అంతా మోసం! | Everything is cheating in Fortune Company | Sakshi
Sakshi News home page

అంతా మోసం!

Published Sat, Mar 4 2017 11:18 AM | Last Updated on Tue, Sep 5 2017 5:12 AM

అంతా మోసం!

అంతా మోసం!

ఫార్చ్యూన్‌ కంపెనీ డైరెక్టర్‌ మాటలు ఖాళీమూటలేనా?

► అరుణహోమంలో ప్రభుత్వ విప్‌ మేడా..జనంలో పెరిగిన నమ్మకం
► ఒక్కరోజు దరఖాస్తులు ఇచ్చి తిరిగి కనిపించని డైరెక్టర్‌
►  కంపెనీ గేటుకు ‘టుడే హాలిడే’  బోర్డుతో రెచ్చిపోయిన యువత
► నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఎంతవరకు సబబు


నందలూరు:  నిరుద్యోగుల ఆశలు అడియాశలయ్యేలా ఉన్నాయి. ఫార్చ్యూన్‌  కంపెనీ ఏర్పాటుతో తమ 14 ఏళ్ల నిరీక్షణ ఫలించి తమకు ఉపాధి దొరుకుతుందని ఆశపడ్డ వారికి నిరాశే ఎదురైంది. దరఖాస్తుల దగ్గరే వ్యవహారం ఆగిపోవడంతో చివరకు తామంతా మోసపోయామని వారు రోడ్డెక్కాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే... తాను ఫార్చ్యూన్‌  కంపెనీ డైరెక్టర్‌నని, మండలంలో మూసివేసిన ఆల్విన్‌ కర్మాగార స్థానంలో తమ కంపెనీ ఆధ్వర్యంలో 12 సంస్థలు ఏర్పాటుచేస్తున్నామని వెంకటక్రిష్ణ తెలిపారు. అదేవిధంగా ఈ 12 సంస్థల్లో  సుమారు 2 వేల నుంచి 3వేల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని, అందులో 60 శాతం స్థానికులకు కేటా ఇస్తున్నట్లు తెలపడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి.


భూమిపూజపై పలు అనుమానాలు:
ఫార్చ్యూన్‌   కంపెనీ ఏర్పాటులో భాగంగా చేసిన భూమిపూజ ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేశారు. స్థానిక ఆల్విన్‌ మాజీ కార్మికుడు(భారత్‌గ్యాస్‌ శంకర్‌),  ప్రముఖ పారిశ్రామికవేత్త దుర్గాప్రసాద్‌లతో కలిసి ఫార్చ్యూన్‌ కంపెనీ డైరెక్టర్‌ వెంకటక్రిష్ణ ఆయన సతీమణితో కలిసి కార్యక్రమం పూర్తిచేశారు. ఆ వార్త పలు పత్రికల్లో రావడంతో ఎటువంటి హడావుడి లేకుండా ఇంత రహస్యంగా భూమిపూజ చేయడం ఏమిటని అప్పట్లోనే నిరుద్యోగుల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి.


అరుణ హోమంలో మేడా.. నిరుద్యోగుల్లో నమ్మకం
ఫార్చ్యూన్‌ కంపెనీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన అరుణహోమంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్‌ మేడా మల్లికార్జునరెడ్డి స్వయంగా పాల్గొనడంతో ఫార్చ్యూన్‌ కంపెనీపైన నిరుద్యోగుల్లో ఆశలు ఒకస్థాయిలో పెరిగాయి. అంతేకాక మేడా ఫార్చ్యూన్‌ కంపెనీ డైరెక్టర్‌ వెంకటక్రిష్ణతో మాట్లాడుతూ మండలంలోని నిరుద్యోగులకు మొదటిప్రాధాన్యత ఇవ్వాలని కోరడంతో వారి ఆశలకు హద్దులేకుండా పోయింది. అందరిలో నమ్మకం పెరిగింది.


జాబ్‌మేళాలో వేలమంది నిరుద్యోగులు
ఫార్చ్యూన్‌ కంపెనీ ఆధ్వర్యంలో ఈనెల 1వ తేదీ నుంచి 5వ తేదీవరకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని తెలుపడంతో మండలం నుంచే కాక ఇతర జిల్లాల నుంచి కూడా వేలసంఖ్యలో నిరుద్యోగులు హాజరై, «ఒక్కొక్క దరఖాస్తు రూ.100ల చొప్పున తీసుకున్నారు. ఈనెల 1వతేదీ ఒక్కరోజు మాత్రమే 2,500 దరఖాస్తులతో రూ.2.50లక్షలు ఫార్చ్యూన్‌ కంపెనీకి ఆదాయం  వచ్చింది. ఇంకా దరఖాస్తులు అందక సుమారు వేయిమంది నిరుద్యోగులు వెనుతిరిగారు. కానీ దరఖాస్తుకు ధర పెట్టినప్పుడే చాలామంది నిరుద్యోగులు అనుమానం వ్యక్తం చేశారు.


నిరుత్సాహంతో వెనుతిరిగిన నిరుద్యోగులు
ఈనెల 2వ తేదీ గురువారం తిరిగి రెండవరోజు నిరుద్యోగులు దరఖాస్తులకోసం వేలసంఖ్యలో రాగా ఫార్చ్యూన్‌  కంపెనీ డైరెక్టర్‌ వెంకటక్రిష్ణ అత్యవసర సమావేశం కోసం హైదరాబాద్‌కు వెళ్లారని, అక్కడ ఇన్‌చార్జిగా చెప్పుకుంటున్న స్థానిక వ్యక్తి (నాగేంద్ర) తెలిపారు. దరఖాస్తులు అయిపోయాయని డైరెక్టర్‌ వచ్చిన తర్వాతే దరఖాస్తులు ఇస్తారని తెలుపడంతో నిరుత్సాహంతో వేలసంఖ్యలో వచ్చిన నిరుద్యోగులు వెనుతిరిగారు.


రోడ్డుపై బైఠాయించిన నిరుద్యోగులు
ఫార్చ్యూన్‌ కంపెనీకి సంబంధించి డైరెక్టర్‌ వెంకటక్రిష్ణ, ఇక్కడ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న స్థానిక వ్యక్తి నాగేంద్ర అందుబాటులో లేకపోవడంతో ఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు నందలూరు కోటేశ్వరరెడ్డి అక్కడకు చేరుకున్నారు. నిరుద్యోగులకు మోసంచేసిన ఫార్చ్యూన్‌ కంపెనీ డైరెక్టర్‌ను వెంటనే అరెస్టు చేయాలని నినాదాలు చేస్తూ కడప–చెన్నై జాతీయ రహదారిలో బైటాయించారు. ఈ విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న స్థానిక ఎస్‌ఐ ప్రతాప్‌రెడ్డి ఎన్నికల కోడ్‌ ఉందని నచ్చజెప్పి అక్కడి నుంచి అందరినీ పంపివేశారు.


