పద్యం జాషువాకు మాతృభాష
-
సంస్మరణ సభలో ప్రముఖుల నివాళులు
రాజమహేంద్రవరం కల్చరల్ :
‘‘మనిషి జీవించిన కాలంకన్నా, మరణించిన తరువాత జీవించిన కాలం ఎక్కువ ఉండాలి. జాషువా ఈ కోవకు చెందిన కవి’’ అని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ తలారి వాసు అన్నారు. భారతీయ సాహిత్య పరిషత్, నగర శాఖ ఆధ్వర్యాన ఆంధ్రకేసరి డిగ్రీ కళాశాలలో వేమూరి విశ్వనాథం జయంతి సందర్భంగా గురువారం జరిగిన జాషువా సంస్మరణ సభలో వాసు ప్రసంగించారు. ‘రాజు జీవించు రాతి విగ్రహములందు – సుకవి జీవించు ప్రజల నాల్కలయందు’ అని జాషువా అన్నారని గుర్తు చేశారు. ‘‘పద్యం జాషువాకు మాతృభాష. కష్టాలు, కన్నీళ్ళు ఆయనకు కళ్లజోడు’’ అని అన్నారు. ‘‘గాడుపు నా జీవితమైతే, వెన్నెల నా కవిత్వం’’ అని జాషువా అన్నారన్నారు. ‘‘కులమతాలు గీసుకున్న గీతల జొచ్చి, పంజరాన కట్టుబడను నేను, నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తిరుగు లేదు, విశ్వనరుడ నేను’’ అంటూ కవికి కులం ఉండదన్న విషయాన్ని జాషువా చెప్పారని వివరించారు. జాషువా రచించిన ‘గబ్బిలం’ ఆంధ్రుల చరిత్రేనని వాసు అన్నారు. శతావధానధురీణ డాక్టర్ అబ్బిరెడ్డి పేరయ్యనాయుడు ప్రసంగిస్తూ, జాషువా కవిత్వం కరుణ రసాత్మకమైనదని అన్నారు. ధనవంతుడిని, అందగాడిని కాదని, నీతివంతుడిని, గుణవంతుడిని జాషువా కథానాయకుడిని చేశారన్నారు. తొలుత జాషువా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. çసభకు చిలకమర్తి ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి పెరుమాళ్ళ రఘునాథ్ అధ్యక్షత వహించారు. ప్రధాన వక్త తలారి వాసును నిర్వాహకులు సత్కరించారు. ప్రిన్సిపాల్ చింతా జోగినాయుడు, కరస్పాండెంట్ అసదుల్లా అహమ్మద్ పాల్గొన్నారు.
అలరించిన ఛలోక్తులు
తలారి వాసు తన ప్రసంగం ఆద్యంతం ఛలోక్తులతో విద్యార్థులను ఆకట్టుకున్నారు. ‘క’ష్టజీ‘వి’కి అటు ఇటు ‘కవి’.. ‘క’నిపిస్తే, ‘వి’సిగించేవాడు ‘కవి’.. వర్షంలో తాను సభకు రావడాన్ని ప్రస్తావిస్తూ ‘ఈ ప్రపంచంలో మన మెడలు వంచగలవాడు ఆటోవాడు ఒక్కడే’ అని చమత్కరించారు. ‘‘బ్రేక్ ఇన్‌స్పెక్టర్ ఆటోను ఆపాడు, బిలబిలా 24 మంది ప్రయాణికులు దిగారు’’ అంటూ మరో చమత్కార బాణం వదిలారు.