హిందీ‘బురిడీ’ పరీక్షలు
హిందీ‘బురిడీ’ పరీక్షలు
Published Mon, Sep 12 2016 4:30 PM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM
* బ్లాక్ బోర్డుపై సమాధానాలు కొరవడిన పర్యవేక్షణ
* అభాసుపాలైన దక్షిణ భారత హిందీ ప్రచార సభ పరీక్షలు
ప్రత్తిపాడు : విద్యార్థుల సామర్థ్యానికి పదును పెడుతూ పకడ్బందీగా నిర్వహించాల్సిన పరీక్షలను అభాసుపాలు చేశారు. అడిగేవారు కరువవడం, పర్యవేక్షణ కొరవడటం, పాఠాలు చెప్పిన టీచర్లే ఇన్విజిలేటర్లుగా వ్యవహరించి పరీక్షలు నిర్వహించడంతో ఇష్టారీతిన పరీక్షలు జరిగాయి. ఏకంగా బ్లాక్ బోర్డుపై సమాధానాలు రాసి మరీ పరీక్షలు రాయించారు. దక్షిణ భారత హిందీ ప్రచారసభ ఆధ్వర్యంలో ప్రత్తిపాడులో ఆదివారం జరిగిన పరీక్షల్లో ఈ పరిస్థితి కనిపించింది. పరిచయ, ప్రాథమిక, మాధ్యమిక, రాష్ట్ర, ప్రవేశిక పరీక్షల కోసం మూడు కేంద్రాలను ఏర్పాటు చేయగా 400 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఓ ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించిన హిందీ పరీక్షల్లో ఇన్విజిలేటర్లే బ్లాక్‌బోర్డుపై సమాధానాలు రాసి విద్యార్థులతో రాయించారు.
పాఠాలు చెప్పినవారే ఇన్విజిలేటర్లు..
హిందీ ప్రచార సభ ఆధ్వర్యంలో జరిగే పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పాఠాలు చెప్పిన టీచర్లే ఇన్విజిలేటర్లుగా వ్యవహరించడంతో విద్యార్థులకు శాపంగా మారింది. ఏ ప్రశ్నలు వస్తాయో, ఏమి చదవాలో, పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలో అన్న ఆలోచనే విద్యార్థులకు అవసరం లేకపోతోంది. తమకు సన్నిహితంగా ఉండే టీచర్లే పరీక్షలను నిర్వహిస్తుండటంతో వారు విద్యార్థులకు సమాధానాలు చెబుతూ చూచిరాతలను ప్రోత్సహిస్తూ తల్లిదండ్రుల నమ్మకానికి వెలకట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా సమాధానాలను బోర్డులపై రాసి పరీక్షలను రాయిస్తే నిజంగా కష్టపడి చదివే విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతుందని పలువురు వాపోతున్నారు. తద్వారా తెలివైన విద్యార్థుల సామర్థ్యాలకు పాతరేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంత దారుణంగా నిర్వహించే పరీక్షలకు హాల్‌టిక్కెట్లు, ఐడీ కార్డులు అంటూ.. ఆర్భాటం ఎందుకని మండిపడుతున్నారు. ఇప్పటికైనా దక్షిణ æభారత హిందీ ప్రచార సభ వారు పరీక్షలు సక్రమంగా నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లా మొత్తం మీద సుమారు 73 సెంటర్లలో 13 వేల మంది విద్యార్థులు హిందీ పరీక్షలు రాసినట్లు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారు తెలిపారు.
Advertisement