గ్రూప్-2 పరీక్ష ప్రశాంతం
- 40,042 మంది హాజరు
- దూర కేంద్రాలతో ఇబ్బందులు
- ఎండ వేడిమికి అల్లాడిన అభ్యర్థులు
అనంతపురం ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన గ్రూప్-2 (స్క్రీనింగ్)పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా సాగింది. జిల్లా వ్యాప్తంగా 135 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 52,034 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 40,042 మంది (76.95 శాతం) మాత్రమే హాజరయ్యారు. కలెక్టర్ కోన శశిధర్ అనంతపురంలోని కేఎస్‌ఆర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆయన వెంట జిల్లా రెవెన్యూ అధికారి మల్లీశ్వరిదేవి, ఆర్డీఓ మలోలా, అనంతపురం తహసీల్దార్ శ్రీనివాసులు ఉన్నారు.
దూర కేంద్రాలతో ఇబ్బందులు
అనంతపురం నగర శివారులో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పరీక్షలు రాయాల్సిన దూర ప్రాంతాల అభ్యర్థులు ఆయా కేంద్రాలు ఎక్కడున్నాయో తెలుసుకుని సమయానికి అక్కడకు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు తేల్చి చెప్పడంతో ఉదయం 7 గంటల నుంచే నగరంలో అభ్యర్థుల సందడి మొదలైంది. దూర ప్రాంతాల్లో ఉన్న కేంద్రాలకు రవాణా సౌకర్యం లేక చాలామంది అభ్యర్థులు వందలాది రూపాయలు చెల్లించి ఆటోల్లో వెళ్లారు.
ఎండకు అల్లాడిన అభ్యర్థులు
ఎండ వేడిమితో అభ్యర్థులు అల్లాడారు. మిట్ట మధ్యాహ్నం పరీక్ష ముగియడంతో వారి వారి ఊళ్లకు చేరుకునేందుకు తంటాలు పడ్డారు. సూర్యడు ప్రతాపం చూపడంతో ఉక్కపోతతో ఇక్కట్లు పడ్డారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ దాదాపు ఒకేస్థాయిలో ఉండటం విశేషం.
- జిల్లాల్లోని పలు కేంద్రాల్లో అభ్యర్థులు తీసుకువెళ్లిన సెల్‌ఫోన్లను ఆయా కేంద్రాల్లో డిపాజిట్ చేసేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.10 వసూలు చేశారు.
- పుట్టపర్తికి చెందిన కేశవ్‌కు హిందూపురంలోని ఎన్‌ఎస్‌పీఆర్ కళాశాలను పరీక్ష కేంద్రంగా వేశారు. అయితే హాల్ టికెట్‌లో కళాశాల పేరు ఎస్‌ఎస్‌పీఆర్ రావడంతో ఆ అభ్యర్థి పట్టణమంతా తిరగాల్సి వచ్చింది.