లాగేసుకున్నారు..!
► కోస్టల్ కారిడార్ రహదారి కోసం నోటీసులు ఇవ్వకుండానే భూసేకరణ
► చీరాలలో వంద ఎకరాలు సేకరించిన ప్రభుత్వ యంత్రాంగం
► రూ.25 లక్షల విలువైన భూమికి రూ.5 లక్షల పరిహారం
► పైసా చెల్లించకుండానే పనులు ప్రారంభం
► ఆందోళనబాట పట్టిన రైతులు
టీడీపీ ప్రభుత్వంలో రైతుల భూములకు భరోసా లేకుండా పోయింది. భూసేకరణ, ల్యాండ్ పూలింగ్ పేరుతో అడ్డగోలుగా లాగేసుకుంటున్నారు. కనీసం చట్టపరంగా కూడా వ్యవహరించడం లేదు. పరిహారంపై ఎటూ తేల్చకుండానే భూములు సేకరించి ఇష్టారాజ్యంగా పనులు చేపడుతున్నారు. ఇలా ఒక్క చీరాలలోనే జాతీయ కోస్టల్ రహదారి కోసం వంద ఎకరాల రైతుల భూములను సేకరించారు. అయితే పరిహారంలో మాత్రం రైతులకు చుక్కలు చూపెడుతున్నారు. విలువైన భూములకు పరిహారం నామమాత్రంగా ఉంది.
చీరాల: జిల్లాలోని ఒంగోలు మండలం త్రోవగుంట నుంచి కృష్ణాజిల్లా కత్తిపూడి వరకు జాతీయ కోస్తా రహదారి హైవే నంబర్ 216ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రహదారిని నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించే పనులు మొదలుపెట్టారు. దీని కోసం జిల్లాలో 172.45 ఎకరాలను రైతుల నుంచి భూసేకరణ చట్టం ద్వారా తీసుకుంటున్నారు. దీని పరిధిలో విలువైన భూములతో పాటు రొయ్యల చెరువులు పోనున్నాయి. అక్కడ సుమారు ఎకరం రొయ్యల చెరువు రూ.20 నుంచి రూ.25 లక్షల విలువ ఉంటుంది. గతంలో వాన్‌పిక్ సమయంలో ఎకరం కోటి రూపాయల వరకు పలికింది. ప్రస్తుతం కనీసం రూ.20 లక్షల పైనే ఎకరం ధర ఉన్నప్పటికీ పరిహారం మాత్రం ఎకరాకు రూ.3 నుంచి రూ 5 లక్షలు చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీని వలన సుమారు 130 మందికిపైగా రైతులు తీవ్రంగా నష్టపోనున్నారు.
3ఈ నోటీసులు జారీ చేయకుండానే...
భూములు సేకరించాలంటే ముందుగా రైతులకు 3ఈ నోటీసు అందించి వారి అభిప్రాయం తీసుకోవాల్సి ఉంది. అయితే 70 శాతం మంది రైతులకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే భూసేకరణ పనులు పూర్తి చేస్తున్నారు. వేటపాలెం మండలంలో 40 మంది రైతుల నుంచి 42 ఎకరాలు, చీరాల మండలంలో 92 మంది రైతుల నుంచి 70 ఎకరాలకు పైనే పట్టా భూములు సేకరిస్తున్నారు. అయితే రైతులకు స్పష్టమైన హామీలు ఇవ్వకపోవడంతో నష్టపరిహారం సైతం ప్రాంతాన్ని బట్టి రూ.5 లక్షలు మాత్రమే ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీనికి రైతులు ససేమిరా అంటున్నారు. ఇప్పటికే పలుమార్లు కలెక్టర్, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అయినా ప్రభుత్వం అదే మొండి వైఖరితో వ్యవహరిస్తోంది.
విలువైన భూములు...
త్రోవగుంట నుంచి కడవకుదురు రైల్వే ట్రాకు సమీపంగా పందిళ్లపల్లి, నాయినిపల్లి, పుల్లరిపాలెం, తోటవారిపాలెం, ఈపూరుపాలెం మీదుగా ఈ జాతీయ రహదారి వెళ్లనుంది. వేటపాలెం మండలంలో ఎక్కువ నష్టపోయేది రొయ్యల చెరువుల రైతులే. అక్కడి రైతులు రొయ్యల చెరువులు తవ్వించుకోవడంతో పాటు నిర్మాణాలు, చేనుకు అవసరమైన యంత్రాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు అక్కడ ఎకరం రూ.25 లక్షల వరకు డిమాండ్ ఉంది. కౌలు రేట్లే ఎకరాకు లక్ష రూపాయలకు పైగా పలుకుతోంది. అంత విలువైన భూములకు సాధారణ భూముల్లా కేవలం రూ.5 లక్షలు చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతోంది. చీరాల మండలంలో వేరుశనగ, ఇతర పంటలు పండిస్తున్నారు. ప్రస్తుతం వేరుశనగ పంట ఉంది. ఈ భూములకు కూడా రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు చెల్లిస్తామని చెబుతోంది. వాన్‌పిక్ ఏర్పాటు సమయంలో భూములు ఎకరా కోటి వరకు పలకగా ప్రస్తుతం ఆ ప్రాజెక్టు రాకపోవడంతో ఎకరా రూ.25 లక్షల వరకు ఉంది. విలువైన భూములకు పరిహారం కింద రూ.5 లక్షలు చెల్లిస్తామని చెప్పడంతో చీరాల, వేటపాలెం మండలాల రైతులు ఆందోళన చెందుతున్నారు.
పరిహారం చెల్లించకుండానే...
సేకరించిన భూములకు రైతులకు ఒక్క రూపాయి ఇవ్వకుండానే జాతీయ రహదారి పనులు మొదలుపెట్టారు. పరిహారం వ్యవహారం కొలిక్కి రాకుండా పనులు మొదలు పెట్టడంతో పాటు చీరాల మండలం తోటవారిపాలెం ప్రాంతంలో రైతుల భూములలో ఉన్న మోటార్లు తొలగించారు. రైతులు భూసేకరణతో పాటు ప్రస్తుతం భూములలో ఉన్న పంటకు, మోటార్లకు నిర్మించుకున్న షెడ్లుకు, రొయ్యల చెరువు రైతులకు మోటార్లు, చెరువు తవ్విన వ్యయాన్ని కూడా నష్టపరిహారంగా ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇవేమీ పట్టించుకోకుండానే భూసేకరణ చేయడంతో పాటు రోడ్డు పనులు కూడా మొదలుపెట్టడం చూస్తే రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుంది. రైతుల ఆందోళనను కూడా కనీసం పరిగణనలోకి తీసుకోకుండా మొండిగా జాతీయ కోస్టల్ రహదారి పనులు మొదలు పెట్టడం గమనార్హం.