ఒంగోలు: ప్రకాశం జిల్లాలో పర్చూరు మండలం దేవరపల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా వివాదస్పద భూముల్లో చెరువు తవ్వుతుండటంతో దళితులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 400 మంది పోలీసుల సిబ్బంది పహారా మధ్య ప్రొక్లెయిన్లతో చెరువును తవ్వుతున్నారు.
తమపై చంద్రబాబు సర్కారు కక్ష సాధిస్తోందని దళితులు వాపోయారు. 40 మందిని పోలీసులు అరెస్ట్ చేశారని, వారిని ఎక్కడకు తీసుకెళ్లారో కూడా తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బిక్కుబిక్కు మంటూ బతుకుతున్నామని తమ గోడును ‘సాక్షి’ టీవీ ప్రతినిధితో వెళ్లబోసుకున్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
పెత్తందారులందరూ ఒక్కటై తమకు ప్రత్యామ్నాయం చూపకుండా చెరువు తవ్వుతున్నారని తెలిపారు. ఎందుకు తవ్వుతున్నారని అడిగితే పోలీసులతో అరెస్ట్ చేయిస్తున్నారని చెప్పారు. తమకు న్యాయం చేయమని అడిగితే ఉన్నతాధికారులు స్పందించలేదని వాపోయారు. తమకు ఎవరూ మాకు సాయం చేయలేదని, గత్యంతరం లేని పరిస్థితుల్లో కోర్టును ఆశ్రయించామన్నారు. మరోవైపు దేవరపల్లిలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. గ్రామంలో చెక్‌పోస్టులు పెట్టారు. మీడియా ప్రతినిధులను గ్రామంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. పర్చూరు నియోజకవర్గంలో టీవీ ప్రసారాలు కూడా నిలిపివేశారు.
దళితులంటే చంద్రబాబుకు మొదటి నుంచి చిన్నచూపేనని, వారి భూములు లాక్కోవడం సిగ్గుచేటని వైఎస్సార్ సీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జ్ గొట్టిపాటి భరత్ విమర్శించారు. దళితులను అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని మండిపడ్డారు. దేవరపల్లిలో ఆంక్షలు తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
పోలీసు పహారాలో దేవరపల్లి
Published Thu, Jul 20 2017 1:40 PM | Last Updated on Tue, Sep 5 2017 4:29 PM
Advertisement
Advertisement