క్యాన్సర్‌కు చికిత్స | Treatment for Cancer in Rimes hospital | Sakshi
Sakshi News home page

క్యాన్సర్‌కు చికిత్స

Published Sun, May 27 2018 7:38 AM | Last Updated on Sun, May 27 2018 7:38 AM

Treatment for Cancer in Rimes hospital - Sakshi

రిమ్స్‌ ఆరోగ్యశ్రీ వార్డులో చికిత్స పొందుతున్న ఈమె పేరు భీంబాయి. కుమురంభీం జిల్లా తిర్యాణికి చెందిన ఈమె కొంతకాలంగా కడుపులో గడ్డతో బాధపడుతోంది. పేదరికం కారణంగా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లలేని పరిస్థితిలో 20 రోజుల క్రితం రిమ్స్‌కు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుంది. కడుపులో క్యాన్సర్‌ గడ్డ ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసుకుని చికిత్స అందించారు. మంగళవారం రోజు హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఆంకో సర్జన్‌ డాక్టర్‌ గిరీష్‌ రిమ్స్‌ డైరెక్టర్‌ అశోక్, వైద్య బృందంతో కలిసి భీంబాయికి ఆపరేషన్‌ చేశారు. క్యాన్సర్‌ గడ్డను తొలగించి భీంబాయి మళ్లీ ప్రాణం పోశారు. ఎన్నో రోజులుగా కడుపులో గడ్డతో బాధపడుతున్న రూపాయి ఖర్చు లేకుండా ఆపరేషన్‌ చేశారని ఆమెతోపాటు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

ఆదిలాబాద్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పేదలకు వరప్రదాయినిగా ఉన్న రిమ్స్‌ ఆస్పత్రిలో మరిన్ని అత్యాధునిక సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. రెండు నెలల క్రితం జిల్లా కేంద్రం ఆదిలాబాద్‌లోని రిమ్స్‌ ఆస్పత్రిలో ప్రారంభమైన క్యాన్సర్‌ శస్త్రచికిత్సల సేవలు క్యాన్సర్‌ బాధితులకు ఎంతో ఊరటనిస్తున్నాయి. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో వివిధ రకాల క్యాన్సర్‌తో ఎంతోమంది బాధపడుతున్నారు. ఆర్థికంగా ఉన్నవారు నాగ్‌పూర్, హైదరాబాద్‌ వంటి ప్రాంతాలకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటుండగా.. పేదవారు చిన్న చిన్న వైద్య పరీక్షలతోనే కాలం వెల్లదీస్తున్నారు. రిమ్స్‌లో కా>్యన్సర్‌కు వైద్య సేవలు అందుతున్నట్లు ఇంకా చాలామందికి తెలియకపోవడంతో దూరభారమైన ఇతర ప్రాంతాలకు వైద్యం కోసం వెళ్తున్నారు. క్యాన్సర్‌ బాధితులకు రిమ్స్‌లో అందుతున్న సేవలపై కథనం. 

ఇప్పటి వరకు 25 శస్త్రచికిత్సలు..
రిమ్స్‌ ఆస్పత్రిలో 15 రకాల క్యాన్సర్‌కు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యమైన శస్త్రచికిత్సలు సంబంధించిన థైరాయిడ్, అండాశయం, గర్భకోశ, నోటిక్యాన్సర్, ఛాతి క్యాన్సర్‌ వంటి వాటికి శస్త్రచికిత్సలు చేస్తున్నారు. ఇప్పటివరకు 25 రకాల క్యాన్సర్‌ ఆపరేషన్లు చేశారు. ఆపరేషన్‌ థియేటర్‌లో ప్రత్యేక వైద్య పరికరాలు కాట్రేమిషన్, ప్లాస్టర్‌ల ద్వారా శస్త్రచికిత్సలు చేస్తున్నారు. ఆంకో సర్జన్‌తోపాటు 12 మంది వైద్య నిపుణుల బృందం ఆపరేషన్లలో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలియక ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 500 నుంచి 600 మంది వరకు క్యాన్సర్‌ బాధితులు ఉండొచ్చని వైద్య శాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. జిల్లా మహారాష్ట్ర సరిహద్దులో ఉండడంతో ఈ ప్రాంతంలో గుట్కా, తంబాకు తినే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది.

 దీంతో ఎక్కువ మంది క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. పలువురు రక్త, కాలేయ, ఎముకలు, నోటి, కడుపు, అన్నవాహిక, ఊపిరితిత్తుల క్యాన్సర్‌లతో బాధపడుతున్నారు. సరైన వైద్య సేవలు లేక ఉమ్మడి జిల్లాలో ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారు ఈ వ్యాధికి గురైతే సుదూర ప్రాంతాలకు వెళ్లలేక, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు చేయించుకోలేక దేవుడిపై భారం వేసి ఇక్కడే అందుబాటులో ఉన్న చికిత్స తీసుకుంటున్నారు. దీంతో వారికి పూర్తిస్థాయి చికిత్స అందక మృత్యువాత పడుతున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే ఆసిఫాబాద్, నిర్మల్, తిర్యాణి, భైంసా, కాగజ్‌నగర్, తదితర దూర ప్రాంతాల నుంచి క్యాన్సర్‌ బాధితులు వస్తున్నారు. 

ఆరోగ్యశ్రీ అండగా..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం పేదలకు అండగా నిలుస్తోంది. లక్షల రూపాయల విలువ చేసే శస్త్రచికిత్సలు ఉచితంగా చేస్తున్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రిలో వైద్యం చేసుకునే స్థోమత లేని పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందుతోంది. ఇందులో భాగంగానే రిమ్స్‌లో జరుగుతున్న క్యాన్సర్‌ శస్త్రచికిత్సలు ఆరోగ్యశ్రీ పథకం కింద చేస్తున్నారు. థైరాయిడ్, గర్భాశయం, నోటి, అండాశయం వంటి క్యాన్సర్‌ శస్త్రచికిత్సలకు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో రూ.2 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇకా రవాణా చార్జీలు, వ్యక్తిగత చార్జీలు అంటే మరో రూ.50 వేలు ఖర్చవుతాయి. అలాంటిది రిమ్స్‌లో ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్లు చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి వచ్చే సూపర్‌ స్పెషాలిటీ ఆంకో సర్జన్‌కు రూ.6 వేలు చెల్లిస్తున్నారు. ఆపరేషన్‌కు ఉపయోగించే ప్రత్యేక పరికరాలు ఆరోగ్యశ్రీ కిందనే కొనుగోలు చేస్తారు. ఆపరేషన్‌ తర్వాత రోగికి అవసరమైన వైద్య పరీక్షలు, మందులు ఆరోగ్యశ్రీ వార్డులోనే అందుతాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎంఐసీయూలో సైతం క్యాన్సర్‌ వాధ్యిగ్రస్తులను ఉంచుతున్నారు.

నాలుగేళ్లుగా బాధపడ్డ..
నాలుగు సంవత్సరాలుగా థైరాయిడ్‌తో బాధపడ్డాను. నాలుగు రోజుల క్రితం రిమ్స్‌కు వైద్యం కోసం వచ్చి అడ్మిట్‌ అయ్యా. ప్రైవేట్‌లో కూడా దీనికి వైద్యం లేకపోవడంతో ఎంతో ఇబ్బందులు పడ్డా. రిమ్స్‌లో అడ్మిట్‌ అయ్యాక వెంటనే డాక్టర్‌ ఆపరేషన్‌ చేస్తామని చెప్పారు. ఎక్కువ రోజులు కూడా ఉంచుకోకుండా నాలుగు రోజుల్లోనే ఆపరేషన్‌ చేశారు. ఇప్పుడు పాణం మంచిగనిపిస్తుంది. వారం రోజుల్లో డిశ్చార్జ్‌ చేస్తామన్నారు. 
– ఎల్లమ్మ, జైనథ్‌ 

సద్వినియోగం చేసుకోవాలి
రిమ్స్‌లో క్యాన్సర్‌ సేవలు అందుబాటులోకి రావడంతో ఉమ్మడి జిల్లా ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. క్యాన్సర్‌ బాధితులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా క్యాన్సర్‌ ఆపరేషన్లు చేస్తున్నాం. ప్రత్యేక వైద్య నిపుణుల సహాయంతో, ఆధునిక పరికరాలు అందుబాటులో ఉంచాం. చాలామందికి రిమ్స్‌లో క్యాన్సర్‌ ఆపరేషన్లు జరుగుతున్నట్లు అవగాహన లేదు. ఇప్పటికైనా వ్యాధిగ్రస్తులు గుర్తించి వైద్య సేవలు పొందాలి.
– డాక్టర్‌ అశోక్‌కుమార్, రిమ్స్‌ డైరెక్టర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement