Haritahaaram
-
హరితహారం సామాజిక బాధ్యత
సాక్షి, శంషాబాద్: హరితహారం కార్యక్రమాన్ని కూడా సామాజిక బాధ్యతగా పరిగణించి మొక్కలను విస్తృతంగా నాటి పెంచాల్సిన అవసరముందని ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్ అన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో సీఐఎస్ఎఫ్, జీఎంఆర్ ఆధ్వర్యంలో ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో భాగంగా ఏర్పాటు చేసిన ‘తెలంగాణకు హరితహారం’కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. మొక్కల పెంపకాన్ని అన్ని రంగాలు బాధ్యతగా, సవాలుగా స్వీకరించి హరిత తెలంగాణకు బాటలు వేయాలని సూచించారు. శంషాబాద్ విమానాశ్రయంలో పచ్చదనానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారని, ఇక్కడ ఉన్న పచ్చదనం దేశంలోని ఏ ఇతర విమానాశ్రయంలో లేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా వేపతో పాటు వివిధ రకాల ఔషధ గుణాలున్న 600 మొక్కలను నాటారు. ఇంత పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినందుకు గ్రీన్ ఇండియా చాలెంజ్ సంస్థ తరఫున జీఎంఆర్, సీఐఎస్ఎఫ్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో జీహెచ్ఐఏఎల్ సీఈఓ ప్రదీప్ ఫణికర్, ఎయిర్పోర్ట్ ముఖ్య భద్రతాధికారి ఎంకే సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
‘కరీంనగర్‌కు పూర్వవైభవం తెచ్చేందుకు ముమ్మరం’
సాక్షి, కరీంనగర్: హరితహారంలో భాగంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ రామ్‌నగర్‌లోని హాస్పిటల్ ఆవరణంతో పాటు, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు చోట్ల సోమవారం మొక్కలు నాటారు. అనంతరం మేయర్ సునీల్ రావుతో కలిసి డివిజన్లోని ఇంటింటికి ఆరు మొక్కలు పంపిణీ చేశారు. ఆ తర్వాత మొగ్దుంపూర్లో కలెక్టర్ శశాంక్‌తో కలిసి ఎకరం ప్రభుత్వ స్థలంలో మంకీ ఫుడ్ కోర్టుకు శ్రీకారం చుట్టి.. పండ్ల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో అతి తక్కువ అటవీ ప్రాంతం ఉన్న జిల్లా అని పేర్కొన్నారు. అందుచేత అడవి లేని కరీంనగర్ జిల్లాలో 50 లక్షల మొక్కలు సెప్టెంబర్ చివరి వరకు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అడవులు లేని జిల్లాగా ఉన్న కరీంనగర్‌కు పూర్వవైభవం తెచ్చేందుకు ముమ్మరంగా మొక్కలు నాటుతున్నామన్నారు. ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తే కరీంనగర్ జిల్లా మళ్లీ అడవులకు నిలయంగా మారుతుందన్నారు. నగరంలో 10 నుంచి 12 లక్షల మొక్కలు నాటేలా ప్రణాళికలు రూపొందించుకున్నామని, నగర ప్రజలకు కావలసిన పండ్లు, పూల మొక్కలు ఇంటికి ఆరు ఉచితంగా పంపిణీ చేస్తుననామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి సంరక్షించితే బావి తరాలకు భవిష్యత్తును ఇచ్చిన వాళ్ళం అవుతామని మంత్రి వ్యాఖ్చానించారు. -
పోడు పోరు.. శిక్ష ఖరారు..!
