బెలుంగుహలు–కొలిమిగుండ్ల ప్రధాన రహదారిలో మంగళవారం రాత్రి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది.
తప్పిన పెను ప్రమాదం
May 10 2017 12:14 AM | Updated on Sep 5 2017 10:46 AM
- పొలంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
- 23 మంది ప్రయాణికులు క్షేమం
కొలిమిగుండ్ల: బెలుంగుహలు–కొలిమిగుండ్ల ప్రధాన రహదారిలో మంగళవారం రాత్రి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. బెలుంకు చెందిన తోక శాంతయ్య బైక్‌పై కొలిమిగుండ్లకు బయలు దేరాడు. బైక్‌పై ముందర పెట్టుకున్న ఎండుమిరప కాయలు బకెట్ మూత గాలికి ఎగిరి కింద పడటంతో బైక్‌ను అకస్మాత్తుగా పక్కకు తిప్పాడు. అదే సమయంలో బనగానపల్లెకు చెందిన ఆర్టీసీ బస్సు తాడిపత్రి నుంచి బనగానపల్లెకు వస్తుండగా బైకిస్ట్‌ను కాపాడే ప్రయత్నంలో బస్సు డ్రైవర్ బాలయ్య చాకచక్యంగా వ్యవహరించి బస్సును పక్కకు తిప్పడంతో రోడ్డు పక్కనున్న పొలంలోకి దూసుకెళ్లింది. మధ్యలో పెద్ద బండరాయి అడ్డు పడటంతో బస్సు బోల్తా పడకుండ నిలిచిపోయింది. దీంతో బస్సులో ఉన్న 23 మంది ప్రయాణికులు సురక్షితంగా బయట పడటంతో ఊపిరి పీల్చుకున్నారు. శాంతయ్య రోడ్డుపై కింద పడటంతో కాలికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ప్రయాణికులను కాపాడేందుకు డ్రైవర్ తీసుకున్న నిర్ణయంతో స్థానికులు అభినందించారు. విషయం తెలుసుకున్న కానిస్టేబుళ్లు సుధాకర్, రఫీ ప్రమాద స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు.
Advertisement
Advertisement