
ఆకలిరాజ్యం
సాక్షి, కడప : జిల్లాలో చిన్న ఉద్యోగానికి పెద్ద పెద్ద చదువులు చదివిన వారు సైతం పోటీ పడుతున్నారంటే ఉద్యోగ తీవ్రత ఏ విధంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. అధికారపార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇంటింటికి ఉద్యోగం....లేని, రాని వారికి నిరుద్యోగ భృతి అంటూ డంకా బజాయించి, నేడు విస్మరించింది. నిరుద్యోగుల గురించి, వారు పడుతున్న వేదన గురించి చంద్రబాబు సర్కార్ అసలు పట్టించుకోవడం లేదు. పెద్దపెద్ద చదువులు చదివిన వారికి సైతం ఉద్యోగాలు కల్పించడంలో సర్కార్ పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
డీఎస్సీలో జిల్లాకు కేవలం 200 పోస్టుల మాత్రమే కేటాయించగా, పోలీసుశాఖలో కూడా అన్నో ఇన్నో ఉద్యోగాలు రానున్నాయి. ఈ రెండు తప్ప మరే ఉద్యోగాలకు పెద్దగా నోటిఫికేషన్లు వెలువడలేదు. నిరుద్యోగులు మాత్రం ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఏదో అడపాదడపా ప్రైవేటు కంపెనీల్లో చిన్నచిన్న ఉద్యోగాలు మినహా పెద్దస్థాయి ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రం భర్తీకి నోచుకోలేదు. ప్రభుత్వం ఏర్పాటై రెండున్నరేళ్లు దాటుతున్నా ఇంతవరకు వేలాదిమంది నిరుద్యోగులు ఉపాధి కల్పనకు నోచుకోలేదు.
నిన్న ఎక్సైజ్, నేడు పోస్టల్‌శాఖలకు భారీగా దరఖాస్తులు
శాఖ ఏదైనా....పోస్టు ఏదైనా నిరుద్యోగుల మధ్య పోటీ మాత్రం తీవ్రంగా ఉంది. ఇటీవలే ఎక్సైజ్‌శాఖకు సంబంధించి వైన్‌షాపుల్లో 165 సూపర్‌వైజర్లు, అసిస్టెంట్ల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తే దాదాపు 2 వేలమంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం పోస్టల్ శాఖలో 24 బ్రాంచ్ పోస్టుమాస్టర్లకు సంబంధించి 15 వేలమందికి పైబడి దరఖాస్తు చేసుకోవడం చూస్తే నిరుద్యోగ తీవ్రత ఇట్టే తెలిసిపోతుంది. ఒక్కొక్క పోస్టుకు దాదాపు 700 మంది పోటీపడుతున్నారు.
చిన్న ఉద్యోగానికి ఉన్నత విద్యావంతులు
ఉద్యోగ స్థాయి ఏదైనా దొరికితే అదే చాలని అనుకుంటున్నారు. చిన్న ఉద్యోగమైనా పెద్ద పెద్ద చదువులు చదివిన ఉన్నత విద్యావంతులు పోటీపడుతున్నారు. వైన్‌షాపుల్లో సూపర్‌వైజర్ పోస్టులు మొదలుకొని ప్రతి చిన్న ఉద్యోగానికి పెద్ద చదువులు చదివిన యువకులు పోటీ పడుతున్నారు. పదవ తరగతి, ఇంటర్ అర్హత కలిగిన ఉద్యోగాలకు కూడా డిగ్రీ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ చదివిన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకుంటున్నారు. పోటీపడటానికి కారణం లేకపోలేదు. ప్రభుత్వ ఉద్యోగాలు రాకపోవడంతోనే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రతి ఉద్యోగానికి పోటీ పడుతున్నారు.
ఇంజనీరింగ్ పూర్తిచేసినా ఉద్యోగాలు దొరకడం లేదు.
ఉన్నత విద్య బీటెక్ పూర్తిచేసినా కూడా మన రాష్ట్రంలో ఉద్యోగాలు దొరకడం లేదు. కారణం ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యాక్టరీలు, కంపెనీలు లేకపోవడమే. దీనికి తోడు ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వ చర్యలు తీసుకోవడం లేదు. దీంతో డిగ్రీలు, బీటెక్‌లు పూర్తి చేసినా నిరుద్యోగులుగా ఉండిపోతున్నారు.