ఐక్యతే పెట్టుబడి.. గుర్తింపే లక్ష్యం..
ఐక్యతే పెట్టుబడి.. గుర్తింపే లక్ష్యం..
Published Sun, May 14 2017 11:28 PM | Last Updated on Tue, Sep 5 2017 11:09 AM
రాజ్యాధికారం లేకే వెనుకబడిపోతున్నాం
ఆత్మీయ సత్కార సభలో ప్రజాప్రతినిధులు
గౌడ, శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సభ
కోటగుమ్మం (రాజమహేంద్రవరం సిటీ) : ఐక్యతే పెట్టుబడిగా బీసీలంతా నడవాలని, సంఘానికి నేనేమైనా చేశానా.. చేయగలనా అని ప్రతి బీసీ ప్రశ్నించుకోవాలని పలువురు నేతలు పిలుపునిచ్చారు. అధిక జనాభా కలిగిన బీసీలను ఆయా రాజకీయ పార్టీలు గుర్తించేలా మన ఉద్యమాలు, పోరాటాలు ఉండాలన్నారు. కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి పితాని సత్యనారాయణ, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, శాసన మండలి ప్రభుత్వ విప్ అంగర రామ్మోహనరావులకు ఆదివారం రాజమహేంద్రవరంలోని జేకే గార్డెన్స్‌లో రాజమహేంద్రవరం గౌడ, శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సత్కారం నిర్వహించారు. బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి మాట్లాడుతూ మంజునాథ కమిషన్ విచారణకు మనమంతా బాగా స్పందించామని, పార్టీలకు అతీతంగా కలిసి నడుద్దామని పిలుపునిచ్చారు. జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ బీసీలను విస్మరిస్తే రాజకీయ పార్టీలకు మనుగడ ఉండదని, ఐక్యతే మన శక్తి... స్ఫూర్తి అని నినదించారు. బీసీలకు ఫీజు రియంబర్స్‌మెంట్ ఇచ్చే విషయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన కృషి మరువలేనిదన్నారు. మంత్రి పితాని మాట్లాడుతూ తమకు ప్రస్తుతం లభించిన పదవులు కేవలం బీసీ కులాలు, ఆ సంఘాల ప్రజలను చూసి ఇచ్చినవేనని, ఈ విషయాన్ని మరచిపోయి రాజకీయాలు చేయబోమని, బీసీల కోసం ఎల్లపుడూ తపిస్తామన్నారు. రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పార్టీ, సంఘాన్ని సమన్వయం చేసుకుంటూ వెళ్లాలన్నారు. తాము ఏ స్థాయిలో ఉన్నా సంఘాన్ని మరువబోమన్నారు. అంబేద్కర్ భవన్ లాగే ప్రతి జిల్లాలో మహాత్మా జ్యోతిరావు పూలే భవన్‌ల నిర్మాణానికి ప్రయత్నిస్తామని, అందుకు స్థల దాతలు ముందుకు రావాలన్నారు. అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో బీసీ కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తామన్నారు. దీనిలో భాగంగా కొత్తపేటలో బీసీ కన్వెన్షన్ నిర్మిస్తున్నామన్నారు. అంగర రామ్మోహన మాట్లాడుతూ బీసీలకు న్యాయం జరిగేందుకు కృషి చేస్తామన్నారు. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా బీసీలు ఒక శక్తిగా అవతరించాలన్నారు. ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, దొమ్మేటి వెంకటేశ్వరరావు, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రమౌళి తదితరులు మాట్లాడారు. అనంతరం మంత్రి పితాని సత్యనారాయణ, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, విప్ అంగర రామ్మోహనరావులను సత్కరించారు. కార్పొరేటర్లు గుత్తుల మురళీధరరావు, బాపన సుధారాణి, పిల్లి నిర్మల, ఆత్మీయ అభినంద సత్కార సభ ఆహ్వాన కమిటీ సభ్యులు బుడ్డిగ శ్రీనివాస్, కుడుపూడి పార్థసారధి, వాసంశెట్టి గంగాధర్, ఆతిథ్య కమిటీ సభ్యులు సూరంపూడి శ్రీహరి, మార్గాని రామకృష్ణగౌడ్, బీసీ సంఘం నాయకులు రెడ్డి రాజు, పాలిక శ్రీను, పెంకే సురేష్, లక్ష్మితులసి తదితరులు పాల్గొన్నారు.
Advertisement