Fortune Company
-
ఆ సొమ్ము నిరుద్యోగులకు అందేనా..!
► ఫార్చ్యూన్ కంపెనీ పేరుతో నిరుద్యోగులకు శఠగోపం ► దరఖాస్తు రుసుం పేరుతో రూ.3లక్షలు వసూలు ► కటకటాల్లో నిందితుడు ► తమ సొమ్ము తిరిగి ఇవ్వాలంటున్న నిరుద్యోగులు నందలూరు: నందలూరులో ఆల్విన్ కర్మాగారం ఏర్పాటు చేయడానికి స్థల పరిశీలన జరిగినప్పుడు మండలంలోని ఎంతోమంది రైతులు తమ భూములను స్వచ్ఛందంగా ఆల్విన్ కర్మాగారం ఏర్పాటుకు ఇచ్చారు. మండల వాసులకు ఉద్యోగాలలో మొదటి ప్రాధాన్యత ఇచ్చి భూములకు నష్టపరిహారం ఇస్తామని చెప్పిన హామీ అమలుకే నోచుకోలేదు. ఆ తర్వాత కొంతకాలానికి ఆల్విన్ కర్మాగారం మూత పడింది. 14 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఫార్చ్యూన్ కంపెనీ ఏర్పాటు చేస్తామని, రూ.250 కోట్లతో 12 పరిశ్రమలు వస్తాయని వెంకటకృష్ణ అలియాస్ సోలార్ వెంకట్, అలియాస్ వెంకటసుబ్బయ్య నమ్మబలికాడు. దీనికితోడు ఒక్క రోజులోనే రూ.100 చొప్పున సుమారు 3వేల దరఖాస్తులు విక్రయించి రూ.3లక్షల వరకు సొమ్ము చేసుకున్నాడు. దీంతో అతనిపై ఐపీసీ 420, 406 కేసులు నమోదు చేసినట్లు రాజంపేట డీఎస్పీ రాజేంద్ర తెలిపారు. అయితే వెంకటకృష్ణ నుంచి రూ.2.10 లక్షల నగదు మాత్రమే రికవరీచేసి స్థానిక కోర్టులో హాజరుపరిచారు. ఆల్విన్ పరిశ్రమను కొనుగోలు చేసిన రాజేంద్ర కన్స్ట్రక్షన్ అధినేత కుమారుడు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీరేంద్రరెడ్డికి తన పరిశ్రమలో ఫార్చ్యూన్ కంపెనీ ఏర్పాటు చేయడానికి వెంకటకృష్ణ చేసిన భూమిపూజ, హోమాలు, అతను నిర్వహించిన జాబ్‌మేళా గురించి తెలియదా? అతనికి తెలియకుండానే సుమారు నెలరోజుల నుంచి అక్కడ ఇన్ని పనులు చేయడం సాధ్యమా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అసలు వెంకటకృష్ణ ఏం చేయాలనుకున్నాడో పోలీసులు సమాచారం రాబట్టాల్సి ఉంది. దరఖాస్తు రుసుం పేరుతో వెంకటకృష్ణ తీసుకున్న నగదును తమకు ఎవరు చెల్లిస్తారని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వవిప్ మేడా మల్లికార్జునరెడ్డి సొంత మండలంలో ఆయనకు తెలియకుండానే ఇంత తతంగం జరిగిందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏదిఏమైనా ఫార్చ్యూన్ కంపెనీ పేరుతో నిరుద్యోగులను బురిడీ కొట్టించిన ఘరానా మోసగాడి నిజస్వరూపాన్ని బట్టబయలు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. అలాగే నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన సొమ్మును వారికి తిరిగి అప్పగించాలని పలువురు కోరుతున్నారు. -
అంతా మోసం!
ఫార్చ్యూన్ కంపెనీ డైరెక్టర్ మాటలు ఖాళీమూటలేనా? ► అరుణహోమంలో ప్రభుత్వ విప్ మేడా..జనంలో పెరిగిన నమ్మకం ► ఒక్కరోజు దరఖాస్తులు ఇచ్చి తిరిగి కనిపించని డైరెక్టర్ ► కంపెనీ గేటుకు ‘టుడే హాలిడే’ బోర్డుతో రెచ్చిపోయిన యువత ► నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఎంతవరకు సబబు నందలూరు: నిరుద్యోగుల ఆశలు అడియాశలయ్యేలా ఉన్నాయి. ఫార్చ్యూన్ కంపెనీ ఏర్పాటుతో తమ 14 ఏళ్ల నిరీక్షణ ఫలించి తమకు ఉపాధి దొరుకుతుందని ఆశపడ్డ వారికి నిరాశే ఎదురైంది. దరఖాస్తుల దగ్గరే వ్యవహారం ఆగిపోవడంతో చివరకు తామంతా మోసపోయామని వారు రోడ్డెక్కాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే... తాను ఫార్చ్యూన్ కంపెనీ డైరెక్టర్‌నని, మండలంలో మూసివేసిన ఆల్విన్ కర్మాగార స్థానంలో తమ కంపెనీ ఆధ్వర్యంలో 12 సంస్థలు ఏర్పాటుచేస్తున్నామని వెంకటక్రిష్ణ తెలిపారు. అదేవిధంగా ఈ 12 సంస్థల్లో సుమారు 2 వేల నుంచి 3వేల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని, అందులో 60 శాతం స్థానికులకు కేటా ఇస్తున్నట్లు తెలపడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. భూమిపూజపై పలు అనుమానాలు: ఫార్చ్యూన్ కంపెనీ ఏర్పాటులో భాగంగా చేసిన భూమిపూజ ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేశారు. స్థానిక ఆల్విన్ మాజీ కార్మికుడు(భారత్‌గ్యాస్ శంకర్), ప్రముఖ పారిశ్రామికవేత్త దుర్గాప్రసాద్‌లతో కలిసి ఫార్చ్యూన్ కంపెనీ డైరెక్టర్ వెంకటక్రిష్ణ ఆయన సతీమణితో కలిసి కార్యక్రమం పూర్తిచేశారు. ఆ వార్త పలు పత్రికల్లో రావడంతో ఎటువంటి హడావుడి లేకుండా ఇంత రహస్యంగా భూమిపూజ చేయడం ఏమిటని అప్పట్లోనే నిరుద్యోగుల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. అరుణ హోమంలో మేడా.. నిరుద్యోగుల్లో నమ్మకం ఫార్చ్యూన్ కంపెనీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన అరుణహోమంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ మేడా మల్లికార్జునరెడ్డి స్వయంగా పాల్గొనడంతో ఫార్చ్యూన్ కంపెనీపైన నిరుద్యోగుల్లో ఆశలు ఒకస్థాయిలో పెరిగాయి. అంతేకాక మేడా ఫార్చ్యూన్ కంపెనీ డైరెక్టర్ వెంకటక్రిష్ణతో మాట్లాడుతూ మండలంలోని నిరుద్యోగులకు మొదటిప్రాధాన్యత ఇవ్వాలని కోరడంతో వారి ఆశలకు హద్దులేకుండా పోయింది. అందరిలో నమ్మకం పెరిగింది. జాబ్‌మేళాలో వేలమంది నిరుద్యోగులు ఫార్చ్యూన్ కంపెనీ ఆధ్వర్యంలో ఈనెల 1వ తేదీ నుంచి 5వ తేదీవరకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని తెలుపడంతో మండలం నుంచే కాక ఇతర జిల్లాల నుంచి కూడా వేలసంఖ్యలో నిరుద్యోగులు హాజరై, «ఒక్కొక్క దరఖాస్తు రూ.100ల చొప్పున తీసుకున్నారు. ఈనెల 1వతేదీ ఒక్కరోజు మాత్రమే 2,500 దరఖాస్తులతో రూ.2.50లక్షలు ఫార్చ్యూన్ కంపెనీకి ఆదాయం వచ్చింది. ఇంకా దరఖాస్తులు అందక సుమారు వేయిమంది నిరుద్యోగులు వెనుతిరిగారు. కానీ దరఖాస్తుకు ధర పెట్టినప్పుడే చాలామంది నిరుద్యోగులు అనుమానం వ్యక్తం చేశారు. నిరుత్సాహంతో వెనుతిరిగిన నిరుద్యోగులు ఈనెల 2వ తేదీ గురువారం తిరిగి రెండవరోజు నిరుద్యోగులు దరఖాస్తులకోసం వేలసంఖ్యలో రాగా ఫార్చ్యూన్ కంపెనీ డైరెక్టర్ వెంకటక్రిష్ణ అత్యవసర సమావేశం కోసం హైదరాబాద్‌కు వెళ్లారని, అక్కడ ఇన్చార్జిగా చెప్పుకుంటున్న స్థానిక వ్యక్తి (నాగేంద్ర) తెలిపారు. దరఖాస్తులు అయిపోయాయని డైరెక్టర్ వచ్చిన తర్వాతే దరఖాస్తులు ఇస్తారని తెలుపడంతో నిరుత్సాహంతో వేలసంఖ్యలో వచ్చిన నిరుద్యోగులు వెనుతిరిగారు. రోడ్డుపై బైఠాయించిన నిరుద్యోగులు ఫార్చ్యూన్ కంపెనీకి సంబంధించి డైరెక్టర్ వెంకటక్రిష్ణ, ఇక్కడ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న స్థానిక వ్యక్తి నాగేంద్ర అందుబాటులో లేకపోవడంతో ఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నందలూరు కోటేశ్వరరెడ్డి అక్కడకు చేరుకున్నారు. నిరుద్యోగులకు మోసంచేసిన ఫార్చ్యూన్ కంపెనీ డైరెక్టర్‌ను వెంటనే అరెస్టు చేయాలని నినాదాలు చేస్తూ కడప–చెన్నై జాతీయ రహదారిలో బైటాయించారు. ఈ విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న స్థానిక ఎస్ఐ ప్రతాప్‌రెడ్డి ఎన్నికల కోడ్ ఉందని నచ్చజెప్పి అక్కడి నుంచి అందరినీ పంపివేశారు. ఐకేపీఎస్ హెచ్చరిక పరిశ్రమల పేర్లతో నిరుద్యోగులతో చెలగాటం ఆడే వారు ఎవరైనా ఎంతటివారైనా సహించేది లేదని ఐకేపీఎస్ (ఐక్యపోరాట సమితి) అధ్యక్షుడు పోతురాజు మస్తానయ్య హెచ్చరించారు. వేలసంఖ్యలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఒక్కరోజు మాత్రమే దరఖాస్తులు అమ్మి రూ.2.50 లక్షలు తీసుకుని ఇంతవరకు పత్తాలేకుండా పోవడం ఏమిటని? ప్రశ్నించారు. అతను నిజంగానే ఫార్చ్యూన్ కంపెనీ డైరెక్టరా? అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అంతలోనే ఆల్విన్ కర్మాగారాన్ని గతంలో కొనుగోలు చేసిన రాజేంద్ర కన్స్ట్రక్షన్స్ అధినేత సత్యనారాయణరెడ్డి, కుమారుడు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వీరేంద్రారెడ్డి అక్కడికి రావడంతో ఆయనపై మస్తానయ్య విరుచుకుపడ్డారు. మీకు తెలియకుండా ఫారŠూచ్యన్ కంపెనీ పేరుతో ఎటువంటి లోగో లేకుండా కార్యాలయాలు పూర్తిగా ఏర్పాటుచేయకుండానే దరఖాస్తులు విక్రయిస్తుంటే మీరేమి చేస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై సత్యనారాయణరెడ్డి సమాధానమిస్తూ శుక్రవారం మధ్యాహ్నం 2–30కు స్థానిక్ ఆర్అండ్బీ బంగ్లా ఆవరణలో ప్రెస్‌మీట్ పెడతానని, అన్ని విషయాలు అక్కడ తెలుపుతానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తిరిగి అనేక పర్యాయాలు ఆయన (వీరేంద్రారెడ్డి)కు ఫోన్‌చేసినా స్పందనలేదు. దీంతో ఐకేపీయస్ అధ్యక్షుడు మస్తానయ్య మాట్లాడుతూ ఈ విషయంపై తాము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం అడేవారికి తగిన గుణపాఠం చెపుతామని ఆయన హెచ్చరించారు. స్థానికంగా పుకార్లు షికార్లు ఫార్చ్యూన్ కంపెనీ డైరెక్టర్ వెంకటక్రిష్ణ (సోలార్ వెంకట్)గా చెప్పుకుంటున్న వ్యక్తి అసలు పేరు వెంకటసుబ్బయ్య అని, అతను అనేకచోట్ల ఐపీ (బాకీలు ఎగ్గొట్టి)లు పెట్టి ఉడాయించారని, అదేవిధంగా ఆల్విన్ కర్మాగారాన్ని ఆయన కొనుగోలు చేయలేదని, కొంత స్థలాన్ని లీజుకు మాత్రమే తీసుకోవడం జరిగిందని ప్రచారం జరుగుతోంది. ప్రముఖ రాజకీయ నాయకులను చేతిలో ఉంచుకుని సుమారు రూ.250 కోట్లు పరిశ్రమల శాఖ (ఎస్ఎఫ్సీ)లో రుణంకోసం దరఖాస్తు చేసుకుని ఉన్నారని చెప్పుకుంటున్నారు. అందుకే ప్రముఖ నాయకులను తమ కంపెనీ ఏర్పాటుకు పిలిచి ఆ రుణాన్ని మంజూరు చేయించుకుని ఉడాయించేందుకు ఈ పథకం పన్నారని నందలూరులో పుకారు షికార్లు చేస్తున్నాయి. కట్టలు తెంచుకున్న ఆగ్రహం 3వ తేదీ శుక్రవారం తిరిగి నిరుద్యోగులు దరఖాస్తుల కోసం రాగా ‘‘టు డే హాలిడే’’ అనే బోర్డు దర్శనమిచ్చింది. దీంతో ఒక్కసారిగా వారిలో ఆగ్రహం కట్టలుతెంచుకుంది. బోర్డును చించివేసి గేటును నెట్టుకుంటూ ఒక్కసారిగా లోపలికి వెళ్లారు. దీంతో కంపెనీ ఇన్చార్జిగా ఉన్న స్థానిక వ్యక్తి అక్కడినుంచి మెల్లగా జారుకున్నాడు. ఫోన్ స్విచ్ఆఫ్ చేయడంతో లోపలికి వెళ్లిన నిరుద్యోగులు ఎవరిని అడగాలో..? తమ సమస్యలు ఎవరికి తెలపాలో అర్థంకాని సందిగ్ధంలో పడ్డారు. -
భారీగా ఉద్యోగావకాలు
- నందలూరు మండలవాసులకు ప్రాధాన్యం - ఐఎస్ఐ వాటర్‌ప్లాంట్ ల్యాబ్ ఏర్పాటు - 60శాతం ఉద్యోగ అవకాశాలు మండలవాసులకే - సాక్షితో ఫార్చ్యూన్ కంపెనీ డైరెక్టర్ వెంకటక్రిష్ణ నందలూరు: నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే తమ ధ్యేయమని ఫార్చ్యూన్ కంపెనీ డైరెక్టర్ వెంకటక్రిష్ణ (సోలార్ వెంకట్) పేర్కొన్నారు. శనివారం సాక్షితో ఆయన మాట్లాడుతూ రూ.257కోట్లు వ్యయంతో ఫార్చ్యూన్ గ్రూప్‌సంస్థ ఆధ్వర్యంలో నందలూరు సమీపంలోని ఆల్విన్‌లో 12 పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వాటిలో నందలూరు మండలంలోని నిరుద్యోగులకు 60 శాతం ప్రాధాన్యత ఇస్తామని మిగతా 40శాతం రాజంపేట, కడప తదితర ప్రాంతాలవారికి కేటాయిస్తామని పేర్కొన్నారు. అప్పట్లో ఆల్విన్ పరిశ్రమ స్థాపనకోసం భూములు ఇచ్చినవారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఇప్పటికే 20రోజుల నుంచి ఫార్చ్యూన్ కంపెనీ ఆధ్వర్యంలో పనులు ప్రారంభమయ్యాయని, ఇంకొక వారంలో పనులు పూర్తవుతాయని అన్నారు. అర్హత కల్గినవారికే ఉద్యోగావకాశాలు కులమతాల భేదం లేకుండా, ఎవరి సిఫార్సులకు తలొగ్గకుండా అర్హత కల్గినవారికే ఉద్యోగావకాశాలు ఉంటాయని ఆయన అన్నారు. ఇప్పటికే మధ్యవర్తులు చాలామంది తాము ఉద్యోగాలు ఇప్పిస్తామని మండలంలో తిరుగుతున్నారని, అలాగే నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని, అలాంటి మధ్యవర్తులను నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దు అని పేర్కొన్నారు. అలా ఎవరైనా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెబితే ఈ విషయాన్ని తమదృష్టికి తీసుకువస్తే అలాంటి వారిపై కఠినచర్యలు తీసుకుంటామని, ఉద్యోగ నియామకాల్లో తుదినిర్ణయం కంపెనీదేనని ఆయన తెలిపారు. ఐఎస్ఐ వాటర్‌ప్లాంట్ ల్యాబ్ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ ఐఎస్ఐ మినరల్ వాటర్‌ప్లాంట్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఆరు జిల్లాల నుంచి