సాక్షి, ఖమ్మం : పోడు సాగుదారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 2015లో ప్రారంభించిన తొలి విడత హరితహారం నుంచి అటవీశాఖ అధికారులు, పోడుసాగుదారుల మధ్య చోటుచేసుకుంటున్న ఘర్షణలు జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తున్న విషయం తెలిసిందే. ప్రతి హరితహారం సమయంలో అటవీశాఖ అధికారులు మొక్కలు నాటేందుకు ముందస్తుగా కందకాలు తీసే క్రమంలో పోడు సాగుదారులు తిరగబడటం పరిపాటిగా మారింది. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం దీని విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఆసిఫాబాద్ జిల్లాలో అటవీశాఖ మహిళా అధికారిపై జరిగిన ఘటన విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి కేసులు నమోదు చేసింది. అటవీశాఖ అధికారులు సైతం ఆ ఘటనను తీవ్రంగా ఖండించారు. జిల్లాలో సైతం కొత్తగూడెం, ముల్కలపల్లి మండలాల్లో ఇటీవల వరుస పోడు దాడులు చోటుచేసుకున్నాయి. ఏటా హరితహారం సీజన్లో పోడు సాగుదారులకు అటవీశాఖ అధికారులకు ఏజెన్సీ ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం నెలకొనడం పరిపాటిగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే 2015లో జరిగిన పోడు దాడి ఘటన విషయంలో పలువురికి జైలు శిక్ష విధించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఏకంగా 24 మంది పోడుసాగుదారులపై ఏడాది జైలు శిక్ష ఖరారు కావడంతో ఒకింత వారిలో ఆందోళన నెలకొంది. అప్పట్లో సంచలనం.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2015లో తొలిసారిగా హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2015 మార్చి 9న కొత్తగూడెం డివిజన్ రామవరం రేంజ్ పరిధిలోని చండ్రుగొండ మండలం అబ్బుగూడెం, మర్రిగూడెం, సీతాయిగూడెం ప్రాంతాల్లో అటవీశాఖాధికారులు మొక్కలు నాటేందుకు ముందస్తు కందకాలు తీసే క్రమంలో పోడు సాగుదారులు పెద్ద ఎత్తున తిరగబడ్డారు. పరిసర గ్రామాలకు చెందిన దాదాపు వందకు పైగా పోడు గిరిజన సాగుదారులు, గ్రామస్తులు కలిసి అటవీశాఖ అధికారులపై కర్రలు, రాళ్లతో ఎదురుదాడి చేశారు. ఆ దాడి నేపథ్యంలో పోడు భూముల్లో రక్తం చిందింది. ఫారెస్ట్ అధికారులను అడ్డుకోవడానికి పోడుసాగు దారులు తీవ్రంగా ప్రతిఘటించి వారిపై దాడి చేశారు. ఈ దాడిలో అటవీశాఖ అధికారులు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించడమే కాకుండా అసెంబ్లీలో సైతం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో పోడు సాగుదారులపై అటవీశాఖ అధికారులు చండ్రుగొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అప్పట్లో అటవీశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు ఎస్సై జి.రవీందర్ విచారణ నిర్వహించి దాడికి పాల్పడిన 24 మందిపై కేసు నమోదు చేశారు. 24 మందికి శిక్ష ఖరారు అక్రమంగా ప్రభుత్వ అటవీ భూముల్లోకి పోడు సాగుదాడులు ప్రవేశించడమే కాకుండా, విధి నిర్వాహణలో ఉన్న పలువురు అటవీశాఖ అధికారులపై దాడికి పాల్పడటాన్ని నేరంగా భావించి కొత్తగూడెం కోర్టు 24 మందికి జైలు శిక్ష ఖరారు చేస్తూ గురువారం తీర్పు వెలువరించింది. రాష్ట్రంలో పోడు ఘర్షణల నేపథ్యంలో సాగుదారులపై పెద్దఎత్తున శిక్షలు ఖరారు కావడం ఇదే ప్రథమం. ఈ కేసు విషయంలో 24 మందికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ.700 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఏడాది జైలు శిక్ష పడిన వారిలో ఎస్.కె ఉమర్, కాకా మహేశ్, కాలంగి రంగా, జంగిలి వెంకటరత్నం, నుందురి సూర్యప్రకాశ్, భాగ్యలక్ష్మి, కృష్ణకుమారి, సత్యనారాయణ, యాలాద్రి, మంగయ్య, భిక్షం, శ్రీను, రాము, వెంకటి, పద్మ, వీరభద్రం, ధనమ్మ, వెంకటేశ్వర్లు, మోహన్‌రావు, కన్నయ్య, హరీశ్, గోపాల్‌రావు ఉన్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు చోటుచేసుకున్న పోడు దాడుల విషయంలో 270 కేసులు నమోదయ్యాయి. తాజా తీర్పుతో దశాబ్దాలుగా జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో పోడుసాగు చేసుకుంటున్న గిరిజనుల్లో ఒకింత భయాందోళన మొదలైంది. జఠిలంగా పోడు సమస్య జిల్లాలో పోడు సమస్య కొన్నాళ్లుగా నివురుగప్పిన నిప్పులా తయారైంది. జిల్లాలోని మారుమూల గ్రామాల గిరిజన ప్రజలు అనేక ఏళ్లుగా ఈ పోడు వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 5.80 లక్షల హెక్టార్లలో అటవీ భూమి విస్తరించి ఉంది. దీనిలో దాదాపుగా 1.25 లక్షల హెక్టార్ల భూమిని పోడుసాగుదారులు ఆక్రమించి అనేక ఏళ్లుగా పోడుకొట్టుకొని భూమి సాగుచేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 2.05 లక్షల మంది పోడుసాగుదారులు పోడు భూములను సాగుచేస్తున్నట్లు అంచనా. ఇక కొత్తగూడెం జిల్లాలో 4,33,466 హెక్టార్ల అటవీ విస్తీర్ణం ఉంది. అటవీ అధికారుల లెక్కల ప్రకారం 2005 నుంచి 2018 వరకు 90,120 హెక్టార్లు ఆక్రమణకు గురైంది. ఇక పోడు భూముల పేరిట గిరిజనేతరుల ఆక్రమణలో 33,848 హెక్టార్ల భూములున్నాయి. అయితే 2005 అటవీహక్కుల చట్టం ప్రకారం అంతకుముందు భూమిని సాగు చేసుకుంటున్న అనేక మంది పోడు గిరిజనులు పట్టాలివ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవ తీసుకొని జిల్లాలో దాదాపు 95 వేల ఎకరాలకు 30,779 హక్కు పత్రాలు అందజేశారు. ఆ తరువాత మరికొందరివి పెండింగ్‌లోనే ఉన్నాయి. మిగిలిన భూములకు పట్టాలివ్వాలని పోడుసాగుదారులు అనేక ఏళ్లుగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం పోడుసాగుదారులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం వారికి అండగా నిలవాలి. న్యాయపరంగా పట్టాలిస్తామని చెప్పిన సర్కారు అక్రమ కేసులను పెట్టి గిరిజనులను ఇబ్బందులు పెడుతోంది. 2015లో జరిగిన పోడు ఘర్షణలో 24 మందిపై కోర్టు ఇచ్చిన జైలు శిక్ష తీర్పు విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని దాన్ని సుమోటోగా స్వీకరించాలి. శిక్ష పడిన వారికి న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. -మచ్చా వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అటవీ భూములను ఆక్రమిస్తే ఉపేక్షించం అటవీ భూములను ఆక్రమిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదు. ఈ విషయంలో కేసులు నమోదు చేస్తాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు కఠినంగా వ్యవహరిస్తాం. ఎలాంటి ఆధారాలు లేకుండా భూములపైకి వెళ్తే చర్యలు తప్పవు. అక్రమంగా అటవీ భూముల్లోకి వెళ్లి అధికారులపై దాడి చేసిన ఘటనలో తీర్పు కఠినంగా వెలువడింది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా అటవీ భూముల జోలికి వస్తే చట్ట ప్రకారం వ్యవహరిస్తాం. శివాల రాంబాబు, జిల్లా అటవీశాఖాధికారి -
