని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏర్పాటు చేశారు. ఇది 500 పడకల ఆసుపత్రి. ఇక్కడి రోగులకు ఆసుపత్రి సేవల్లో భాగంగా భోజనం అందుతుంది. వారికి సహాయకులుగా వచ్చే కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రం బయట క్యాంటీన్లకు వెళ్లాల్సి వచ్చేది. వారికి కూడా ఆసుపత్రి ప్రాంగణంలోనే భోజనం అందిస్తే బాగుంటుందనే ఆలోచనతో సత్యసాయి సేవాదళ్ ట్రస్టు ఆధ్వర్యంలో మూడేళ్ల క్రితం ఉచిత నిత్యాన్నదానం ప్రారంభించారు. మధ్యాహ్నం 300–350 మంది వరకూ, రాత్రి పూట 300 మంది వరకూ రుచికరమైన భోజనం అందిస్తున్నారు. ఇందుకు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన కూరగాయలు, ఆకుకూరలనే ఉపయోగిస్తుండటం విశేషం. రిమ్స్ ప్రాంగణంలో నిత్యాన్నదానం క్యాంటీన్లో అన్నంతో పాటు సాంబారు, ఒక కూర, పచ్చడితో అరటిపండు, బొప్పాయి పండ్ల ముక్కలు కూడా అందిస్తున్నారు. తొలుత ఈ క్యాంటీన్‌కు అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు మొత్తం బయట మార్కెట్లోనే కొనుగోలు చేసేవారు. అలాగాకుండా ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగుచేసిన ఆకుకూరలు, కూరగాయలైతే రుచికరంగా ఉండటంతో పాటు ఆరోగ్యానికీ మేలైనవనే ఉద్దేశంతో శ్రీకాకుళానికి చెందిన సామాజిక సేవకురాలు పేర్ల అనురాధ చొరవ చూపి కూరగాయల సాగు ప్రారంభించారు. ఇప్పుడు క్యాంటీన్లో రోజువారీ అవసరాలకు ఈ ప్రకృతి సాగు తోట నుంచే వెళ్తున్నాయి. ‘‘నిత్యాన్నదానం కోసం కేటాయించిన భవనం వెనుక దాదాపు వెయ్యి గజాల ఖాళీ స్థలం వృథాగా ఉండేది. దీనిలో ప్రకృతి వ్యవసాయ విధానంలో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు ఉపయోగించకుండా ప్రకృతి సేద్య విధానంలో పండించిన కూరగాయలు, ఆకుకూరల రుచి చాలా బాగుంటుంది. చిన్నప్పటి నుంచి ఇంటి వద్ద కొన్నిరకాల కూరగాయల మొక్కలు పెంచేవాళ్లం. ఆ ఆసక్తితోనే రిమ్స్‌లో ఆ ఖాళీ స్థలం ప్రకృతి సాగు కోసం ఇవ్వాలని జిల్లా కలెక్టరును కోరాం. రెండేళ్ల క్రితం అనుమతి రాగానే బయటి నుంచి సారవంతమైన మట్టి తెప్పించి వేయించాం. పశువుల గెత్తం కూడా వేశాం. తొలుత టమాటా, మునగ, వంకాయలు, పచ్చిమిర్చి సాగు ప్రారంభించాం. తర్వాత ముల్లంగి, దొండ, గోంగూర, కొత్తిమీర.. వేశాం. వాటిలో అత్యధికంగా గోంగూర, కొత్తిమీర రోజువారీ వంటకు సరిపోతోంది. సాంబారులో వాడకానికి కంది కూడా పండిస్తున్నాం. కరివేపాకు, కొత్తిమీర, గోంగూర పూర్తిగా ఇక్కడిదే వంటకు వినియోగిస్తున్నాం. వీటికి రసాయనిక ఎరువులు వేయలేదు. కేవలం వర్మికంపోస్టు ఎరువు తీసుకొచ్చి వేస్తున్నాం. చీడపీడల సమస్య కూడా కనిపించలేదు. ఎప్పుడైనా కనిపిస్తే దశపత్ర కషాయం, వేపనూనె పిచికారీ చేయిస్తున్నాం. పంటల మధ్యలో బంతి మొక్కలు పెంచడం ద్వారా చీడపీడలను నియంత్రిస్తున్నాం. పచ్చిమిర్చి రోజూ రెండు మూడు కిలోల వరకూ వస్తాయి. వచ్చే వేసవిలో అందుబాటులోకి వచ్చేలా ఇప్పుడు కొన్ని రకాల కూరగాయల మొక్కలు వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. సాయి భక్తులు కాళీప్రసాద్, అన్నపూర్ణ గార్ల సహకారంతో అరటితో పాటు మామిడి, సపోట, ఉసిరి, దానిమ్మ, బొప్పాయి వంటి పండ్ల మొక్కలు పెంచుతున్నాం. సాక్షి ‘సాగుబడి’లో వచ్చే కథనాలు, సూచనలు మాకెంతో ఉపయోగపడుతున్నాయి. ఈ స్ఫూర్తితో శ్రీకాకుళంలోని కన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద పూలమొక్కలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోనే పెంచుతున్నాం. ప్రతిరోజూ పూజలకు వాటి పూలు సరిపోతున్నాయి’’ అని అనురాధ చెబుతున్నారు. – అల్లు సూరిబాబు, సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం, ఫొటోలు: కుప్పిలి జయశంకర్ -
మంత్రి గారూ.. ఇదీ రిమ్స్ తీరు
ఆదిలాబాద్: జిల్లా కేంద్రం ఆదిలాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్)లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా వైద్యం, సదుపాయాలు సమకూర్చడంలో అధికారులు విఫలం అవుతున్నారు. ప్రతీ రోగికి సరైన సమయంలో వైద్య అందాలంటే పూర్తిస్థాయిలో వైద్యులు అందుబాటులో ఉండాలి. కానీ రిమ్స్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఏ ప్రభుత్వం.. ఏ అధికారి కూడా వీటి భర్తీపై దృష్టి సారించకపోవడంతో రోగులకు వైద్య సేవలు అందడంలేదు. మరోపక్క కనీస సౌకర్యాలు లేక రోగులూ ఇబ్బందులు పడుతున్నారు. అపరిశుభ్రత, తాగునీటి తిప్పలు తప్పడం లేదు. రిమ్స్ ఆస్పత్రిలో ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసే డయాలసిస్ కేంద్రం ప్రారంభానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆదివారం రానున్నారు. రిమ్స్‌తోపాటు ఉట్నూర్‌లో ఈ కేంద్రాలు ప్రారంభిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే తలమానికంగా ఉన్న రిమ్స్‌తోపాటు ఇతర ఆస్పత్రుల సమస్యల పరిష్కారానికి మంత్రి చొరవ చూపాల్సిన అవసరం ఉంది. వైద్యులు భర్తీపై స్పష్టత వచ్చేనా.. రిమ్స్‌ను వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పూర్తిస్థాయిలో ఇటు వైద్యం అందించేందుకు, అటు బోధన సిబ్బంది లేకపోవడంతో రోగులు, మెడికోలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం రిమ్స్‌లో 151 పోస్టులకు గాను 91 మంది వైద్యులు ఉన్నారు. 60 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్న వైద్యులు సైతం ప్రైవేట్ క్లినిక్‌లు నిర్వహిస్తూ రిమ్స్‌ను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అత్యవసర సమయంలో వైద్యం అందడం లేదు.