హైటెక్ పోలీసింగ్ | High-tech policing | Sakshi
Sakshi News home page

హైటెక్ పోలీసింగ్

Published Thu, Jun 2 2016 8:14 AM | Last Updated on Mon, Sep 4 2017 1:25 AM

High-tech policing

నేర నియంత్రణలో జపాన్ టెక్నాలజీ
పెరిగిన వాట్పప్, ఫేస్‌బుక్ ఫిర్యాదులు
కీలక సర్కిళ్లలో 200 సీసీ కెమెరాలు
అన్ని రోడ్లల్లోనూ 24 గంటలూ నిఘా
పోలీస్ యూట్యూబ్‌కు ఆదరణ
సేఫ్ సిటీ లక్ష్యానికి చేరువలో తిరుపతి

 

పవిత్ర పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోన్న తిరుపతి నగరాన్ని సురక్షిత నగరం (సేఫ్ సిటీ)గా మార్చేందుకు పోలీస్ యంత్రాంగం విస్తృతంగా కృషిచేస్తోంది. 2018 నాటికి నేర రహిత నగరంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం జపాన్   సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోంది. హైటెక్ పోలీసింగ్ వ్యవస్థను నగరంలో పటిష్ట పర్చడమే కాకుండా నగరవాసులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి నిత్యం వచ్చే వేలాదిమంది యాత్రికులకు పూర్తిస్థాయి భరోసా కల్పించేందుకు కసరత్తు చేస్తోంది. రాష్ట్ర డీజీపీ నుంచి కూడా మంచి ప్రోత్సాహం లభిస్తుండటంతో అత్యాధునిక నేర నియంత్రణ పరికరాలను దిగుమతి చేసుకోవడం, వాటి ద్వారా నిఘా వ్యవస్థను బలోపేతం చేయడం చేపట్టింది.

 

తిరుపతి: తిరుపతి నగర వాసులతో స్నేహ సంబంధాలను మెరుగుపర్చుకోవడంతో పాటు నేరాల నియంత్రణలో ప్రజల సహకారాన్ని పూర్తిస్థాయిలో పొందేందుకు అర్బన్ పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. తిరుపతి అర్బన్ పరిధిలో అలిపిరి, ఈస్ట్, వెస్ట్, ఎంఆర్ పల్లి సర్కిళ్లు ఉన్నాయి. ప్రపంచస్థాయిలో పేరున్న పుణ్యక్షేత్రమే కాకుండా యాత్రా స్థలం కావడంతో నిత్యం దేశ విదేశాల నుంచి వేలాది మంది యాత్రికులు రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో నేరగాళ్ల కదలికలు కూడా ఎక్కువే. ఎర్రచందనం స్మగ్లింగ్ నుంచి చిల్లర దొంగతనాల వరకూ అన్ని రకాల నేరాలు ఇక్కడ సుపరిచితమే. ఇటీవల కాలంలో ఎర్రచందనం కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో తిరుపతి అర్బన్ పరిధిలో పోలీస్, విజిలెన్స్, టాస్క్‌ఫోర్సు విభాగాలను ఉన్నతాధికారులు పటిష్టం చేశారు. రాకపోకలు సాగించే వీఐపీలకు బందోబస్తు కల్పించడం నుంచి ఇతరత్రా ప్రొటోకాల్ డ్యూటీలు ఎక్కువ కావడంతో శాంతిభద్రతల పరిరక్షణ అంశం ఒక సందర్భంలో అర్బన్ పోలీసులకు సవాల్‌గా మారింది. దీంతో వీరు అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని నేరాల నియంత్రణకు శ్రీకారం చుట్టారు. ఈ విధానం వల్ల కొంత మెరుగైన ఫలితాలు కనిపిస్తుండటంతో టెక్నాలజీని మరింత అప్‌డేట్ చేసుకుని అన్ని రకాల నేరాలను నియంత్రించాలని నిర్ణయం తీసుకున్నారు.


నగరంలో 200 సీసీ కెమెరాలు
అర్బన్ ఎస్పీగా గోపీనాథ్‌జెట్టి ఉన్నపుడే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. టౌన్‌క్లబ్, బాలాజీ కాలనీ, అన్నమయ్యసర్కిల్, లీలామహల్ సర్కిల్ వంటి రద్దీ ప్రదేశాల్లో అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. ఇందులో ఐపీ కెమెరాలు, పీటీ రోటేట్ కెమెరాలు కూడా ఉన్నాయి. వీటివల్ల నగరంలోని ప్రధాన  రోడ్ల గుండా రాకపోకలు సాగించే వివిధ జిల్లాల వాహనాలు, వాటిల్లోని వ్యక్తులను గుర్తించే వీలుంది. హైఫ్రీక్వెన్సీ లెన్సులు ఉన్న వీటి సాయంతో అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడమే కాకుండా వాహనాల రాకపోకలు సక్రమంగా ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ నుంచి గమనిస్తుండవచ్చు. దీంతో నిఘా వ్యవస్థ పటిష్ట పడింది. ఇవి మాత్రమే కాకుండా పోలీస్ యూట్యూబ్‌ను అందుబాటులోకి తేవడం వల్ల వీక్షకుల సంఖ్య పెరిగి క్షణాల్లో సమాచారం పోలీసులకు చేరిపోతుంది. ఇవి మాత్రమే కాకుండా ఫేస్‌బుక్, వాట్సప్ గ్రూప్‌ల వల్ల కూడా నేరాల నియంత్రణలో ఫలితాలు కనిపిస్తున్నాయి. ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర రెడ్‌లైట్ వయోలేషన్, సిగ్నల్ జంప్, ఓవర్‌స్పీడ్ వంటి కేసులు ఎదురైనపుడు వెంటనే వారిని గుర్తించడం తేలికవుతోంది. జపాన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఏర్పాటు చేసిన సేఫ్ సిటీ బృందాల పనితీరు బాగుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 
టెక్నాలజీ వాడకం వల్ల....

నేరాల నియంత్రణ కోసం పోలీసులు అమల్లోకి తెచ్చిన ఆధునిక టెక్నాలజీ వల్ల అన్ని రకాల నేరాలను తేలికగా గుర్తించడం వీలవుతోంది. 2015 జనవరి 24 నుంచి ఇప్పటివరకూ 26,779 మంది వాహనచోదకులకు ఈ-చలాన్‌లు జారీచేసి వారి నుంచి పెనాల్టీలు వసూలు చేయడం జరిగింది. అదేవిధంగా నోపార్కింగ్, ఇతరత్రా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన కేసులు 1,191 నమోదయ్యాయి. చోరీలు, దోపిడీలు వంటి నేరాలు 250, మరో 826 శాంతి భద్రతల కేసులు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో నేరాల సంఖ్యను పూర్తిగా తగ్గించడమే కాకుండా 2018 నాటికి సేఫ్ సిటీగా తిరుపతిని తీర్చిదిద్దాలన్నది పోలీసుల లక్ష్యంగా కనిపిస్తోంది.

     
ఇటీవల నగరంలో రాజు అనే వ్యక్తి పోలీసులు లేరని భావించి సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వా హనం నడుపుతూ సీసీ కెమెరాలకు చిక్కాడు. దీంతో సీసీ కెమెరాల పర్యవేక్షణాధికారి వాహనం నంబర్ సాయంతో చిరునామా గుర్తించి జరిమానా విధించారు. ఆర్‌సీ రోడ్‌లోని రైల్వే గేట్ సమీపంలో ఓ వాహనం మరమ్మతుల కారణంగా నడిరోడ్డులో నిలిచిపోయింది. దీన్ని గమనించిన నగర వాసు లు ఫోటోలు తీసి పోలీస్ వాట్సప్‌కు పంపారు. సకాలంలో ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆగిపోయిన వాహనాన్ని తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement