పదోరోజూ కదనపథమే
కొనసాగుతున్న ముద్రగడ, కుటుంబసభ్యుల దీక్ష
మద్దతుగా జిల్లావ్యాప్తంగా ఉధృతమైన ఆందోళనలు
వారి ఆరోగ్యం కోసం పలు ఆలయూల్లో పూజలు
రాజమహేంద్రవరం : కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ఆయన కుటుంబసభ్యులు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష పదోరోజైన శనివారం కొనసాగింది. గత జనవరిలో తునిలో కాపు ఐక్యగర్జన సందర్భంగా జరిగిన పరిణామాల్లో నమోదైన కేసులు ఎత్తివేసి, అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలన్న డిమాండ్‌తో ముద్రగడ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. వారి ఆరోగ్యంపై జిల్లా అంతటా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. దీక్ష విర మింపజేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా కాపులు చేస్తున్న ఉద్యమం కొనసాగుతోంది.
శనివారం మండపేటలో మహిళలు పెద్దఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ముద్రగడ దీక్ష విరమింపచేయకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వంపై వారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, శాపనార్థాలు పెట్టారు. పలువురు కాపు నేతలు సెల్ టవర్ ఎక్కడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం నుంచి ముక్తేశ్వరం వరకూ టీబీకే సంఘం ఆధ్వర్యంలో పాదయాత్ర చేశారు.
ముక్తేశ్వరం సెంటర్లో ధర్నా చేశారు. కాపుల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నారని నేతలు మండిపడ్డారు. తమ ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ సందర్భంగా పోలీసులు వారిపై లాఠీ చార్జి జరిపి, కొందరిని అరెస్టు చేశారు. అం బాజీపేటలో టీబీకే ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. నేతలు మాట్లాడుతూ.. చంద్రబాబు ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తమ జాతిని మోసం చేశారని ధ్వజమెత్తారు. ముద్రగడకు హాని జరిగితే ఊరుకోబోమని హెచ్చరించారు.
ఎటపాక మండలం తోటపల్లి గ్రామంలో కాపులు అర్థనగ్నప్రదర్శన నిర్వహించారు. ముద్రగడకు మద్దతుగా నినాదాలు చేశారు. ఏలేశ్వరంలో కాపులు రాస్తారోకో నిర్వహించారు. ముద్రగడ ఆరోగ్యం బాగుండాల ని శివాలయంలో పూజలు చేశారు. జగ్గం పే ట మండలం రామవరంలో ఆందోళన నిర్వహించారు. కిర్లంపూడిలో చండీయాగం నిర్వహించారు. గోపాలపురానికి చెందిన కాపు నేతలు గులాబీలతో ర్యాలీ నిర్వహించారు. కొత్తపేట మండలం పలివెల ఉమా కొప్పేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.