మంత్రి గారూ.. ఇదీ రిమ్స్‌ తీరు | Doctors Shortage Impact on Patient Safety at Adilabad RIMS Hospital | Sakshi
Sakshi News home page

మంత్రి గారూ.. ఇదీ రిమ్స్‌ తీరు

Jan 21 2018 11:46 AM | Updated on Aug 17 2018 2:56 PM

Doctors Shortage Impact on Patient Safety at Adilabad RIMS Hospital  - Sakshi

ఆదిలాబాద్‌: జిల్లా కేంద్రం ఆదిలాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(రిమ్స్‌)లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా వైద్యం, సదుపాయాలు సమకూర్చడంలో అధికారులు విఫలం అవుతున్నారు. ప్రతీ రోగికి సరైన సమయంలో వైద్య అందాలంటే పూర్తిస్థాయిలో వైద్యులు అందుబాటులో ఉండాలి. కానీ రిమ్స్‌ ప్రారంభం నుంచి ఇప్పటివరకు వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఏ ప్రభుత్వం.. ఏ అధికారి కూడా వీటి భర్తీపై దృష్టి సారించకపోవడంతో రోగులకు వైద్య సేవలు అందడంలేదు. మరోపక్క కనీస సౌకర్యాలు లేక రోగులూ ఇబ్బందులు పడుతున్నారు. అపరిశుభ్రత, తాగునీటి తిప్పలు తప్పడం లేదు. రిమ్స్‌ ఆస్పత్రిలో ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసే డయాలసిస్‌ కేంద్రం ప్రారంభానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆదివారం రానున్నారు. రిమ్స్‌తోపాటు ఉట్నూర్‌లో ఈ కేంద్రాలు ప్రారంభిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకే తలమానికంగా ఉన్న రిమ్స్‌తోపాటు ఇతర ఆస్పత్రుల సమస్యల పరిష్కారానికి మంత్రి చొరవ చూపాల్సిన అవసరం ఉంది.

వైద్యులు భర్తీపై స్పష్టత వచ్చేనా..
రిమ్స్‌ను వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పూర్తిస్థాయిలో ఇటు వైద్యం అందించేందుకు, అటు బోధన సిబ్బంది లేకపోవడంతో రోగులు, మెడికోలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం రిమ్స్‌లో 151 పోస్టులకు గాను 91 మంది వైద్యులు ఉన్నారు. 60 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్న వైద్యులు సైతం ప్రైవేట్‌ క్లినిక్‌లు నిర్వహిస్తూ రిమ్స్‌ను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అత్యవసర సమయంలో వైద్యం అందడం లేదు.మహారాష్ట్ర, హైదరాబాద్‌ ప్రాంతాలకు రెఫర్‌ చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు, స్నేక్‌బైట్, ఆత్మహత్యాయత్నం, తదితర తీవ్రమైన వ్యాధులతో వచ్చే వారికి వైద్యం అందక మృత్యువాత పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రిమ్స్‌ అధికారుల పర్యవేక్షణలోపం.. ఆస్పత్రిలో అవసరమైన వైద్య సేవలు అందబాటులో ఉంచడంలో నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దీనిపై దృష్టి సారించి రిమ్స్‌లో వైద్యుల పోస్టులు భర్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

సౌకర్యాలపై దృష్టి సారించాలి..
రిమ్స్‌ ఆస్పత్రిలో అసౌకర్యాలపై మంత్రి దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. రిమ్స్‌లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. 500 పడకల ఆస్పత్రి, నిత్యం 1500 మంది రోగులు వచ్చే రిమ్స్‌లో తాగునీటి కష్టాలు ఉండడం గమనార్హం. అటు మరుగుదొడ్లకు నీటి సరఫరా లేక అపరిశుభ్రంగా మారడం, లేదంటే తాళాలు వేసేయడం జరుగుతుంది. రిమ్స్‌ ఆస్పత్రికి 4 లక్షల లీటర్ల నీరు అవసరం ఉండగా, ప్రస్తుతం 2 లక్షల లీటర్లు మాత్రమే అందుతున్నాయి. ఏ ఒక్క వార్డులో కూడా తాగునీటి కుళాయిలు లేవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నీటి సరఫరా లేక కొన్ని సందర్భాల్లో ఆపరేషన్లు నిలిచిన సంఘటనలూ ఉన్నాయి. సీజనల్‌ వ్యాధుల సమయంలో రోగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఒక్క పడకపై ఇద్దరేసి రోగులకు చికిత్స అందించాల్సి వస్తోంది. తాగునీటితోపాటు పడకలు, పారిశుధ్యం, రోగుల బంధువులకు వసతి సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement