ఏఎన్‌యూలో ఉన్నత విద్యామండలి రాష్ట్ర కార్యాలయం?
Published Tue, Jan 24 2017 11:34 PM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM
భవనాలను పరిశీలించిన చైర్మన్, వైస్ చైర్మన్
ఏఎన్‌యూ: రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఏపీ ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ఏపీ నూనత రాజధాని ప్రాంతానికి తరలించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. రాజధాని ప్రాంతంలో ఉన్న ఏఎన్‌యూలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ఉన్నత విద్యామండలి అధికారులు సుముఖంగా ఉన్నారు. దీనిలో భాగంగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఎస్.విజయరాజు, వైస్ చైర్మన్ ఆచార్య పి.నరసింహారావు మంగళవారం ఏఎన్‌యూను సందర్శించారు. కార్యాలయ ఏర్పాటు కోసం యూనివర్సిటీలోని పాత అతిథి గృహం, గతంలో వైస్ చాన్సలర్ పరిపాలన కొనసాగించిన భవనం, పాత ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగ భవనాలను పరిశీలించారు. చైర్మన్, వైస్ చైర్మన్, సెక్రటరీ తదితర అధికారుల ఛాంబర్లు, సిబ్బంది కార్యాలయాలన్నింటికీ సరిపడా విస్తీర్ణం ఉన్న భవనాలను ఎంపిక చేయనున్నారు. అనంతరం ఉన్నత విద్యామండలి అధికారులు ఏఎన్‌యూ ఉన్నతాధికారులకు తమ అభిప్రాయాన్ని తెలియజేయనున్నారు.
Advertisement