అలుపెరుగని పయనం
⇒ఐదోరోజు దిగ్విజయంగా సాగిన ఆత్మగౌరవయాత్ర
⇒అన్ని ప్రాంతాల్లోనూ తరగని ప్రజాదరణ
⇒రైల్వేజోన్ ఇవ్వాల్సిందేనని నినాదాల హోరు
రోజులు గడుస్తున్నాయి.. ప్రాంతాలు మారుతున్నాయి.. కానీ లక్ష్యం మారలేదు.. పట్టుదల అసలే సడలలేదు.. ఆత్మగౌరవయాత్రకు లభిస్తున్న జనస్పందననే జోష్‌గా మార్చుకొని.. ద్విగుణీకృతోత్సాహంతో పాదయాత్ర కొనసాగిస్తున్నారు.. పాదయాత్రికుడు అమర్‌కు వెన్నుదన్నుగా.. సంఘీభావంగా పార్టీ నాయకులు, శ్రేణులు నిలుస్తున్నారు.. ఆయన అడుగులో అడుగేస్తూ ముందుకు సాగుతుంటే ఆత్మగౌరవయాత్ర సాగిన మార్గం పొడవునా మహిళలు, పిల్లలు, వృద్ధులు, యువకులు జయజయధ్వనాలతో రైల్వేజోన్ ఆకాంక్షను వ్యక్తం చేస్తూ.. మద్దతు ప్రకటిస్తున్నారు. వారి నినాదాల హోరు మధ్య ఐదోరోజు ఆత్మగౌరవ యాత్ర షీలానగర్ నుంచి సింహాచలం గోశాల వరకు దిగ్విజయంగా సాగింది.
విశాఖపట్నం : రైల్వే జోన్ సాధనకై వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ తలపెట్టిన ఆత్మగౌరవ యాత్ర నిర్విఘ్నంగా సాగుతోంది. అడుగడుగునా అమర్‌కు జనం హారతులు పడుతున్నారు. ఐదో రోజైన సోమవారం ఉదయం గవర జగ్గయ్యపాలెంలో నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. ఉత్తరాంధ్ర నుంచి ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామితో పాటు పలువురు నాయకులు భారీ ఎత్తున తరలివచ్చి అమర్ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. జిల్లా నుంచి మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు ఆత్మగౌరవ యాత్రలో పాల్గొన్నారు. సత్తమ్మతల్లి జంక్షన్, సత్తివానిపాలెం, కోట నరవ, నరవ వరకు పాదయాత్ర చేసి భోజన విరామం తీసుకున్నారు. తిరిగి సాయంత్రం కొత్తపాలెం జంక్షన్, కొత్తపాలెం బ్రిడ్జి, గోపాలపట్నం మెయిన్ రోడ్డు, శ్రీరాంనగర్ మీదుగా ఆర్.ఆర్.వి.పురం జంక్షన్, నాయుడు తోట నుంచి వేపగుంట వరకూ పాదయాత్ర చేపట్టి అక్కడ బహిరంగ సభ నిర్వహించారు.
భారీ సంఖ్యలో ప్రజలు ఆయన రాకకోసం అప్పటికే అక్కడ ఎదురు చూశారు. వారినుద్దేశించి ప్రసంగించారు. అంతకు ముందు ఆర్‌ఆర్‌వి పురంలో పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ సర్పంచ్ ఆదిరెడ్డి చల్లాయమ్మ ఎదురువచ్చి అమర్‌కు సంఘీభావం తెలిపి పాదయాత్రలో పాల్గొన్నారు. వేపగుంట నుంచి ముందుకు కదిలిన అమర్ గోశాల, గవర్నమెంట్ హాస్పటల్ వద్దకు చేరుకున్నారు. సమీపంలోని స్వామి కల్యాణమండపంలో అమర్‌నాథ్ రాత్రి బస చేశారు.
పాదయాత్రలో ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, నియోజకవర్గ సమన్వయకర్తలు అదీప్‌రాజు, మళ్ల విజయప్రసాద్, తైనాల విజయకుమార్, కోలా గురువులు, బొడ్డేడ ప్రసాద్, తిప్పల నాగిరెడ్డి, పెట్ల ఉమాశంకర గణేష్, కరణం ధర్మశ్రీ,, మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, రాష్ట్ర సీఈసీ సభ్యుడు దామా సుబ్బారావు, రాష్ట్ర బీసీడీఎఫ్ అధ్యక్షుడు పక్కి దివాకర్, ప్రచార కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కొండా రాజీవ్, రాష్ట్ర కార్యదర్శులు జాన్‌వెస్లీ, రొంగలి జగన్నాథం, రాష్ట్ర యువజన అధికార ప్రతినిధి తుళ్లి చంద్రశేఖర్‌యాదవ్, జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ బయ్యవరపు రాధ, కార్యదర్శి పొట్నూరు విజయకుమార్, రూరల్ జిల్లా ప్రచార కార్యదర్శి పోతల ప్రసాద్, నగర కమిటీ ప్రధాన కార్యదర్శి సేనాపతి అప్పారావు, భీమిలి పట్టణ అధ్యక్షుడు అక్కరమాని వెంకటరావు, నగర మహిళా విభాగం జనరల్ సెక్రటరీ శ్రీదేవివర్మ, నగర మహిళా కార్యదర్శి యువశ్రీ, నగర మహిళా అధికార ప్రతినిధి మళ్ల ధనలత పాల్గొన్నారు.
చంద్రబాబుకు నీతి, నిజాయితీ ఉందా?
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను కోట్ల రూపాయలు పెట్టి కొన్న చంద్రబాబుకు నీతి నిజాయితీ ఉందా అని మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు ప్రశ్నించారు. రైల్వే జోన్ కోసం అమర్‌నా«థ్ చేస్తున్న ఆత్మగౌరవ యాత్రకు ఉత్తరాంధ్ర మొత్తం మద్దతు పలుకుతోందన్నారు. విభజన చట్టంలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ఉన్నా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రత్యేక హోదాలాగే రైల్వే జోన్‌ను కూడా నీరుగార్చే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదన్నారు.
ప్రజలను నమ్మించి నట్టేట ముంచారు..
అమలుకాని హామీలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలను నమ్మించి నట్టేట ముంచారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ దుయ్యబట్టారు. అడ్డదారిలో వెళితే వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడో ముఖ్యమంత్రి ఆయ్యేవారన్నారు. అలాంటి వంచనలు, అడ్డదారులు చంద్రబాబుకు మాత్రమే తెలుసునన్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి అడ్డదారిలో తమ పార్టీలోకి చేర్చుకున్న చంద్రబాబును జనం ఛీదరించుకుంటున్నారన్నారు. నైతిక విలువలకు కట్టుబడి ఉన్న జగన్‌ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని తెలిపారు.