పరీక్ష ప్రశాంతం
పరీక్ష ప్రశాంతం
Published Sun, Apr 23 2017 10:39 PM | Last Updated on Tue, Sep 5 2017 9:31 AM
- 176 కేంద్రాల్లో గ్రూపు-3 పరీక్ష
- 56,076 మందికి 36,816 మంది హాజరు
- వివరాలు సరిపోలక ఇబ్బందులు
- అభ్యర్థుల అండర్‌టేకింగ్‌తో పరీక్షకు అనుమతి
కర్నూలు(అగ్రికల్చర్): ఏపీపీఎస్‌సీ గ్రూపు-3 కేటగిరీలో పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీకోసం ఆదివారం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ, పాణ్యం, నందికొట్కూరు, డోన్, ఎమ్మిగనూరులో ఏర్పాటు చేసిన 176 కేంద్రాల్లో ఉదయం 10 నుంచి 12.30 వరకు నిర్వహించిన పరీక్షకు 56,076 మందికిగాను 36,816 మంది హాజరయ్యారు. ఆదోని, ఎమ్మిగనూరు ప్రాంతాల వారిని ఆళ్లగడ్డ, నంద్యాల.. ఆళ్లగడ్డ, నంద్యాల ప్రాంతాల వారికి ఎమ్మిగనూరులో సెంటర్లు కేటాయించడం వల్ల అభ్యర్థులు ఆయా కేంద్రాలకు చేరుకునేందుకు నానా ఇబ్బందులు పడ్డారు.
సాయిసుబ్బయ్య రవీంద్ర ఇంగ్లిషు మీడియం స్కూల్ అడ్రసును బి.క్యాంపు మాధవీనగర్ అడ్రసుపై హాల్ టికెట్లు జారీ చేశారు. అయితే పరీక్షకు కొన్ని గంటల ముందు ఈ కేంద్రం నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలోని బిషప్ చర్చి ఎదుట ఉన్నట్లు అ«ధికారులు ప్రకటించారు. అడ్రసు మారినందునా అభ్యర్థులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో పరీక్ష కేంద్రానికి చేరుకునే విధంగా అధికారులు రెండు కార్లు, 12 ఆటోలను సిద్ధంగా ఉంచారు.
వివరాల్లో తేడాలతో ఇక్కట్లు...
మొదటి సారిగా అభ్యర్థుల పూర్తి వివరాలతో ఓఎంఆర్ షీట్లను ముద్రించారు. అయితే ఓఎంఆర్ షీట్, హాల్ టికెట్‌లోని వివరాలు సరిపోలకపోవడంతో ఇన్విజిలేటర్లు అభ్యంతరం తెలిపారు. భార్య పేరుకు బదులు భర్త పేరుండటం, హాల్ టికెట్‌లో ఫొటోలు తారుమారు కావడంతో కొంత ఇబ్బంది ఎదురైంది. కర్నూలు సిల్వర్ జుబ్లి కళాశాల, నంద్యాలలోని మరో సెంటరులో ఇలాంటి పరిస్థితి ఎదురైంది. కొన్ని సెంటర్లలో ఇంటి పేర్లలోను తేడాలు వచ్చాయి. అయితే ఏపీపీఎస్‌సీ అధికారుల సూచనల మేరకు అభ్యర్థుల నుంచి అండర్ టేకింగ్ తీసుకొని పరీక్షకు అనుమతించారు.
రెండు, మూడు అంతస్తుల్లో సీట్లు కేటాయించడంతో అక్కడికి చేరుకునేందుకు వికలాంగులు నానా ఇబ్బంది పడ్డారు. నలుగురు ఎపీపీఎస్‌సీ సెక‌్షన్ ఆఫీసర్లు జిల్లాలో జరిగిన పరీక్షను పర్యవేక్షించారు. 11 మంది డిప్యూటీ కలెక్టర్లు అసిస్టెంటు కో ఆర్డినేటర్లుగా, 44 మంది తహసీల్దార్లు లైజన్ అధికారులుగా పరీక్షను పర్యవేక్షించారు. పరీక్ష ప్రశాంతంగా జరిగిందని ఏపీపీఎస్‌సీ సీనియర్ సెక‌్షన్ అధికారి రమణ తెలిపారు. డీఆర్వో గంగాధర్‌గౌడు, కలెక్టరేట్ ఏఓ వెంకటనారాయణ, డీటీ ఆదినారాయణ, ఇతర రెవెన్యూ అధికారులు బాగా సహకరించాలని కితాబిచ్చారు.
Advertisement
Advertisement