చెప్పుల వివాదంలో చెయ్యి నరికేశాడు..
Published Wed, Oct 12 2016 10:11 PM | Last Updated on Mon, Sep 4 2017 5:00 PM
ఫిరంగిపురం: చెప్పుల విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య నెలకొన్న వివాదం పెద్దల మధ్య ఘర్షణకు దారితీసిన సంఘటన మంగళవారం 113 తాళ్ళూరు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని కటారి పుల్లయ్య కుమారుడు సాయి, డేగల గోవిందు కుమారుడు సాయి ఇద్దరు స్నేహితులు. కొద్ది రోజుల క్రితం పుల్లయ్య కుమారుడు కొనుగోలు చేసిన చెప్పులు అతడికి సరిపోకపోవడంతో గోవిందు కుమారుడు ఆ డబ్బు తాను ఇస్తానని, ఆ చెప్పులు తనకు ఇవ్వమని చెప్పి తీసుకున్నాడు. రోజులు గడుస్తున్నా చెప్పుల తాలూకూ డబ్బు ఇవ్వక పోవడంతో ఈనెల 10న స్నేహితులిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ విషయం తెలిసి మరుసటి రోజు ఇరు కుటుంబాల పెద్దలు ఘర్షణకు పాల్పడ్డారు. పథకం ప్రకారం కత్తిని వెంట తెచ్చుకున్న గోవిందు దుర్భాషలాడుతూ పుల్లయ్యపై విచక్షణారహితంగా దాడికి పాల్పడి కుడి చేతి మణికట్టు పై భాగంలో నరికాడు. స్థానికులు 108 వాహనంలో పుల్లయ్యను జీజీహెచ్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు రక్తం అధికంగా పోవడంతో అపస్మారక స్థితిలో వున్నాడని తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఫిర్యాదు అందితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని వివరించారు.
Advertisement
Advertisement