హరితహారం నిరంతర ప్రక్రియ
-
230 కోట్ల మొక్కలు నాటడానికి ప్రణాళికలు సిద్ధం
-
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
ఖానాపురం : తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన హరితహారం కార్యక్రమం నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని, వచ్చే ఐదేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేశారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం ధర్మరావుపేటలో రెవెన్యూ, తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పూల్‌సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో చేపట్టిన మూడు ఎకరాల్లో 4,600 మొక్కలు నాటే కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం గురువారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరువును నివారించడానికి వనాలను పెంచే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అడవులు ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు కురుస్తున్నాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో అడవులు తగ్గుతున్నాయని గ్రహించిన సీఎం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధిని కేసీఆర్ చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు చెన్నయ్య, రవి, గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అ«ధ్యక్షుడు జగన్మోహన్‌రావు, ఆర్‌జేడీ బాలయ్య, ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, డీఎఫ్‌ఓ కిష్టాగౌడ్ టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.