ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్ : రిమ్స్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యుల సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతోంది. పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థుల కంపల్సరీ సర్వీసు విషయంలో ప్రభుత్వ ద్వంద్వ వైఖరి, ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో పీజీ విద్యార్థులు స్టైఫండ్‌ను మూడేళ్లకు ఒకేసారి డిపాజిట్ చేసేలా జారీ చేసిన జీవో 93 రద్దు చేయాలనే తదితర డిమాండ్లతో జూనియర్ డాక్టర్లు(జూడా) సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. సమ్మె మంగళవారం నాటికి తొమ్మిది రోజులకు చేరగా.. రోజుకో తీరులో నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జూనియర్ వైద్యుల సమ్మెతో ఆస్పత్రిలో రోగులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. సకాలంలో వైద్యం అందడం లేదని, ఉదయం వైద్యులు చూసి వెళ్లిన తర్వాత ఎంత అత్యవసరమైనా చూడడానికి ఎవరూ రావడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ చర్యలు అంతంత మాత్రమే కావడంతో ఇబ్బందులు తప్పడం లేదు. 66 మంది హౌస్ సర్జన్‌లు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొంటున్నారు. శస్త్రచికిత్సల సమ యంలో హౌస్‌సర్జన్‌లు తప్పనిసరిగా అవసరం. వారు సమ్మెలో ఉండడంతో సీనియర్ వైద్యు లకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
రోగుల తాకిడి
వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధుల కారణంగా రిమ్స్ ఆస్పత్రికి రోగుల తాకిడి పెరిగింది. జిల్లా నలుమూలల నుంచి ప్రతి రోజు వెయ్యి మంది నుంచి 1500 మంది వరకు ఆస్పత్రికి వస్తున్నారు. ఓపీ విభాగంలో ఉదయం నుంచి 12గంటల వరకు రోగులను పరీక్షిస్తారు. అనంతరం అత్యవసర విభాగంలో ఆరుగురు హౌస్‌సర్జన్లు 24గంటలు అందుబాటులో ఉంటారు. వీరు ఆయా వార్డుల్లో రోగులతోపాటు, అత్యవసర సమయంలో వైద్య పరీక్షలు చేస్తుంటారు. ప్రస్తుతం వీరంతా సమ్మెలో ఉండడంతో అత్యవసర విభాగంలో రోగులకు వైద్య సేవలు అందడం లేదు. పెద్ద ఎత్తున రోగులు బారులు తీరుతున్నారు. ఇద్దరే వైద్యులు పరీక్షలు చేస్తుండడంతో గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది.
వసతులు కరువు
తమ న్యాయమైన డిమాండ్లతోపాటు రిమ్స్‌లో నెలకొన్న సమస్యలూ పరిష్కరించాలని జూనియర్ వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. ఆస్పత్రిలో మరుగుదొడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. అత్యవసర విభాగంలో జూడాలకు ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు, విద్యుత్ దీపాలు లేకపోవడంతో రాత్రివేళల్లో హాస్టల్‌కు ఎవరు వస్తున్నారో కూడా తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిమ్స్ డెరైక్టర్, డీఎంఈకి సమస్యలు విన్నవించినా పరిష్కారానికి నోచుకోవడం లేదని, వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి..
ప్రభుత్వం జూడాల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ వైద్య సేవలకు సంబంధించి పీహెచ్‌సీ, సీహెచ్‌సీలో పూర్తి స్థాయిలో వైద్య సిబ్బందిని నియమించాలి. వైద్య పరికరాలు, మందులు అందుబాటులో ఉంచాలి.
- ఉప్పరి మల్లేశ్, రిమ్స్ జూడా అసోసియేషన్ అధ్యక్షుడు
వసతులు కల్పించాలి
రిమ్స్ ఆస్పత్రిలో జూడాలకు సరైన వసతులు లేవు. అత్యవసర విభాగంలో విధులు నిర్వర్తించే జూడాలకు కనీస సౌకర్యాలు లేకపోవడంతోపాటు ఉద్యోగ భద్రత కరువైంది. ఎవరు గొడవకు దిగుతారో తెలియని పరిస్థితి. మాకు ఏం జరిగినా ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత. సమస్యలపై పరిష్కారంపై అధికారులు పట్టించుకోవడం లేదు.
- ఆదిత్య, జూడా ఉపాధ్యక్షుడు
నిర్ణయం మార్చుకోవాలి..
జూడాలకు రావాల్సిన స్టయిఫండ్‌ను ప్రతి నెలా చెల్లించాలి. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలకు శాశ్వత ప్రాతిపదికన నియమించాలి. రాత పరీక్ష, మెరిట్ ఆధారంగానే అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం చేపట్టాలి. పీజీ మెడికల్ విద్యార్థుల కంపల్సరీ సర్వీసు విషయంలో ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలి.
- సౌమ్య, జూడా సంఘం ఉపాధ్యక్షురాలు
సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె
జూడాల సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తాం. ప్రతి సంవత్సరం ట్రైనింగ్ పూర్తి చేసిన వైద్యులకు ఆయా పీహెచ్‌సీల్లో శాశ్వత ఉద్యోగం కల్పించాలి. శాశ్వత ఉద్యోగాలిస్తే ఎక్కడైనా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు కల్పిస్తే రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లరు.
- గీత, జూనియర్ డాక్టర్
జూడాల సమ్మె ఉధృతం
Published Wed, Aug 7 2013 4:50 AM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM
Advertisement
Advertisement