మహారాష్ట్ర, హైదరాబాద్ ప్రాంతాలకు రెఫర్ చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు, స్నేక్‌బైట్, ఆత్మహత్యాయత్నం, తదితర తీవ్రమైన వ్యాధులతో వచ్చే వారికి వైద్యం అందక మృత్యువాత పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రిమ్స్ అధికారుల పర్యవేక్షణలోపం.. ఆస్పత్రిలో అవసరమైన వైద్య సేవలు అందబాటులో ఉంచడంలో నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దీనిపై దృష్టి సారించి రిమ్స్‌లో వైద్యుల పోస్టులు భర్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. సౌకర్యాలపై దృష్టి సారించాలి.. రిమ్స్ ఆస్పత్రిలో అసౌకర్యాలపై మంత్రి దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. రిమ్స్‌లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. 500 పడకల ఆస్పత్రి, నిత్యం 1500 మంది రోగులు వచ్చే రిమ్స్‌లో తాగునీటి కష్టాలు ఉండడం గమనార్హం. అటు మరుగుదొడ్లకు నీటి సరఫరా లేక అపరిశుభ్రంగా మారడం, లేదంటే తాళాలు వేసేయడం జరుగుతుంది. రిమ్స్ ఆస్పత్రికి 4 లక్షల లీటర్ల నీరు అవసరం ఉండగా, ప్రస్తుతం 2 లక్షల లీటర్లు మాత్రమే అందుతున్నాయి. ఏ ఒక్క వార్డులో కూడా తాగునీటి కుళాయిలు లేవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నీటి సరఫరా లేక కొన్ని సందర్భాల్లో ఆపరేషన్లు నిలిచిన సంఘటనలూ ఉన్నాయి. సీజనల్ వ్యాధుల సమయంలో రోగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఒక్క పడకపై ఇద్దరేసి రోగులకు చికిత్స అందించాల్సి వస్తోంది. తాగునీటితోపాటు పడకలు, పారిశుధ్యం, రోగుల బంధువులకు వసతి సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. -
ధర్మాస్పత్రుల్లో అధర్మ పాలన
►సిబ్బంది ఇష్టారాజ్యం ►ప్రసవంలో మగపిల్లాడైతే ఓ రేటు... ►ఆడపిల్లయితే మరో రేటు ►కొరవడిన జవాబుదారితనం కడప రూరల్ : ఇటీవల ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రిలో చోటు చేసుకున్న సంఘటనతో అందరూ నిశ్చేష్టులయ్యారు. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు అసహనానికి గురై ఏకంగా హెచ్ఐవీ రోగి నుంచి సేకరించిన రక్తం సిరంజితో దాడికి పాల్పడటం దారుణం. ఈ సంఘటనతో అసలు ధర్మాసుపత్రుల్లో ఇంకా ఏం జరుగుతోందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. మొత్తం మీద ఎప్పటినుంచో వైద్య విధానం గాడితప్పిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని ఆస్పత్రులు కడపలో ప్రధాన ఆస్పత్రి రిమ్స్ ఉంది. ఈ ఆస్పత్రిలో 24 గంటలు నిరంతరాయంగా వైద్య సేవలను అందించాలి. వైద్య విధాన పరిషత్‌లో ఒకటి ప్రొద్దుటూరులో జిల్లా ఆస్పత్రి, పులివెందులలో ఏరియా ఆస్పత్రితోపాటు 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 3, 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 9, మొత్తం 14 హాస్పిటల్స్ ఉన్నాయి. ఇవన్నీ దాదాపుగా 24 గంటలు పనిచేయాలి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో 75 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు), 448 సబ్ సెంటర్లు ఉన్నాయి. ఇవి ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్య సేవలు అందిస్తాయి. సిబ్బంది ఇష్టారాజ్యం కాగా, ఈ హాస్పిటల్స్‌లోని సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కడపరిమ్స్ తర్వాత వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలోని ఆస్పత్రులు కీలకంగా మారాయి. ఎందుకంటే రిమ్స్ తర్వాత ఇవి దాదాపుగా 24 గంటలు వైద్య సేవలను అందించాలి. ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రిలో ఇటీవల జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే! ఇంకా అక్కడ ఎన్నో లోపాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే రాజంపేటలో చీకటిపడితే వైద్యం అందని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ నలుగురికిగాను ముగ్గురు డాక్టర్లు మాత్రమే పనిచేస్తున్నారు. సాయంత్రం పూట ఏవైనా కేసులు వస్తే అక్కడిసిబ్బంది కడపకు రెఫర్ చేస్తున్నారు. అలాగే మైదుకూరు ఆస్పత్రి పరిస్థితి కూడా అధ్వాన్నంగా మారింది. అక్కడ ఒక ఫార్మసిస్టును ఏడాది క్రితం సస్పెండ్ చేశారు. ఇంతవరకు ఆ స్థానంలో ఎవరినీ నియమించలేదు. ఇదీ 30 పడకల హాస్పిటల్. ఆరుగురికిగాను నలుగురు మాత్రమే వైద్యులు పనిచేస్తున్నారు. గతంలో నెలకు ఇక్కడ 60 కాన్పులు జరిగేవి. ఇప్పుడు మహా అంటే 13కూడా జరగని పరిస్థితి ఏర్పడింది. కాగా జమ్మలమడుగు హాస్పిటల్లో గైనకాలజిస్టుల కొరత ఉంది. చివరికి ఇక్కడ ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చే వైద్యుడు కూడా లేకపోవడం దారుణం. ప్రధానంగా దాదాపుగా అన్ని హాస్పిటల్లో జబ్బుకో రేటును నిర్ణయించారు. ముఖ్యంగా ప్రసవాలకు సంబంధించి మగపిల్లవాడు జన్మిస్తే రూ. 3–5 వేల వరకు, అదే ఆడపిల్ల జన్మిస్తే రూ. 2–3 వేల వరకు వసూలు చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇదేమిటని ప్రశ్నిస్తే ప్రైవేటు ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకుంటే రూ. 40–50 వేలు కట్టాలి కదా....ఇక్కడ ఆ మాత్రమైనా ఇవ్వలేరా? అని సిబ్బంది ఎదురు ప్రశ్నిస్తున్నట్లుగా సమాచారం. ప్రైవేటు వైద్యానికే వైద్యుల మొగ్గు దాదాపు అన్ని ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు తాము ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు వైద్యానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రోగులు ఎవరైనా ప్రభుత్వ ఆస్పత్రులకు వెళితే అక్కడ పరీక్షించి నామమాత్రంగా వైద్య సేవలు అందించి తమ క్లినిక్‌లకు రావాలని చెబుతున్నటు తెలుస్తోంది. దీంతో సాయంత్రం పూట వైద్యం కోసం హాస్పిటల్స్‌కు వెళ్లిన వారు అక్కడ డాక్టర్లు లేకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీయక తప్పని పరిస్థితి ఏర్పడింది. గాడి తప్పిన వైద్య విధానాన్ని సరిదిద్ది ధర్మాస్పత్రుల్లో ధర్మ పాలన జరిగేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
మళ్లీ కదలిక..
♦ కాంట్రాక్టు కోసం బ్లాక్ లిస్టు సొసైటీల ప్రయత్నాలు ♦ గతంలో పోస్టుకు రూ.లక్షన్నర వసూలుకు యత్నం ♦ వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ ♦ రిమ్స్‌లో 24 పోస్టుల కోసం సొసైటీల ఎంపికలో అధికారులు ♦ చివరి జాబితాలో నలుగురు పోటాపోటీ ఆదిలాబాద్: జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రిలో మంజూరైన ఔట్సోర్సింగ్ పోస్టుల కోసం బ్లాక్ లిస్టు సొసైటీలు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. 24 పోస్టుల కాంట్రాక్టు కోసం గత ఫిబ్రవరిలో సొసైటీల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కాంట్రాక్టు రాకముందే తమకే వచ్చిందంటూ ఆయా సొసైటీలు నిరుద్యోగులను మభ్యపెట్టి రూ.లక్షన్నర వసూలు చేసే ప్రయత్నాలు చేశాయి. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో సొసైటీల ఎంపికను కలెక్టర్ నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత నామినేటెడ్ ద్వారా సొసైటీలను ఎంపిక చేయాలని నిర్ణయించారు. దీంతో మళ్లీ సదరు సొసైటీలు కాంట్రాక్టు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో బ్లాక్‌లిస్టులో ఉన్న సొసైటీలు సైతం ప్రజాప్రతినిధుల అండతో కాంట్రాక్టు దక్కించుకునేందుకు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. నాలుగు సొసైటీల పరిశీలన.. ప్రస్తుతం రిమ్స్‌కు మంజూరైన 24 పోస్టుల కోసం గతంలో దరఖాస్తు చేసుకున్న సొసైటీల నుంచి నాలుగింటిని ఎంపిక చేశారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాల పరిశీలనలో అధికారులు తలమునకలై ఉన్నారు. తుది జాబితాలో ఉన్న సొసైటీల్లో సైతం బ్లాక్ లిస్టులో ఉన్న ఒక సొసైటీ ఉండడం గమనార్హం. జిల్లా కేంద్రానికి ఈ చెందిన ఈ సొసైటీ గతంలో రిమ్స్ కాంట్రాక్టు కింద ఉద్యోగులను నియమించుకుంది. సదరు సొసైటీ నిర్వహణ సరిగ్గా లేకపోవడం, ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకపోవడంతో స్థానిక పోలీసుస్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. కలెక్టర్‌కు సైతం ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ప్రభుత్వం శాశ్వతంగా ఈ సొసైటీని బ్లాక్ లిస్టులో పెట్టింది. మిగతా మూడింటిలో వరంగల్, ఆసిఫాబాద్, హైదరాబాద్‌కు చెందిన సొసైటీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూడింటిలోనూ ఒక కాంట్రాక్టర్ ఇతర జిల్లాల్లో బ్లాక్‌లిస్టులో ఉన్నట్లు సమాచారం. కాగా ఈ నాలుగు సొసైటీల ఫైల్ ప్రస్తుతం జాయింట్ కలెక్టర్ వద్ద ఉంది. బ్లాక్ లిస్టులో ఉన్న సొసైటీని తీసివేయాలా.. వద్దా.. అనే తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. బ్లాక్ లిస్టులో.. గతంలో రిమ్స్‌లో కాంట్రాక్టు పొందిన ఈ సొసైటీలు నిర్వహణలో తప్పులు చేయడం, ఉద్యోగుల వేతనాల చెల్లింపుల్లో అవకతవకలు, ఈఎస్ఐ, ఈపీఎఫ్ చెల్లించకపోవడం, తదితర సమస్యలను దృష్టిలో ఉంచుకుని సొసైటీలను బ్లాక్‌లిస్టులో ఉంచారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ సొసైటీలు మళ్లీ కాంట్రాక్టు పొందే అవకాశాలు ఉండవు. గతంలో టెండర్లు వేసి 8 సొసైటీలు దరఖాస్తులు చేసుకున్నాయి. ఈ సొసైటీల్లో మూడు బ్లాక్లిస్టులోనే ఉన్నాయి. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో సొసైటీల ఎంపిక ప్రక్రి య నిలిపివేశారు. మళ్లీ అవే పోస్టుల కోసం నాలుగు సొసైటీలు ప్రయత్నించడం, అందులో బ్లాక్‌లిస్టులో ఉ న్న సొసైటీలు ఉండడం అనుమానాలకు తావిస్తోంది. జిల్లా ప్రజాప్రతినిధులతో సదరు సొసైటీలు తమకు అ వకాశం ఇవ్వాలంటూ పైరవీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సొసైటీల ఎంపిక ప్రక్రియ కలెక్లర్ చేతుల్లో ఉండడంతో ఎంపిక ఎలా జరుగుతోందోనని ఆసక్తి నెలకొంది. సాక్షి కథనంతో వెలుగులోకి... గుట్టుచప్పుడు కాకుండా ఉద్యోగాలను అమ్ముకుందామనుకున్న సొసైటీలు, వాటికి వత్తాసు పలికిన కొంతమంది అధికారుల బాగోతం అప్పట్లో ‘సాక్షి’ కథనంతో వెలుగులోకి వచ్చింది. సొసైటీల ఎంపిక చేయకముందే అభ్యర్థుల నుంచి డబ్బులు డిమాండ్ చేయడం సంచలనం కలిగించింది. ఫిబ్రవరి 20న సొసైటీలు కొంతమంది అభ్యర్థులతో బేరసారాలు చేశారు. తెల్లారితే తమకు కాంట్రాక్టు వస్తుందని, పోస్టు కావాలంటే రూ.లక్షన్నర ఇచ్చుకోవాలని మభ్యపెట్టారు. దీంతో ఇద్దరు అభ్యర్థులు మరుసటి రోజు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధం కాగా, అదే రోజు ఆ సొసైటీల గుట్టు ‘సాక్షి’ బయటపెట్టడంతో అభ్యర్థులు ఊపిరిపీల్చుకున్నారు. అటు అధికారులు సైతం సొసైటీల టెండర్‌ను రద్దు చేశారు. ప్రస్తుతం రిమ్స్‌లో కాంట్రాక్టు కోసం దరఖాస్తులు చేసుకున్న సొసైటీల అర్హతలు, అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఎంపిక చేయనున్నారు. పరిశీలనలో ఉన్నాయి.. రిమ్స్‌లో పోస్టుల కోసం సొసైటీ ఎంపిక ప్రక్రియ పరిశీలన చేస్తున్నాం. నాలుగు సొసైటీలకు సంబంధించిన ఫైల్స్‌ను పరిశీలిస్తున్నారు. ఇందులో బ్లాక్ సొసైటీలో ఉన్న సొసైటీపై ఇటీవలే మాకు ఫిర్యాదు వచ్చింది. సదరు సొసైటీని నోటీసులో ఉంచాం. పూర్తి వివరాలు తెలుసుకొని తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. – కృష్ణారెడ్డి, జాయింట్ కలెక్టర్ -
జూడాల సమ్మె ఉధృతం
ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్ : రిమ్స్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యుల సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతోంది. పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థుల కంపల్సరీ సర్వీసు విషయంలో ప్రభుత్వ ద్వంద్వ వైఖరి, ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో పీజీ విద్యార్థులు స్టైఫండ్‌ను మూడేళ్లకు ఒకేసారి డిపాజిట్ చేసేలా జారీ చేసిన జీవో 93 రద్దు చేయాలనే తదితర డిమాండ్లతో జూనియర్ డాక్టర్లు(జూడా) సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. సమ్మె మంగళవారం నాటికి తొమ్మిది రోజులకు చేరగా.. రోజుకో తీరులో నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జూనియర్ వైద్యుల సమ్మెతో ఆస్పత్రిలో రోగులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. సకాలంలో వైద్యం అందడం లేదని, ఉదయం వైద్యులు చూసి వెళ్లిన తర్వాత ఎంత అత్యవసరమైనా చూడడానికి ఎవరూ రావడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ చర్యలు అంతంత మాత్రమే కావడంతో ఇబ్బందులు తప్పడం లేదు. 