హర హర మహాదేవ
- అంగరంగ వైభవంగా
నీలకంఠేశ్వరుని మహా రథోత్సవం
- జనసంద్రమైన
ఎమ్మిగనూరు పట్టణం
- ఆకట్టుకున్న విశేష పూజలు
ఎమ్మిగనూరు: హర హర మహాదేవ..అంటూ భక్తుల జయధ్వానాలు..వేదపండితుల మంత్రోచ్చారణలు.. మంగళవాయిద్యాల సుస్వరాల సమ్మేళనం మధ్య.. శనవారం శ్రీ నీలకంఠేశ్వరస్వామి మహారథోత్సవం ఎమ్మిగనూరు పట్టణంలో అత్యంత వైభవంగా సాగింది. నీలకంఠేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం 6గంటల నుంచి 6.27గంటల వరకు రథోత్సవాన్ని నిర్వహించారు. ఉత్సవంలో రెండు లక్షలకు వరకు భక్తజనం పాల్గొని తరించారు. ముందుగా స్వామి వారి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. అనంతరం తేరుబజార్ వరకు ఉత్సవమూర్తిని ఊరేగింపుగా తీసుకు వచ్చారు. స్వామి వారిని పీఠంపై అధిష్టింపజేసి..హోమం జరిపారు. పూర్ణకుంభంతో నైవేద్యం సమర్పించి హోమం చుట్టూ ఉత్సవమూర్తిని ప్రదక్షిణ చేయించారు. అనంతరం మహా రథంపై అధిష్టింపజేసి.. హారతి ఇచ్చారు. ఆశీర్వచనాలు ముగియగానే..రథోత్సవాన్ని పురోహితులు ప్రారంభించారు. భక్తులు హర నామస్మరణ చేస్తుండగా.. మహారథం ముందుకు సాగింది. రథాన్ని లాగి స్వామివారి కృపను పొందాలని భక్తులు పోటీపడ్డారు. మార్కండేయస్వామి ఆలయం వరకు రథయాత్రను సాగింది. అక్కడ మార్కెండేయ స్వామికి పూజలు నిర్వహించారు. అనంతరం రథాన్ని యథాస్థానానికి లాగి ఉత్సవానికి ముగింపు పలికారు. రథోత్సవాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా..కర్ణాటక, మహారాష్ట్ర, తమిళæనాడు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. నందికోళ్లసేవ , గొరవయ్యల నృత్యాలు, కోలాటాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్యానయి. రథోత్సవాన్ని తిలకించేందుకు మూడు ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు.
రథోత్సవంలో ప్రముఖులు..
రథోత్సవాన్ని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ.జయనాగేశ్వరరెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, బీజేపీ నియోజకవర్గ నాయకులు కేఆర్ మురహరి రెడ్డి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎర్రకోట జగన్‌మోహన్‌రెడ్డి తిలకించారు. వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు వై.రుద్రగౌడ్, మాచాని రఘునాథ్, మంత్రాలయం మాజీ ఎంపీపీ సీతారామిరెడ్డి, టీడీపీ జిల్లా నాయకులు బీటీ నాయుడు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ యువజన నాయకులు వై.ధరణీధర్ రెడ్డి, పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భారీ బందోబస్తు
రథోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆదోని డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు, ఎమ్మిగనూరు సీఐ శ్రీనివాసులు మూర్తి, పట్టణ ఎస్‌ఐ హరిప్రసాద్ నేతృత్వంలో దాదాపు 600మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు.