భారీగా ఉద్యోగావకాలు | Heavyly Job Hirings In YSR District | Sakshi
Sakshi News home page

భారీగా ఉద్యోగావకాలు

Published Sat, Feb 25 2017 10:14 PM | Last Updated on Tue, Sep 5 2017 4:35 AM

భారీగా ఉద్యోగావకాలు

భారీగా ఉద్యోగావకాలు

- నందలూరు మండలవాసులకు ప్రాధాన్యం
- ఐఎస్‌ఐ వాటర్‌ప్లాంట్‌ ల్యాబ్‌ ఏర్పాటు
- 60శాతం ఉద్యోగ అవకాశాలు మండలవాసులకే
- సాక్షితో ఫార్చ్యూన్‌ కంపెనీ డైరెక్టర్‌ వెంకటక్రిష్ణ

నందలూరు: నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే తమ ధ్యేయమని ఫార్చ్యూన్‌ కంపెనీ డైరెక్టర్‌ వెంకటక్రిష్ణ (సోలార్‌ వెంకట్‌) పేర్కొన్నారు. శనివారం సాక్షితో ఆయన మాట్లాడుతూ రూ.257కోట్లు వ్యయంతో ఫార్చ్యూన్‌ గ్రూప్‌సంస్థ ఆధ్వర్యంలో నందలూరు సమీపంలోని ఆల్విన్‌లో 12 పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వాటిలో నందలూరు మండలంలోని నిరుద్యోగులకు 60 శాతం ప్రాధాన్యత ఇస్తామని మిగతా 40శాతం రాజంపేట, కడప తదితర ప్రాంతాలవారికి కేటాయిస్తామని పేర్కొన్నారు. అప్పట్లో ఆల్విన్‌ పరిశ్రమ స్థాపనకోసం భూములు ఇచ్చినవారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఇప్పటికే 20రోజుల నుంచి ఫార్చ్యూన్‌ కంపెనీ ఆధ్వర్యంలో పనులు ప్రారంభమయ్యాయని, ఇంకొక వారంలో పనులు పూర్తవుతాయని అన్నారు.
అర్హత కల్గినవారికే ఉద్యోగావకాశాలు
కులమతాల భేదం లేకుండా, ఎవరి సిఫార్సులకు తలొగ్గకుండా అర్హత కల్గినవారికే ఉద్యోగావకాశాలు ఉంటాయని ఆయన అన్నారు. ఇప్పటికే మధ్యవర్తులు చాలామంది తాము ఉద్యోగాలు ఇప్పిస్తామని మండలంలో తిరుగుతున్నారని, అలాగే నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని, అలాంటి మధ్యవర్తులను నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దు అని పేర్కొన్నారు. అలా ఎవరైనా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెబితే ఈ విషయాన్ని తమదృష్టికి తీసుకువస్తే అలాంటి వారిపై కఠినచర్యలు తీసుకుంటామని, ఉద్యోగ నియామకాల్లో తుదినిర్ణయం కంపెనీదేనని ఆయన తెలిపారు.
ఐఎస్‌ఐ వాటర్‌ప్లాంట్‌ ల్యాబ్‌ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్‌ ఐఎస్‌ఐ మినరల్‌ వాటర్‌ప్లాంట్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఆరు జిల్లాల నుంచి మినరల్‌ వాటర్‌ ప్లాంట్స్‌ నిర్వాహకులు ఈ ల్యాబ్‌కు వచ్చి తమ నీటిని పరీక్షించుకుని అర్హత పత్రాలను తీసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఈ ల్యాబ్‌లో మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌లో వాడేటటువంటి రసాయనాలపై ఖచ్చితమైన నివేదికను ఇస్తారని తెలిపారు. మినరల్‌వాటర్‌ వల్ల ప్రజలకు ఎటువంటి హాని జరుగకుండా, ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండేందుకే ఈ ల్యాబ్‌ను ఏర్పాటుచేస్తున్నామని ఆయన తెలిపారు.
3వేలమందికి ఉద్యోగ అవకాశాలు
మొదటివిడతగా మార్చిలో 50 నుంచి 60 మందికి, రెండవవిడతగా ఏప్రిల్‌లో 150 నుంచి 160 మందికి, మూడో విడతగా ఆగస్టులో మరిన్ని ఉద్యోగ అవకాశాలు, నాల్గవవిడతగా ఆరు కంపెనీలకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆయన తెలిపారు. సుమారు ఈ ఫార్చ్యూన్‌ కంపెనీ ద్వారా 2వేల నుంచి 3వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, ఇందులో 60శాతం మండలవాసులకు ప్రాధాన్యత కల్పిస్తామని ఆయన వివరించారు.
1వ తేదీనుంచి దరఖాస్తులు ఇస్తాం
 మార్చి 1వ తేదీ నుంచి 5వ తేదీవరకు దరఖాస్తులు ఇస్తామని, నిరుద్యోగులు వాటిని నందలూరు ఫార్చ్యూన్‌ కంపెనీ కార్యాలయం నుంచే పొందవచ్చునని తెలిపారు. ఈ అప్లికేషన్‌ బయట మరెక్కడా దొరకవని ఆయన తెలిపారు.
ఉద్యోగాలకు విద్యార్హతలు
మార్చినెల 1వ తేదీనుంచి 5వ తేదీవరకు జాబ్‌మేళా నిర్వహించి, 6 నుంచి 10వ తేదీవరకు ఫైనల్‌ సెలక్షన్స్‌ నిర్వహించి 10పైన ఉద్యోగ నియామకాలు చేపడతామని ఆయన అన్నారు. వీటికి సంబంధించిన విద్యార్హతలు ఐటీఐ (ఎలక్ట్రికల్స్‌), ఎంబీఏ (మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్‌ఆర్‌) ప్రెషర్స్, అనుభవం కల్గినవారు, బీటెక్‌ (ఎలక్ట్రానిక్స్‌) విద్యార్హత కల్గినవారు తమ ఫార్చ్యూన్‌ కంపెనీద్వారా అప్లికేషన్లు పొందవచ్చునని తెలిపారు.
ఆదివారం చండీహోమం
నేడు ఆదివారం నందలూరులో నూతనంగా నిర్మించబోయే ఫార్చ్యూన్‌ కంపెనీ నందు ఉదయం 8గంటల నుంచి అరుణహోమం, సాయంకాలం 4గంటలకు చండీహోమం నిర్వహిస్తామని తెలిపారు. మండలంలోని దంపతులు ఈ హోమాల్లో పాల్గొనాలని వెంకటక్రిష్ణ కోరారు.
నిరుద్యోగుల్లో చిగురిస్తున్న ఆశలు
మండలంలో అటు లోకోషెడ్, ఇటు ఆల్విన్‌ పరిశ్రమ మూసివేయడంతో ఉద్యోగ అవకాశాలు కోల్పోయి నిరాశ నిసృహలతో ఉన్న ఎంతోమంది నిరుద్యోగులకు ఆల్విన్‌ కర్మాగారాన్ని ఫార్చ్యూన్‌ కంపెనీ కొనుగోలుచేయడంతో ఆశలు చిగురించాయి. ఈ కంపెనీలో రూ.257 కోట్లతో 12 రకాల పరిశ్రమలు పెట్టబోతుండటంతోపాటు 2వేల నుంచి 3వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామనడంతో మండలంలోని నిరుద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దానికితోడు ఫార్చ్యూన్‌ కంపెనీ డైరెక్టర్‌ వెంకటక్రిష్ణ మండలవాసులకు 60శాతం అవకాశాలు కల్పిస్తామని తెలియజేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదేవి«ధంగా పూర్వవైభవం సంతరించుకోవాలంటే మండలంలో ఈ విధంగా పారిశ్రామికవేత్తలు దృష్టిసారించి మండలాభివృద్ధికి తోడ్పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Advertisement
Advertisement