66 మంది హౌస్ సర్జన్లు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొంటున్నారు. శస్త్రచికిత్సల సమ యంలో హౌస్సర్జన్లు తప్పనిసరిగా అవసరం. వారు సమ్మెలో ఉండడంతో సీనియర్ వైద్యు లకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోగుల తాకిడి వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధుల కారణంగా రిమ్స్ ఆస్పత్రికి రోగుల తాకిడి పెరిగింది. జిల్లా నలుమూలల నుంచి ప్రతి రోజు వెయ్యి మంది నుంచి 1500 మంది వరకు ఆస్పత్రికి వస్తున్నారు. ఓపీ విభాగంలో ఉదయం నుంచి 12గంటల వరకు రోగులను పరీక్షిస్తారు. అనంతరం అత్యవసర విభాగంలో ఆరుగురు హౌస్సర్జన్లు 24గంటలు అందుబాటులో ఉంటారు. వీరు ఆయా వార్డుల్లో రోగులతోపాటు, అత్యవసర సమయంలో వైద్య పరీక్షలు చేస్తుంటారు. ప్రస్తుతం వీరంతా సమ్మెలో ఉండడంతో అత్యవసర విభాగంలో రోగులకు వైద్య సేవలు అందడం లేదు. పెద్ద ఎత్తున రోగులు బారులు తీరుతున్నారు. ఇద్దరే వైద్యులు పరీక్షలు చేస్తుండడంతో గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. వసతులు కరువు తమ న్యాయమైన డిమాండ్లతోపాటు రిమ్స్‌లో నెలకొన్న సమస్యలూ పరిష్కరించాలని జూనియర్ వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. ఆస్పత్రిలో మరుగుదొడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. అత్యవసర విభాగంలో జూడాలకు ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు, విద్యుత్ దీపాలు లేకపోవడంతో రాత్రివేళల్లో హాస్టల్‌కు ఎవరు వస్తున్నారో కూడా తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిమ్స్ డెరైక్టర్, డీఎంఈకి సమస్యలు విన్నవించినా పరిష్కారానికి నోచుకోవడం లేదని, వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి.. ప్రభుత్వం జూడాల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ వైద్య సేవలకు సంబంధించి పీహెచ్సీ, సీహెచ్‌సీలో పూర్తి స్థాయిలో వైద్య సిబ్బందిని నియమించాలి. వైద్య పరికరాలు, మందులు అందుబాటులో ఉంచాలి. - ఉప్పరి మల్లేశ్, రిమ్స్ జూడా అసోసియేషన్ అధ్యక్షుడు వసతులు కల్పించాలి రిమ్స్ ఆస్పత్రిలో జూడాలకు సరైన వసతులు లేవు. అత్యవసర విభాగంలో విధులు నిర్వర్తించే జూడాలకు కనీస సౌకర్యాలు లేకపోవడంతోపాటు ఉద్యోగ భద్రత కరువైంది. ఎవరు గొడవకు దిగుతారో తెలియని పరిస్థితి. మాకు ఏం జరిగినా ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత. సమస్యలపై పరిష్కారంపై అధికారులు పట్టించుకోవడం లేదు. - ఆదిత్య, జూడా ఉపాధ్యక్షుడు నిర్ణయం మార్చుకోవాలి.. జూడాలకు రావాల్సిన స్టయిఫండ్‌ను ప్రతి నెలా చెల్లించాలి. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలకు శాశ్వత ప్రాతిపదికన నియమించాలి. రాత పరీక్ష, మెరిట్ ఆధారంగానే అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం చేపట్టాలి. పీజీ మెడికల్ విద్యార్థుల కంపల్సరీ సర్వీసు విషయంలో ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలి. - సౌమ్య, జూడా సంఘం ఉపాధ్యక్షురాలు సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె జూడాల సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తాం. ప్రతి సంవత్సరం ట్రైనింగ్ పూర్తి చేసిన వైద్యులకు ఆయా పీహెచ్‌సీల్లో శాశ్వత ఉద్యోగం కల్పించాలి. శాశ్వత ఉద్యోగాలిస్తే ఎక్కడైనా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు కల్పిస్తే రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లరు. - గీత, జూనియర్ డాక్టర్