జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు
జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు
Published Sun, Jul 24 2016 1:26 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
సాక్షి, నెట్‌వర్క్: జిల్లాలో శనివారం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. వరి విత్తనాలు వేసిన తర్వాత సరైన వర్షం పడక ఆకుమడులకు, నారుమడుల దుక్కులకు నీరులేక రైతులు అల్లాడుతున్న సమయంలో ఈ వర్షం మేలుచేస్తోందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెరుకు మొక్కతోటలకు కూడా ఈ వర్షం ఉపయోగపడింది. అత్యధికంగా చోడవరంలో 9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రోలుగుంట మండలంలోని కొవ్వూరు, బోగాపురం, కంచుగుమల, అడ్డసరం, కండపాలెం తదితర గ్రామాల్లో వర్షం కురిసింది. బుచ్చెయ్యపేట మండలంలో కుండపోతగా వర్షం కురిసింది. జన జీవనం స్తంభించింది. ఇక్కడ 30 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మేజర్ పంచాయతీ వడ్డాది నాలులు రోడ్ల జంక్షన్‌లో వరద నీటితో నిండిపోయి చెరువును తలపించింది. మాడుగుల నియోజకవర్గ పరిధిలో మాడుగుల, దేవరాపల్లి, చీడికాడ, కె.కోటపాడుతో పాటు అనకాపల్లి మండలాల్లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. తాచేరు, పెద్దేరు, జలాశయాల్లో నీరు చేరింది.
మన్యంలో భారీ వర్షం
విశాఖ మన్యంలో శనివారం భారీ వర్షం కురిసింది. పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకే వీధి, సీలేరులో భారీ వర్ష ం కురిసింది. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏకధాటిగా భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. జి.మాడుగుల మండలంలో వంతాల, పెదలోచలి, సొలభం, గడుతూరు, లువ్వాసింగి, కోరాపల్లి పంచాయతీల్లో భారీ వర్షం కురిసింది. వరి నాట్లు వేసి పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. వేరుశనగ, రాగుల, ఇతర పంటలకు నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చింతపల్లి మండలంలో లోతుగెడ్డ జంక్షన్, తాజంగి, లంబసింగి, లోతుగెడ్డ, అన్నవరం ప్రాంతాలో భారీ వర్షం కురిసింది. హుకుంపేటలో కురిసిన వర్షానికి వారపుసంతకు ఆటంకం ఏర్పడింది. పెదబయలు మండలంలో కురిసిన భారీ వర్షానికి వరి నాట్లు, నారుమడులు కొట్టుకుపోయాయి. సీతగుంట పంచాయతీలో ముసిడిపుట్టు, కిత్తుకొండ, సీకరి, అరడకోట పంచాయతీలోని పన్నెడ, లకేయిపుట్టు, పులుసుమామిడి గ్రామాల్లో వరినాట్లపై నుంచి వరదనీరు పారడంతో ఇసుక మేట వేసింది. పన్నెడ గ్రామ సమీపంలో ప్రధాన ఆర్‌అండ్‌బీ రోడ్డుపై నుంచి వరదనీరు పారడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మత్స్యగెడ్డ, రెయ్యలగెడ్డ పొంగి ప్రవహిస్తున్నాయి.
Advertisement
Advertisement