తుంగ.. బెంగ
- కర్ణాటకలో తీవ్ర వర్షాభావం
- తుంగభద్ర జలాశయంలోకి చేరని నీరు
- డెడ్ స్టోరేజీకి పడిపోయిన నీటిమట్టం
అనంతపురం సెంట్రల్ : జిల్లాకు ప్రధాన నీటి వనరు అయిన తుంగభద్ర జలాశయం వెలవెలబోతోంది. వర్షాకాలం ప్రారంభమైనా కర్ణాటకలో ఆశించిన స్థాయిలో వానలు కురవలేదు. దీంతో జలాశయానికి నీరు చేరడం లేదు. ప్రస్తుతం నీటిమట్టం డెడ్‌స్టోరేజీకి చేరుకుంది. ఈ నెలలో మంచి వర్షాలు రాకపోతే పూర్తిగా ఎండిపోయే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో అనంతకు తుంగభద్రజలాలు ఎప్పుడొస్తాయన్నది దైవాధీనంగా మారింది.
కరువు జిల్లా ‘అనంత’లో కాస్తోకూస్తో పంటలు పండుతున్నాయంటే అది తుంగభద్ర జలాశయం పుణ్యమే. ఈ జలాశయంలోకి 140 టీఎంసీల నీరు వస్తే హెచ్చెల్సీ వాటాగా మనకు 32 టీఎంసీలు వదలాల్సి ఉంటుంది. అయితే.. వర్షాభావం, పూడిక తదితర కారణాలతో ప్రతియేటా సగటున 20 టీఎంసీలు మాత్రమే నీళ్లు వస్తున్నాయి. ఈ నీటితో అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వేలాది ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. రెండేళ్లుగా చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు రాకపోవడంతో జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గతేడాది పరిస్థితి మరీ ఘోరం. తుంగభద్ర ఎగువకాలువ (హెచ్చెల్సీ) ద్వారా ఏటా లక్ష ఎకరాల వరకు సాగునీరు అందించేవారు. గత ఏడాది నీటి లభ్యత తక్కువగా ఉండటంతో 40 వేల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయి. అది కూడా తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ (హెచ్‌ఎల్‌ఎంసీ), గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ (జీబీసీ) పరిధిలో మాత్రమే పంటలు వేశారు. వీటికి కూడా కీలక సమయంలో నీరివ్వలేకపోయారు. సమృద్ధిగా నీళ్లు రాకపోవడం, ప్రణాళిక లేకుండా కేటాయింపులు చేయడమే ఇందుకు ప్రధాన కారణం. మిగతా కాలువల కింద ఎకరాకు కూడా నీరివ్వలేదు.
డ్యాంలో డెడ్‌స్టోరేజీ
తుంగభద్ర జలాశయం ఎన్నడూ లేని విధంగా ఈసారి డెడ్‌స్టోరేజీకి చేరుకుంది. ప్రస్తుతం జలాశయంలో 0.963 టీఎంసీలు మాత్రమే నీరు నిల్వ ఉంది. సాధారణంగా మే నెల నుంచే కర్ణాటకలో వర్షాలు ప్రారంభమవుతాయి. కానీ రెండు, మూడేళ్లుగా మే, జూన్, జూలై మాసాల్లో జలాశయంలోకి పెద్దగా నీరు రావడం లేదు. ఆ తర్వాత వస్తుండటంతో దీని ప్రభావం ‘అనంత’ రైతులపై పడుతోంది. డ్యాం నుంచి సకాలంలో నీళ్లు విడుదల చేయకపోవడం, అదను తప్పించి పంటలు సాగు చేస్తుండడం వల్ల నష్టాలను మూటగట్టుకుంటున్నారు.
గడిచిన మూడేళ్లలో నెల వారీగా టీబీడ్యాంలోకి వచ్చిన నీరు (టీఎంసీలలో)..
సంవత్సరం మే జూన్ జూలై ఆగష్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మొత్తం
2014–15 4.184 6.252 82.666 178.455 54.416 32.327 6.793 365.093
2015–16 0.000 21.957 42.749 31.549 14.689 10.207 1.8900 123.041
2016–17 0.000 3.282 43.432 32.487 7.310 0.000 1.044 87.555
గడిచిన ఐదేళ్లలో హెచ్చెల్సీకి వచ్చిన నీళ్లు
సంవత్సరం వచ్చిన నీళ్లు (టీఎంసీలలో)
2012–13 19.247
2013–14 26.455
2014–15 22.520
2015–16 16.997
2016–17 10.327
జూలై నుంచే జలాశయంలోకి నీళ్లు
తుంగభద్ర జలాశయంలోకి ఏటా జూలైలోనే ఇన్‌ఫ్లో వస్తోంది. గత కొన్నేళ్లుగా మే, జూన్‌లో ఆశించినస్థాయిలో నీరు చేరడం లేదు. గతేడాది కూడా జూలైలో 42 టీఎంసీలకు పైగా నీళ్లు వచ్చాయి. ప్రస్తుతం జలాశయంలోకి 182 క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు చెబుతున్నా.. అది దేనికీ చాలదు.
- టీవీ శేషగిరిరావు, ఎస్‌ఈ, హెచ్చెల్సీ