
11 గిన్నిస్ రికార్డుల వీరుడు
పంజగుట్ట: గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించడమంటే మాటలు కాదు.. కఠోర శ్రమ చేస్తే కానీ సాధ్యం కాదు. అలాంటిది ఏకంగా 11 గిన్నిస్ రికార్డులు సృష్టించడమంటే ఎందరికో సాధ్యం కాదు. తైక్వాండోలో ఆయన రికార్డులను బద్దలు కొట్టాలంటే ఇక అసాధ్యం అనేలా చేశారు నగరానికి చెందిన జేఆర్ ఇంటర్‌నేషనల్ తైక్వాండో అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు జయంత్‌రెడ్డి. అతను అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించారు. ఇతడి వద్ద ఇప్పటివరకు దాదాపు ఐదు లక్షల మంది శిక్షణ పొందారు. ఆయన శిషు్యలు కూడా ఎన్నో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు.
ఇతని శిషు్యడు కొండా సహదేవ్ ఇప్పటికే పలు గిన్నిస్ రికార్డులు సాధించాడు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన శిషు్యలు జయంత్‌రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏషియన్ గేమ్స్, ఒలంపిక్స్‌లో బంగారు పతకం సాధించాలన్నదే తన లక్ష్యమన్నారు. ఇటీవలే 55 సంవత్సరాల వయస్సులో ఎడమ చేతితో ఒక్క నిమిషంలో 352 పంచ్‌లు కొట్టి గిన్నిస్ రికార్డు అందుకున్నట్లు తెలిపారు. త్వరలోనే తైక్వాండో ఫెడరేషన్ స్థాపించి వచ్చే ఒలంపిక్స్‌లో తైక్వాండో 8 కేటగిరీల్లో అన్నింటిలోనూ పతకాలు సాధించేలా కృషి చేస్తానని వెల్లడించారు.