
మూలపాడులో భద్రత కట్టుదిట్టం
మూలపాడు (ఇబ్రహీంపట్నం) : మూలపాడు క్రికెట్ స్టేడియంలో భారత్–వెస్టిండీస్ మహిళా జట్ల మధ్య జరగనున్న వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఉదయం సీఎం చంద్రబాబు పోటీలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, బీసీసీఐ ఉపాధ్యక్షుడు, అమలాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, కలెక్టర్ బాబు.ఏ మంగళవారం విడివిడిగా ఇక్కడ ఏర్పాట్లు పరిశీలించి సమీక్షించారు. సీఎం పర్యటన నేపథ్యంలో బందోబస్తును పర్యవేక్షించారు. గ్రౌండ్‌లో అవసరమైన మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. వీరి వెంట సబ్‌కలెక్టర్ సృజన, స్టేడియం ఇన్‌చార్జి దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
ఇరుజట్ల ప్రాక్టీస్
కాగా, మంగళవారం ఇరుదేశాల జట్లు ప్రాక్టీస్ చేశాయి. ఉదయం వెస్టిండీస్ జట్టు, మధ్యాహ్నం భారత్ క్రీడాకారిణులు ప్రాక్టీస్ చేశారు. క్రికెట్ అభిమానులు కూర్చునేందుకు వీలుగా తాత్కాలిక గ్యాలరీ ఏర్పాటుచేశారు.