పేరుకు పర్యాటకం.. ఆ వెనుక నాటకం
పేరుకు పర్యాటకం.. ఆ వెనుక నాటకం
Published Fri, Sep 2 2016 12:01 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
ఏలూరు రూరల్ : పేదవాడికి 50 గజాల స్థలం ఇవ్వాలంటే జిల్లా కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మెల్యే, ఎంపీ తదితరులతో కూడిన అసైన్డ్ కమిటీ అంగీకరించాలి. అప్పుడే లబ్ధిదారుణ్ణి గుర్తించి రెవెన్యూ అ«ధికారులు భూమిని పంపిణీ చేస్తారు. కానీ.. ఇవేమీ లేకుండానే పర్యాటక కాంట్రాక్టర్‌కుS8 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు ధారాదత్తం చేశారు. సదరు వ్యక్తి ఆ భూమిలో చేపల చెరువులు తవ్వి దర్జాగా సాగు చేపట్టాడు. ఏలూరు మండలం గుడివాకలంకలో ఈ అక్రమ వ్యవహారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. కొల్లేరు సరస్సును వీక్షించేందుకు వచ్చే పర్యాటకులు సేద తీరేందుకు వీలుగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గుడివాకలంక సమీపంలో ‘హరిత’ పేరిట రిసార్ట్స్ నిర్మించింది. పర్యాటకులను ఆకర్షిం చేందుకు నీటిమధ్యలో రెండు అంతస్తుల చొప్పున నాలుగు భవనాలు కట్టారు. ఒక్కొక్క భవనంలో నాలుగు గదులు ఉండేలా డిజైన్ చేశారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.కోటిన్నర వెచ్చిం చింది. రిసార్ట్స్‌లో విడిది చేసే పర్యాటకులు కొల్లేరు అందాలు తిలకించేందుకు వీలుగా బోటు షికారు ఏర్పాటు చేసింది. రిసార్ట్ వెనుక నుంచి నేరుగా కొల్లేరు సరస్సులోకి వెళ్లేందుకు ప్రభుత్వానికి చెందిన 212/1 సర్వే నంబర్‌లో 4.12 ఎకరాలు, 212/2లో 26 సెంట్లు, 213/3లో 3 ఎకరాల 60 సెంట్ల భూమిలో కాలువ తవ్వారు. రిసార్ట్స్ నిర్వహణను పర్యాటక శాఖ ప్రైవేట్ వ్యక్తికి కాంట్రాక్ట్‌కు ఇచ్చింది. సదరు వ్యక్తి టీడీపీ నేతల అండదండలతో రిసార్ట్స్ వెనుక బోటు షికారుకు కేటాయించిన ప్రభుత్వ భూమిపై కన్నేశాడు. కొల్లేరులోకి వెళ్లేందుకు వీలుగా తవ్విన కాలువకు గట్లువేసి.. ఆ కాలువతోపాటు సమీపంలోని భూమిని చేపల చెరువులుగా మార్చేశాడు. ఈ విషయమై స్థానికులు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఎన్‌ఎస్‌ఆర్ రవిచంద్రకు ఫిర్యాదు చేయగా ఆయన వెళ్లి చెరువులను పరిశీలించారు. అయినా, అక్కడ సాగుతున్న అక్రమ వ్యవహారానికి అడ్డుకట్ట పడలేదు.
రూ.లక్షల్లో లీజు
గుడివాకలంక ప్రాంతంలో ఎకరం చేపల చెరువు లీజు ఏడాదికి రూ.70 వేల నుంచి రూ.90 వేల వరకు ఉంది. ఈ లెక్కన రిసార్ట్స్ కాంట్రాక్టర్ ఆక్రమించిన 8 ఎకరాల ద్వారా ఏడాదికి కేవలం లీజు రూపంలోనే రూ.5.60 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు లబ్ధి పొందుతున్నట్టు అంచనా. ఈ వ్యవహారంపై రెవెన్యూ అధికారులను సంప్రదించగా.. సదరు వ్యక్తికి రిసార్ట్స్ నిర్వహణ బాధ్యతను పర్యాటక శాఖ అప్పగించిందని చెప్పారు. ఆ భూమిని లీజు లేదా ఏ ఇతర రూపంలోనూ అతడికి కేటాయించలేదన్నారు.
సెక్రటేరియట్ నుంచి అనుమతి తెచ్చుకున్నాడట
ఆ భూమిని పరిశీ లించాను. అది పూర్తిగా ప్రభుత్వ భూమే. రిసార్ట్స్ యజమానితో మాట్లాడాను. రిసార్ట్స్‌తోపాటు భూమిని కూడా తనకు లీజుకు ఇచ్చినట్టు కాంట్రాక్టర్ చెప్పారు. ఇందుకు సంబంధించి ఏపీ సెక్రటేరియట్ అధికారులు జారీ చేసిన మంజూరు పత్రాలు ఉన్నాయని, వాటిని చూపిస్తానని అన్నారు. – ఎన్‌ఎస్‌ఆర్ రవిచంద్ర, ఆర్‌ఐ
Advertisement