పండ్ల మొక్కలకు ప్రాముఖ్యత
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది హరితహారంలో కోతులకు ఆహారాన్ని ఇచ్చే పండ్ల మొక్కలకు ప్రాముఖ్యత ఇస్తామని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) పీకే ఝా అన్నారు. గత ఏడాది హరితహారం కింద రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు 90 శాతం బతికాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ‘సాక్షి’ప్రతినిధితో మాట్లాడారు. ప్రకృతిలో పండ్ల మొక్కలు తగ్గిపోవడం, మరోవైపు మనుషులు జంక్ ఫుడ్‌ను ఫీడ్‌గా ఇవ్వటం వలన కోతులు వనాలు వదిలి ఊళ్ల మీదకు మళ్లాయని, తిరిగి వాటిని వనాల్లోకి పంపాలంటే సాధ్యమైనన్ని ఎక్కువ పండ్ల మొక్కలు పెంచటం ఒక్కటే మార్గమని చెప్పారు. ‘‘కోతులు ఇష్టంగా తినే 25 రకాల పండ్ల మొక్కలను గుర్తించాం, వాటిని రాష్ట్రవ్యాప్తంగా వివిధ నర్సరీలతో పెంచుతున్నాం. ఈసారి రుతుపవనాలు ఆశాజనకంగానే ఉన్నాయి. మొక్కలతో మేం సిద్ధంగా ఉన్నాం. ఈ ఏడాది 39.5 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. త్వరలోనే ముఖ్యమంత్రితో మాట్లాడి హరితహారం ప్రారంభ తేదీని నిర్ణయిస్తాం. అటవీ భూములు ఉన్నచోట వందకు వంద శాతం పండ్ల మొక్కలనే నాటుతామని, అటవీ భూములు లేనిచోట కనీసం 20 శాతం కోతులు తినే పండ్ల మొక్కలు కచ్చితంగా నాటాలనే నిబంధన పెట్టుకున్నాం. మనుషులు కోతులకు కృత్రిమ ఆహారం ఇవ్వొద్దని, దీనికి అలవాటు పడిన కోతులు సహజ ఆహార అన్వేషణ మరిచిపోయి ఊళ్ల మీదకు మళ్లుతున్నాయని’’ఝా అన్నారు. శాటిలైట్ ఫోటోల ద్వారా రాష్ట్రంలో 565 స్క్వేర్ కిలోమీటర్ల మేరకు పచ్చదనం పెరిగినట్లు నిర్ధారణ అయింది. ఈ ఏడాది గూగుల్ శాటిలైట్ విడుదల చేసిన చిత్రాల్లో గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు మాత్రమే 100 స్క్వేర్ కిలోమీటర్లకు పైగా పచ్చదనం విస్తరించిన రాష్ట్రాలుగా గుర్తింపు పొందాయి. మా పనితనానికి ఇది అద్భుతమైన గుర్తింపు. బంగారు తెలంగాణలో మా భాగస్వామ్యం బలంగా ఉండాలనే ఆశయంతో అటవీ శాఖ ఉద్యోగులు, అధికారులు సమష్టిగా పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్న జల ప్రాజెక్టులకోసం మా అధికారుల చొరవ, కృషిని అభినందిస్తున్నారు. కాళేశ్వరం, సీతారామసాగర్, పాలమూరు ఎత్తిపోతల పథకానికి అత్యంత వేగంగా అటవీ అనుమతులను సాధించటంలో అధికారులు రాత్రింబవళ్లు కృషి చేశారు. కేంద్ర అటవీ శాఖ నుంచి జల ప్రాజెక్టులకు ఇంత వేగంగా అటవీ అనుమతులు గతంలో నేనెప్పుడూ చూడలేదని ఝా చెప్పారు. అటవీ భూముల రక్షణే ధ్యేయంగా.. ఎకోపార్కులు, అర్బన్ ఫారెస్టు పార్కు ల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. ప్రజలకు అడవుల మీద, వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యతల మీద అవగాహన కలిగించటమే ఎకో పార్కుల ఉద్దేశం. హైదరాబాద్ పరిసర ప్రాంతంలోని అటవీ భూములను రక్షించుకుంటూ.. ప్రజలకు స్వచ్ఛమెన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం అందించే లక్ష్యంతో నే అర్బన్ ఫారెస్టు పార్కులను అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికే కొండాపూర్‌లో పాలపిట్ట సైక్లింగ్ ఉద్యానవనం, బర్డ్ పార్కును అభి వృద్ధి చేశాం. 