గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయ జీఎంఆర్ ఎరీనాలో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్, జీఎంఆర్, సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది
సాక్షి, శంషాబాద్: హరితహారం కార్యక్రమాన్ని కూడా సామాజిక బాధ్యతగా పరిగణించి మొక్కలను విస్తృతంగా నాటి పెంచాల్సిన అవసరముందని ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్ అన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో సీఐఎస్‌ఎఫ్, జీఎంఆర్ ఆధ్వర్యంలో ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో భాగంగా ఏర్పాటు చేసిన ‘తెలంగాణకు హరితహారం’కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. మొక్కల పెంపకాన్ని అన్ని రంగాలు బాధ్యతగా, సవాలుగా స్వీకరించి హరిత తెలంగాణకు బాటలు వేయాలని సూచించారు.
శంషాబాద్ విమానాశ్రయంలో పచ్చదనానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారని, ఇక్కడ ఉన్న పచ్చదనం దేశంలోని ఏ ఇతర విమానాశ్రయంలో లేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా వేపతో పాటు వివిధ రకాల ఔషధ గుణాలున్న 600 మొక్కలను నాటారు. ఇంత పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినందుకు గ్రీన్ ఇండియా చాలెంజ్ సంస్థ తరఫున జీఎంఆర్, సీఐఎస్‌ఎఫ్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో జీహెచ్‌ఐఏఎల్ సీఈఓ ప్రదీప్ ఫణికర్, ఎయిర్‌పోర్ట్ ముఖ్య భద్రతాధికారి ఎంకే సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment