జెడ్పీ కార్యాలయంలో గ్రీవెన్స్‌సెల్
కాకినాడ సిటీ :
జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో బుధవారం జడ్పీ చైర్మన్ నామన రాంబాబు గ్రీవెన్స్‌సెల్ నిర్వహించారు. పలువురు జెడ్పీటీసీ సభ్యులతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు సమస్యలపై వినతులు అందజేశారు. తొండంగి మండలం వేమవరం ఎంపీటీసీ ఎన్.హైమవతి గ్రామంలోని తాగునీరు, సీసీ రోడ్లు, డ్రెయిన్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని కోరారు. వాటిపై చైర్మన్ సానుకూలంగా స్పందించి మంజూరుకు అధికారులకు సూచించారు. ఐ.పోలవరం జెడ్పీటీసీ పేరాబత్తుల రాజశేఖర్, మామిడికుదురు మండలం మగటపల్లి ఎంపీటీసీ నామన నగేష్‌లు వివిధ సమస్యలపై వినతులు అందజేశారు. సీపీడబ్ల్యూస్, ఆర్‌డబ్ల్యూఎస్ ప్రాజెక్ట్‌లలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులు బకాయి వేతనాల కోసం వినతిపత్రం అందజేయగా చైర్మన్ స్పందించి చర్యలకు ఆదేశించారు. జెడ్పీ సీఈవో కె.పద్మ, కార్యాలయ విభాగాల సూపరింటెండెంట్‌లు పాల్గొన్నారు.