–హాల్ టికెట్లు తీసుకున్న అభ్యర్థులు 56,200
–హాజరైన వారు 41,568
– 14,632 మంది గైర్హాజరు
– దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు నిల్
-దూరంగా పరీక్షా కేంద్రాలు.. అభ్యర్థులకు తప్పని తిప్పలు
–పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు
ఆదోని మండలానికి చెందిన వారికి ఆళ్లగడ్డ, ఆళ్లగడ్డకు చెందిన వారికి ఎమ్మిగనూరులో సెంటర్లు ఏర్పాటు చేయడంతో ఆయా పట్టణాల్లో పరీక్ష రాసేందుకు అభ్యర్థుల తలప్రాణం తోకకు వచ్చింది.
కర్నూలు(అగ్రికల్చర్): గ్రూపు–2 ప్రిలిమ్స్(స్కీనింగ్ టెస్ట్) పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. కర్నూలు(కల్లూరుతో సహా), నంద్యాల, డోన్, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, బనగానపల్లె, కోవెలకుంట్ల, పాణ్యం, ఆదోని, ఎమ్మిగనూరుల్లో పరీక్ష కేంద్రాలు(152) ఏర్పాటు చేశారు. పరీక్షకు 56,200 మంది హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోగా 41,568 మంది హాజరయ్యారు. 14,632 మంది గైర్హాజరయ్యారు. పరీక్షకు 73.96 శాతం మంది హాజరయ్యారని జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌గౌడు తెలిపారు. సరిగ్గా 10 గంటలకు సెంటర్ల మెయిన్ గేట్లను మూసివేశారు. ఆలస్యంగా వచ్చారనే కారణంతో జిల్లా వ్యాప్తంగా 10 మందిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. రవీంద్ర విద్యానికేతన్, పాతబస్తీలోని కస్తూరి పాఠశాల కేంద్రాన్ని ఏపీపీఎస్సీ అసిస్టెంటు సెక్రటరీ అలివేలుమంగమ్మ, సెక‌్షన్ ఆఫీసర్ కృష్ణవేణి తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాలను 11 మంది కో ఆర్డినేషన్ అధికారులుగా నియమితులైన జిల్లా అధికారులు, లైజన్ అఫీసర్లు, అసిస్టెంటు లైజన్ ఆఫీసర్లు తనిఖీలు నిర్వహించారు. అన్ని పరీక్ష కేంద్రాల దగ్గర పోలీసు బందోబస్తు కల్పించారు. ప్రశ్నపత్రం సులభంగా వచ్చిందని అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు.
రెవెన్యూ సిబ్బంది జాగరణ...
పరీక్షను ఎక్కువ మంది రాస్తుండటం వల్ల ఈ సారి జిల్లా వ్యాప్తంగా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్ షీట్లను కలెక్టరేట్‌లోని జిల్లా ట్రెజరీ కార్యాలయంలోనే భద్రపరిచారు. వీటిని పరీక్ష కేంద్రాలకు ఉదయం 8 గంటలకే చేర్చాల్సి ఉండటంతో రెవెన్యూ సిబ్బంది శనివారం రాత్రంతా విధులు నిర్వర్తించారు. ముందుగా అళ్లగడ్డ, తర్వాత కోవెలకుంట్ల, ఆదోని తదితర దూర ప్రాంతాలకు ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్ షీట్లను పంపారు. డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు, ఏపీపీఎస్సీ అధికారులు కలెక్టరేట్‌లోని ఉండి పర్యవేక్షించారు.
పరీక్ష కేంద్రాలకు వెళ్లడానికి ఎన్ని ఇబ్బందులో..
పరీక్ష కేంద్రాలకు వెళ్లడానికి అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ బస్సులు శివరాత్రి వేడుకులకు వినియోగించడంతో సకాలంలో బస్సులు అందుబాటులోకి రాలేదు. దీంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దూరంగా సెంటర్లు ఉండడంతో అభ్యర్థులకు ఇక్కట్లు తప్పలేదు. చాలామంది ఆటోల్లో పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.
ప్రత్యేక ఏర్పాట్లుంటే ఒట్టు...
దివ్యాంగులు, గర్భిణులకు కిందనే ప్రత్యేక రూముల్లో సీట్లు వేసి పరీక్ష రాయించాల్సి ఉంది. మొదటి, రెండవ అంతస్తుల్లో వెళ్లడానికి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఏపీపీఎస్సీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే ఎక్కడా ఈ సదుపాయం కలిపించలేదు. దీంతో దివ్యాంగులు, గర్భిణులు అవస్థలు పడ్డారు.
పరీక్ష సజావుగా జరిగింది...
గ్రూపు–2 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. నాలుగు రోజులుగా చేసిన కృషి ఫలించింది. పరీక్ష పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్, డీఆర్‌ఓ, కలెక్టరేట్ ఏఓ వెంకటనారాయణ సహకరించారు. అధికారుల సమష్టి కృషితో పరీక్ష సజావుగా ముగిసింది. -అలివేలుమంగమ్మ అసిస్టెంటు సెక్రటరీ, ఏపీపీఎస్సీ