మినరల్ వాటర్ ప్లాంట్స్ నిర్వాహకులు ఈ ల్యాబ్‌కు వచ్చి తమ నీటిని పరీక్షించుకుని అర్హత పత్రాలను తీసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఈ ల్యాబ్‌లో మినరల్ వాటర్ ప్లాంట్‌లో వాడేటటువంటి రసాయనాలపై ఖచ్చితమైన నివేదికను ఇస్తారని తెలిపారు. మినరల్‌వాటర్ వల్ల ప్రజలకు ఎటువంటి హాని జరుగకుండా, ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండేందుకే ఈ ల్యాబ్‌ను ఏర్పాటుచేస్తున్నామని ఆయన తెలిపారు. 3వేలమందికి ఉద్యోగ అవకాశాలు మొదటివిడతగా మార్చిలో 50 నుంచి 60 మందికి, రెండవవిడతగా ఏప్రిల్‌లో 150 నుంచి 160 మందికి, మూడో విడతగా ఆగస్టులో మరిన్ని ఉద్యోగ అవకాశాలు, నాల్గవవిడతగా ఆరు కంపెనీలకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆయన తెలిపారు. సుమారు ఈ ఫార్చ్యూన్ కంపెనీ ద్వారా 2వేల నుంచి 3వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, ఇందులో 60శాతం మండలవాసులకు ప్రాధాన్యత కల్పిస్తామని ఆయన వివరించారు. 1వ తేదీనుంచి దరఖాస్తులు ఇస్తాం మార్చి 1వ తేదీ నుంచి 5వ తేదీవరకు దరఖాస్తులు ఇస్తామని, నిరుద్యోగులు వాటిని నందలూరు ఫార్చ్యూన్ కంపెనీ కార్యాలయం నుంచే పొందవచ్చునని తెలిపారు. ఈ అప్లికేషన్ బయట మరెక్కడా దొరకవని ఆయన తెలిపారు. ఉద్యోగాలకు విద్యార్హతలు మార్చినెల 1వ తేదీనుంచి 5వ తేదీవరకు జాబ్‌మేళా నిర్వహించి, 6 నుంచి 10వ తేదీవరకు ఫైనల్ సెలక్షన్స్ నిర్వహించి 10పైన ఉద్యోగ నియామకాలు చేపడతామని ఆయన అన్నారు. వీటికి సంబంధించిన విద్యార్హతలు ఐటీఐ (ఎలక్ట్రికల్స్), ఎంబీఏ (మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్ఆర్) ప్రెషర్స్, అనుభవం కల్గినవారు, బీటెక్ (ఎలక్ట్రానిక్స్) విద్యార్హత కల్గినవారు తమ ఫార్చ్యూన్ కంపెనీద్వారా అప్లికేషన్లు పొందవచ్చునని తెలిపారు. ఆదివారం చండీహోమం నేడు ఆదివారం నందలూరులో నూతనంగా నిర్మించబోయే ఫార్చ్యూన్ కంపెనీ నందు ఉదయం 8గంటల నుంచి అరుణహోమం, సాయంకాలం 4గంటలకు చండీహోమం నిర్వహిస్తామని తెలిపారు. మండలంలోని దంపతులు ఈ హోమాల్లో పాల్గొనాలని వెంకటక్రిష్ణ కోరారు. నిరుద్యోగుల్లో చిగురిస్తున్న ఆశలు మండలంలో అటు లోకోషెడ్, ఇటు ఆల్విన్ పరిశ్రమ మూసివేయడంతో ఉద్యోగ అవకాశాలు కోల్పోయి నిరాశ నిసృహలతో ఉన్న ఎంతోమంది నిరుద్యోగులకు ఆల్విన్ కర్మాగారాన్ని ఫార్చ్యూన్ కంపెనీ కొనుగోలుచేయడంతో ఆశలు చిగురించాయి. ఈ కంపెనీలో రూ.257 కోట్లతో 12 రకాల పరిశ్రమలు పెట్టబోతుండటంతోపాటు 2వేల నుంచి 3వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామనడంతో మండలంలోని నిరుద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దానికితోడు ఫార్చ్యూన్ కంపెనీ డైరెక్టర్ వెంకటక్రిష్ణ మండలవాసులకు 60శాతం అవకాశాలు కల్పిస్తామని తెలియజేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదేవి«ధంగా పూర్వవైభవం సంతరించుకోవాలంటే మండలంలో ఈ విధంగా పారిశ్రామికవేత్తలు దృష్టిసారించి మండలాభివృద్ధికి తోడ్పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు.