♦ వైఎస్సార్ సీపీ శ్రే ణులకు ఘన స్వాగతం పలుకుతున్న ప్రజలు
♦ స్థానిక సమస్యలు నేతల దృష్టికి..
♦ అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లాలో చేపట్టిన గడప గడపకు వైఎస్సార్‌సీపీ కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తోంది. పార్టీ నేతలు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తమ ముంగిటకు వచ్చిన నాయకులకు స్థానికులు ఘనస్వాగతం పలుకుతున్నారు. ప్రజా సమస్యలను నేతల దృష్టికి తెచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని నేతలు హామీ ఇస్తున్నారు. ఆరో రోజు కార్యక్రమంలో భాగంగా బుధవారం ఒంగోలులో నగరంలోని 2వ డివిజన్ పరిధిలోని చిన్నమల్లేశ్వరకాలనీ, కేశవరాజుకుంట ప్రాంతాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గడప గడపకు వైఎస్సార్‌సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన పర్యటనలో మహిళలతో పాటు స్థానిక ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. చీరాల నియోజకవర్గంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త యడం బాలాజీ వేటపాలెం మండలం దేశాయిపేటలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా బ్యాలెట్లు పంపిణీ చేశారు.
కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్‌యాదవ్ పీసీపల్లి మండలం చౌటగోగులపల్లిలో, పర్చూరు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త గొట్టిపాటి భరత్ కారంచేడు మండలం ఆదిపూడిలో, కొండపి నియోజకవర్గంలో నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు మర్రిపూడి మండలం ధర్మవరం గ్రామంలో గడప గడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమం నిర్వహించారు. సంతమాగులూరు మండలం కొప్పరం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త బాచిన చెంచు గరటయ్య, మండల కేంద్రం అర్థవీడులో నిర్వహించిన కార్యక్రమంలో గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త ఐ.వి.రెడ్డి పాల్గొన్నారు.