40 రకాలకు చెందిన దాదాపు 7,500 మొక్కలను ఈ పార్కులో కొత్తగా పెంచుతున్నాం. కండ్లకోయ పార్కు వినియోగంలోకి వచ్చింది. కవాల్ టైగర్ రిజర్వు ప్రాజెక్టు సమీపంలో మంచిర్యాల జిల్లా చింతగూడ గ్రామంలో కొత్త పర్యావరణ, పర్యాటక ప్రాజెక్టు కోసం ఆరు ఎకరాల భూమిని గోదావరి నది దగ్గర సేకరించి, పర్యాటక స్థల అభివృద్ధి కోసం టెండర్లు పిలిచాం. నల్లగొండ జిల్లాలోని వైజాగ్ కాలనీలో నాగార్జునసాగర్ తీర ప్రాంతంలో మరొక పర్యావరణ ప్రాజెక్టు కోసం భూమి గుర్తించాం. ప్రతిపాదనలు కీలక దశలో ఉన్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ అడవులను దట్టమైన అటవీ ప్రాంతంగా మార్చాలనేది ముఖ్య మంత్రి ఆకాంక్ష. సుమారు 3,470 హెక్టార్లలో అటవీ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో రక్షించటంతో పాటు పర్యాటకులకు ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్దాలని నిర్ణయించాం. ఆక్రమణలకు గురికాకుండా దాదాపు 40 కి.మీ పొడవునా సీ త్రూ వాల్‌ను నిర్మిస్తాం. వెదురు పరిశ్రమ (బ్యాంబూ లంబర్ ఇండస్ట్రీ) ఏర్పాటుకోసం రూ.22.4 కోట్ల పెట్టుబడులు పెట్టే ప్రతిపాదనలు కీలక దశలో ఉన్నాయి. ఇదివరకు కాగితం తయారీ కోసం పేపర్ మిల్లులు వెదురును కార్పొరేషన్ నుంచి కొనుగోలు చేసేవి. ప్రస్తుతం టెక్నాలజీ మార్పు కారణంగా వీటికి డిమాండ్ లేదు. బ్యాంబూ లంబర్ ఇండస్ట్రీని స్థాపించి ఈ ప్లాంటేషన్లలో లభించే వెదురును పూర్తిగా ఉపయోగించుకుంటే ఇది రైతులకు ఆదాయాన్ని పెంచుతుంది అని ఝా చెప్పారు. -
హరిత హననం
వేములవాడ : రాష్ట్రాన్ని హరితవనంగా మార్చుదాం.. పచ్చదనంతోనే మానవ మనుగడ.. మొక్కలు సంరక్షిద్దాం.. కాలుష్యాన్ని నివారిద్దామన్న ప్రభుత్వ ప్రచారం ఓ వైపు.. అభివృద్ధి పనులు, జాతర ఏర్పాట్ల కోసం పచ్చని చెట్లను నరికేస్తున్న తీరు మరోవైపు.. హరితహారంలో భాగంగా ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటే, అధికారులు ఇలా చెట్లు నరికివేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే హరిత తెలంగాణ ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. వేములవాడ పట్టణంలో మహాశివరాత్రి జాతర ఏర్పాట్లలో భాగంగా సెస్ అధికారులు చెట్లు నరికేస్తున్నారు. ఏళ్ల తరబడి కంటికిరెప్పలా కాపాడుకున్న చెట్లను కొట్టేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హరితహారంలో భాగంగా పట్టణంలో లక్షన్నర మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకున్నారు. దీనికోసం వీధుల్లో రోడ్లకిరువైపులా మొక్కలు నాటారు. హరితహారంలో నాటిన మొక్కలను ఆయా ప్రాంతాల్లోని ప్రజలు సంరక్షిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మొక్కలను పట్టించుకునే వారు లేక ఎండిపోయాయి. రెండేళ్ల క్రితం నాటిన మొక్కలు ఇప్పుడు ఏపుగా పెరిగి, పచ్చగా కళకళలాడుతున్నాయి. కానీ వాటిని సెస్ అధికారులు కరెంట్ సరఫరాకు అటంకం కల్గిస్తున్నాయని నరికేస్తున్నారు. శనివారం పట్టణంలోని సినారె కళామందిరం, సెస్ ఆఫీస్‌రోడ్డు, చెక్కపల్లిరోడ్డు, తెలంగాణచౌక్ తదితర ప్రాంతాల్లోని దాదాపు ఇరవైకి పైగా చెట్లను పూర్తిగా నరికివేసేశారు. దీంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నరికి వేయడానికి అయితే హరితహారం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. కరెంట్ తీగలకు అడ్డుగా వచ్చిన కొమ్మలను కొట్టేయాలని, మొత్తం చెట్లను నరికేయడం సరికాదని స్థానికులు పేర్కొంటున్నారు. రెండేళ్లు సంరక్షించా.. సినారె కళామందిరం ముందున్న చెట్లను రెండేళ్లుగా సంరక్షిస్తున్నా. శనివారం మా దుకాణం ఎదుట ఉన్నా చెట్లను నరికి వేశారు. పచ్చని చెట్లు పోయి, మొండెం మిగిలింది. – దేవయ్య, వేములవాడ అధికారులు స్పందించాలి నాటిన మొక్కలను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నాం. ఏదో కొంపలు అంటుకుని పోతున్నట్లు ఏపుగా పెరిగిన చెట్లను కొట్టేశారు. నరికేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. – రామారావు, వేములవాడ -
నేరాల అదుపునకు సీసీ కెమెరాలు దోహదం
డీఐజీ ప్రభాకర్‌రావు పాలకుర్తి టౌన్ : నేరాల అదుపులో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని వరంగల్ రేంజ్ డీఐజీ టి.ప్రభాకర్‌రావు అన్నా రు. శుక్రవారం పాలకుర్తి పోలీస్ స్టేషన్ ఆవరణలో హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటారు. చౌరస్తాలో ఏర్పా టు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ.. వ్యాపార వర్గాలు రూ.1.50 లక్షలు విరాళాలు సేకరించి 8 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంఅభినందనీయమన్నారు. ప్ర«ధాన కూడళ్లలో సీసీ కెమెరాలు నిరంతరం నిఘా ఉండటంతో ఎలాంటి సంఘటన జరిగినా వెంటనే పోలీసులకు తెలుస్తుందన్నారు. డీఎస్పీ పద్మనాభ రెడ్డి మాట్లాడుతూ జనగామ సబ్ డివిజన్ పరిధిలో దేవరుప్పుల, కొడకండ్ల మండలాలతో పాటు జనగామ పట్టణంలో సీసీ కెమెరాలు దాతల సహకారంతో ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. డివిజ న్లో అన్నిగ్రామాల్లో హరితహారం కార్యక్రమంలో పోలీసులు చురుగ్గా పాల్గొని మొక్కలు నాటుతున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీ పీ భూక్య దల్జీత్‌కౌర్, వైస్ ఎం పీపీ గూడ దామోదర్, సీఐ తిరుపతి, ఎస్ఐలు నీలోజు వెంకటేశ్వర్లు,సత్యనారాయణ, రంజిత్, వ్యాపార వర్గాల ప్రతినిధి బోనగిరి కృష్ణమూర్తి, టీఆర్ఎస్ నాయకులుపసునూరి నవీన్, కమ్మగాని రమేశ్, తమ్మి రాంబాబు, బండి కిరణ్ పాల్గొన్నారు. -
హరితహారంలో మన జిల్లానే ముందు
జెడ్పీ సీఈఓ నగేష్ ఎర్రుపాలెం: హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటడంలో రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా ముందున్నదని జెడ్పీ సీఈఓ ఎం.నగేష్ అన్నారు. ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్లో వైరా డీఎస్పీ బి.రాంరెడ్డితో కలిసి గురువారం మొక్కలు నాటారు. పోలీస్ స్టేషన్‌కు చెందిన ఐదెకరాల భూమిలో 5000 మొక్కలు నాటించిన వైరా డీఎస్పీ రాంరెడ్డి, మధిర సీఐ నూనె వెంకటేశ్వర్లు, ఎస్ఐ ఎన్.గౌతమ్‌ను అభినందించారు. ఆయన మాట్లాడుతూ.. వైరా సబ్ డివిజన్ పోలీసులను జిల్లాలోని అన్ని శాఖల అధికారులు ఆదర్శంగా తీసుకుని హరితహారం కార్యక్రమాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లాలని కోరారు. వైరా డీఎస్పీ రాంరెడ్డి నేతత్వంలో మిషన్ కాకతీయ పథకంలో పోలీసులు పాల్గొన్నారని, సబ్ డివిజన్ పరిధిలో 2.72 లక్షల మొక్కలు నాటారని ప్రశంసించారు. జిల్లాలో ఇప్పటివరకు అన్ని శాఖల సమన్వయంతో 3.60 కోట్ల మొక్కలు నాటినట్టు చెప్పారు. వీటిని సంరక్షణ అందరి బాధ్యతని అన్నారు. కార్యక్రమంలో ట్రైనీ ఎస్ఐ ఆంజనేయులు, ఏఎస్ఐ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. -
హరితహారం నిరంతర ప్రక్రియ
230 కోట్ల మొక్కలు నాటడానికి ప్రణాళికలు సిద్ధం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఖానాపురం : తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన హరితహారం కార్యక్రమం నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని, వచ్చే ఐదేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేశారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం ధర్మరావుపేటలో రెవెన్యూ, తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పూల్‌సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో చేపట్టిన మూడు ఎకరాల్లో 4,600 మొక్కలు నాటే కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం గురువారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరువును నివారించడానికి వనాలను పెంచే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అడవులు ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు కురుస్తున్నాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో అడవులు తగ్గుతున్నాయని గ్రహించిన సీఎం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధిని కేసీఆర్ చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు చెన్నయ్య, రవి, గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అ«ధ్యక్షుడు జగన్మోహన్రావు, ఆర్జేడీ బాలయ్య, ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, డీఎఫ్ఓ కిష్టాగౌడ్ టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హరిత తెలంగాణ కు సాయమందించండి
ఎమ్మెల్యే మదన్‌లాల్ పల్లిపాడు (కొణిజర్ల): ముఖ్యమంత్రి కేసీఆర్ కలలు గన్న హరిత తెలంగాణ సాధించడానికి ప్రతి ఒక్కరి సాయం అవసమని ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్ అన్నారు. పల్లిపాడులో ఫ్రెండ్స్‌యూత్ , జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సీపీఎస్ వారి సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారు 600 మొక్కలు నాటారు. కార్యక్రమంలో తహసీల్దార్ జి.శ్రీలత, ఎంపీడీఓ శ్రీనివాసరావు,ఎంపీపీ వడ్లమూడి ఉమారాణి, జెడ్పీటీసీ తేజావత్ సోమ్లా, సర్పంచ్ ధనేకుల లలిత, ఎంఈఓ యం,శ్యాంసన్, ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షుడు తాటిపల్లి సుధీర్, ప్రధానోపాధ్యాయులు శివనారాయణ, రమణ, టీఆర్ఎస్ నాయకులు మచ్చా వెంకటేశ్వరరావు, మండేపూడి సత్యనారాయణ, ఓర్సుప్రకాశ్, పాసంగులపాటి శివకుమార్, నాయుడు వెంకన్న, చల్లగుండ్ల నాగేశ్వరరావు, బాణోత్ నాగేశ్వరరావు, పాముల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.