బోయపాటి పై క్రిమినల్ కేసులు పెట్టాలి
రాజమహేంద్రవరం : పుష్కర తొక్కిసలాటకు ప్రధాన కారకుడు సినీ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్‌పై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తనయుడు జీవీ శ్రీరాజ్ డిమాండ్ చేశారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ పుష్కర తొక్కిసలాట సమయంలో బోయపాటి శ్రీనివాస్ వద్ద మైక్ ఉందని, ఆయన భక్తులను వదలండీ అనగానే పుష్కరాల రేవు గేట్లు ఒక్కసారిగా తెరవడంతో తొక్కిసలాట జరిగి పలువురు మృతి చెందారని వివరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు వచ్చి మైక్ తీసుకొని భక్తులను ఘాట్‌లోకి వదలమని చెప్పడానికి అతనికి ఏ అర్హత ఉందని ప్రశ్నించారు. ఆయన చేతికి మైక్ ఇచ్చిన సమాచార శాఖ కమిషనర్, కలెక్టర్, సబ్ కలెక్టర్, ఎస్పీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో 2015 జూలై 21 వ తేదీన ఫిర్యాదు చేశామని, దానికి త్రీటౌన్ సీఐ శ్రీరామ కోటేశ్వరరావు రశీదు ఇచ్చారన్నారు. పుష్కర తొక్కిసలాటపై ఏర్పాటు చేసిన జస్టిస్ సీవై సోమయాజులు కమిషన్‌కు కూడా ఎఫ్‌ఐఆర్ కాపీని పంపలేదని తెలిపారు.