ఐకేపీఎస్‌ హెచ్చరిక
పరిశ్రమల పేర్లతో నిరుద్యోగులతో చెలగాటం ఆడే వారు ఎవరైనా ఎంతటివారైనా సహించేది లేదని ఐకేపీఎస్‌ (ఐక్యపోరాట సమితి) అధ్యక్షుడు పోతురాజు మస్తానయ్య హెచ్చరించారు. వేలసంఖ్యలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఒక్కరోజు మాత్రమే దరఖాస్తులు అమ్మి రూ.2.50 లక్షలు తీసుకుని ఇంతవరకు పత్తాలేకుండా పోవడం ఏమిటని? ప్రశ్నించారు. అతను నిజంగానే ఫార్చ్యూన్‌ కంపెనీ డైరెక్టరా? అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అంతలోనే ఆల్విన్‌ కర్మాగారాన్ని గతంలో కొనుగోలు చేసిన రాజేంద్ర కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత సత్యనారాయణరెడ్డి, కుమారుడు కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీరేంద్రారెడ్డి అక్కడికి రావడంతో ఆయనపై మస్తానయ్య విరుచుకుపడ్డారు. మీకు తెలియకుండా ఫారŠూచ్యన్‌ కంపెనీ పేరుతో ఎటువంటి లోగో లేకుండా కార్యాలయాలు పూర్తిగా ఏర్పాటుచేయకుండానే దరఖాస్తులు విక్రయిస్తుంటే మీరేమి చేస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై సత్యనారాయణరెడ్డి సమాధానమిస్తూ శుక్రవారం మధ్యాహ్నం 2–30కు స్థానిక్‌ ఆర్‌అండ్‌బీ బంగ్లా ఆవరణలో ప్రెస్‌మీట్‌ పెడతానని, అన్ని విషయాలు అక్కడ తెలుపుతానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తిరిగి అనేక పర్యాయాలు ఆయన (వీరేంద్రారెడ్డి)కు ఫోన్‌చేసినా స్పందనలేదు. దీంతో ఐకేపీయస్‌ అధ్యక్షుడు మస్తానయ్య మాట్లాడుతూ ఈ విషయంపై తాము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం అడేవారికి తగిన గుణపాఠం చెపుతామని ఆయన హెచ్చరించారు.


స్థానికంగా పుకార్లు షికార్లు
ఫార్చ్యూన్‌ కంపెనీ డైరెక్టర్‌ వెంకటక్రిష్ణ (సోలార్‌ వెంకట్‌)గా చెప్పుకుంటున్న వ్యక్తి అసలు పేరు వెంకటసుబ్బయ్య అని, అతను అనేకచోట్ల ఐపీ (బాకీలు ఎగ్గొట్టి)లు పెట్టి ఉడాయించారని, అదేవిధంగా ఆల్విన్‌ కర్మాగారాన్ని ఆయన కొనుగోలు చేయలేదని, కొంత స్థలాన్ని లీజుకు మాత్రమే తీసుకోవడం జరిగిందని ప్రచారం జరుగుతోంది. ప్రముఖ రాజకీయ నాయకులను చేతిలో ఉంచుకుని సుమారు రూ.250 కోట్లు పరిశ్రమల శాఖ (ఎస్‌ఎఫ్‌సీ)లో రుణంకోసం దరఖాస్తు చేసుకుని ఉన్నారని చెప్పుకుంటున్నారు. అందుకే ప్రముఖ నాయకులను తమ కంపెనీ ఏర్పాటుకు పిలిచి ఆ రుణాన్ని మంజూరు చేయించుకుని ఉడాయించేందుకు ఈ పథకం పన్నారని నందలూరులో పుకారు షికార్లు చేస్తున్నాయి.


కట్టలు తెంచుకున్న ఆగ్రహం
3వ తేదీ శుక్రవారం తిరిగి నిరుద్యోగులు దరఖాస్తుల కోసం రాగా ‘‘టు డే హాలిడే’’ అనే బోర్డు దర్శనమిచ్చింది. దీంతో ఒక్కసారిగా వారిలో ఆగ్రహం కట్టలుతెంచుకుంది. బోర్డును చించివేసి గేటును నెట్టుకుంటూ ఒక్కసారిగా లోపలికి వెళ్లారు. దీంతో కంపెనీ ఇన్‌చార్జిగా ఉన్న స్థానిక వ్యక్తి అక్కడినుంచి మెల్లగా జారుకున్నాడు. ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ చేయడంతో లోపలికి వెళ్లిన నిరుద్యోగులు ఎవరిని అడగాలో..? తమ సమస్యలు ఎవరికి తెలపాలో అర్థంకాని సందిగ్ధంలో పడ్డారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement