బ్యాంక్ హావాలా నిందితుడు అరెస్టు
బ్యాంక్ హావాలా నిందితుడు అరెస్టు
Published Wed, Nov 2 2016 11:43 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
రూ.12.5 లక్షల నగదు స్వాధీనం
ప్రత్తిపాడు : బ్యాంక్ హవాలా కేసులో బ్యాంకు ప్యూన్ ను అరెస్టు చేసి, నిందితుని వద్ద నుంచి రూ.12.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. పెద్దాపురం డీఎస్పీ ఎస్ రాజశేఖర రావు స్థానిక పోలీస్ స్టేషన్ లో నిందితుడిని విలేకరుల ముందు హాజరుపర్చారు. ప్రత్తిపాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ శాఖలో ప్యూన్ చేతివాటం ప్రదర్శించి రూ.3.05 కోట్లు బినామీ ఖాతాలకు మళ్లించిన సంగతి తెలిసిందే. ఈ కేసు వివరాలను డీఎస్పీ రాజశేఖరరావు బుధవారం ప్రత్తిపాడు సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రాజమండ్రికి చెందిన యడ్ల ఉషా సూర్య వెంకట రాకేష్ (చిన్నా) ప్రత్తిపాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ శాఖలో మూడేళ్ల నుంచి ప్యూన్ గా పనిచేస్తున్నాడు. సింగపూర్, దుబాయ్‌లో జల్సా జీవితం గడిపేందుకు అవసరమయ్యే డబ్బును గడించేందుకు బ్యాంక్‌నే ఎన్నుకున్నాడు. బ్యాంక్ సిబ్బంది ఐడీ, పాస్‌వర్డులు దొంగచాటుగా తెలుసుకుని, నకిలీ ఓచర్స్ సృష్టించి, ప్రభుత్వ సొమ్మును దారి మళ్లించాలని పథకం వేశాడు. ఈ మేరకు రూ.3.05 కోట్లను వివిధ బ్యాంకుల్లో 29 ఖాతాలకు ఎస్‌జీటీ సిస్టమ్ నుంచి బదిలీ చేశాడు. సదరు ఖాతాదారులకు ఫో¯ŒS చేసి, నేను బ్యాంక్ ఆఫీసర్‌ను మాట్లాడుతున్నాను, పొరపాటున మీ ఖాతాలోకి సొమ్ము జమైందని చెప్పి, వారితో నగదు డ్రా చేయించి, తీసుకునేవాడు. బ్యాంక్ వారికి అనుమానుం రాకుండా ఉండేందుకు రూ.40 లక్షలు జమ చేశాడు. బ్యాంక్ ఆడిట్ సమయంలో హవాలా వెలుగులోకి వచ్చింది. దీంతో ప్యూన్ చిన్నా పరారయ్యాడు. వివిధ బ్యాంక్‌ల్లో బినామీ ఖాతాలకు బదిలీ అయిన సొమ్ము రూ.1.38 కోట్లు రికవరీ చేశారు. ముద్దాయి ఇంట్లో దాచి ఉంచిన రూ.కోటి నాలుగు లక్షల 50 వేలను కుటుంబ సభ్యులు బ్యాంక్‌కు అందజేశారు. పరారైన చిన్నా రూ.13 లక్షలతో విజయవాడ, గుంటూరు, తాడేపల్లిగూడెం, ఏలూరు తిరిగి లారీలో ఒరిస్సా వెళ్లే క్రమంలో పోలీసులకు చిక్కాడు. మంగళవారం సాయంత్రం కత్తిపూడి ఆర్టీఓ కార్యాలయం వద్ద లారీ దిగి విశాఖ వైపు వెళ్లే బస్సు కోసం వేచి ఉండగా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని నుంచి రూ.12.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా రూ.10,18,710 రికవరీ చేయాల్సి ఉందన్నారు. కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ రాజశేఖరరావు చెప్పారు. కేసును సీఐడీకి బదలాయించాలని కోరుతూ జిల్లా ఎస్పీకి నివేదించినట్టు ప్రత్తిపాడు సీఐ జి.సత్యనారాయణ తెలిపారు. ఎస్‌సై ఎం.నాగదుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement