రెండుగా చీలిన టీడీపీ
రెండుగా చీలిన టీడీపీ
Published Tue, Jul 11 2017 12:09 AM | Last Updated on Fri, Aug 10 2018 8:26 PM
- వడిశలేరులో విభేదాలు
- ఇరువర్గాల మధ్య దూషణలు
- గ్రామంలో ఉద్రిక్తత
- కొనసాగుతున్న 144 సెక్షన్ అమలు
- ఇరువర్గాలతో ఎమ్మెల్యే శాంతి చర్చలు
వడిశలేరు(రంగంపేట): ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒకేమాట, ఒకే బాటగా నడిచి గ్రామ సర్పంచి, ఎంపీటీసీలు రెండు స్థానాలు, జెడ్పీ వైస్‌చైర్మన్ పదవి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ పదవి, జిల్లా తెలుగు యువత ఉపా««ధ్యక్ష పదవి సాధనలో కృషి చేసిన జెడ్పీ తాజా మాజీ వైస్ చైర్మన్ పెండ్యాల నళినీకాంత్, జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు ఆళ్ల గోవింద్‌ల అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయారు. గత ఏడాది జనవరి 1న జెడ్పీ వైస్ చైర్మన్ పెండ్యాల నళినీ కాంత్‌కు శుభాకాంక్షలు చెప్పిన ప్లెక్సీలో జిల్లా తెలుగు యువత ఉపా«ధ్యక్షుడు ఆళ్ల గోవింద్ ఫొటో వేయకపోవడంతో ఇరువర్గాలుగా విడిపోవడానికి కారణమైందని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే నాటి నుంచి నేటి వరకు అది బహిర్గతం కాకపోయినా, ఈ నెల 9వ తేదీన జెడ్పీ వైస్ చైర్మన్ పదవికి నళినీ కాంత్ రాజీనామా చేయడంతో ఆదివారం అర్ధరాత్రి ఆళ్ల వర్గీయులు కొంత మంది నళినీకాంత్ ఇంటికి, కారు డ్రైవర్ ఇంటికి వెళ్లి దుర్భాషలాడినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న నళినీకాంత్ వర్గీయులు కూడా ఆళ్ల వర్గీయులపై దూషణలకు దిగడంతో ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పెద్దాపురం డీఎస్పీ రాజశేఖర్ ఆధ్వర్యంలో పెద్దాపురం సీఐ ప్రసన్న వీరయ్య గౌడ్, రంగంపేట ఎస్సై ఎన్.సన్యాసి నాయుడు పోలీసు బలగాలతో వడిశలేరు గ్రామం చేరుకుని ఇరు వర్గాలను చెల్లా చెదురు చేశారు. సోమవారం ఉదయం నుంచి ఇరువర్గాల ఇళ్ల వద్ద తమ వర్గీయులు చేరుకోవడం, సాయంత్రం దూషణలతో ఘర్షణలకు దిగడంతో పోలీసులు వారిని చెల్లాచెదురు చేశారు, ముందస్తు చర్యగా 144వ సెక‌్షన్ అమలు చేశారు. ఎఎన్‌ఎస్ పోలీసు బలగాలను ఇద్దరి ఇళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈవిషయం తెలుసుకున్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హైదరాబాద్ నుంచి సాయంత్రానికి వడిశలేరు చేరుకున్నారు. పెండ్యాల ఇంటి వద్ద విడిగా చర్చలు జరిపారు. చర్చలు విషయం చెప్పాలని అభిమానులు ఎమ్మెల్యే కారును వెళ్లకుండా అడ్డగించారు. పెండ్యాల కలుగజేసుకుని కారును వదలిపెట్టాలని వాదనకు దిగడంతో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, పక్కవీధిలోనే ఉన్న ఆళ్ల గోవింద్ ఇంటికి వెళ్లారు. రంగంపేట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఇరువర్గాలను రప్పించి ఎమ్మెల్యే చర్చల వివరాలు వెల్లడించారు. ఇతర గ్రామానికి చెందిన వ్యక్తిని గ్రామంలోకి రానీయకుండా చేయాలని, గొడవలు సృష్టించకుండా చూడాలని కోరినట్టు నళినీకాంత్ తెలుపగా, మా వర్గీయులతో ఏవిధమైన వాదనలకు దిగవద్దనిగోవింద్ చెప్పినట్లు విలేకరులకు తెలిపారు. ఈ విషయంమై ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని కోరగా ఇది కుంటుంబ తగాదాలాంటిదని, దీన్ని శాంతియుతంగానే పరిష్కరించామని సమా«ధానమిచ్చారు. రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్ కూడా వడిశలేరు చేరుకుని ఇరువర్గాలతో చర్చలు జరిపారు. పార్టీ భవిష్యత్ దృష్ట్యా ఎంటువంటి వివాదాలకు గురికావద్దని సూచించినట్లు తెలిసింది. ముందస్తు చర్యగా పోలీసు బందోబస్తును కొనసాగిస్తున్నామని డీఎస్పీ రాజశేఖర్ తెలిపారు.
Advertisement