ఉద్యోగాల సాధనలో సత్తాచాటిన యువకుడు
Published Thu, Jul 21 2016 1:05 AM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM
కంభాళాపూర్(పెబ్బేరు): మండల పరిధిలోని కంభాళాపూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో సత్తా చాటాడు.ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా 10కి పైగా ఉన్నతస్థాయి ఉద్యోగాలకు అర్హత సాధించగా నాలుగు ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలను సొంతం చేసుకున్నాడు. వివరాలిలా.. పెబ్బేరు మండలం కంభాళాపూర్ గ్రామానికి చెందిన మేకల చిన్న జోగన్న కుమారుడు ఎం.శివ ప్రసాద్‌కు చిన్నతనం నుంచే చదువు పై శ్రద్ధ, ఆసక్తి ఉన్నాయి. దీంతో పేదరికం తన పట్టుదల ముందు చిన్నబోయింది. ఇటిక్యాల మండలం బీచుపల్లి గురుకుల పాఠశాలలో పదోతరగతి పూర్తి చేసుకున్న శివ ప్రసాద్ ఉన్నత చదువులు చదువుతూనే వివిధ పోటీ పరీక్షలకు సన్నధమయ్యాడు. తన తొలి ప్రయత్నంలోనే ఎఫ్‌సీఐ (పుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా)ఉన్నత ఉద్యోగానికి ఎంపికయ్యాడు.అనంతరం ఎల్‌ఐసీ లో, తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో ఉన్నత ఉద్యోగానికి ఎంపికై ప్రస్తుతం బ్యాంక్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఒక వైపు బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తూనే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఉద్యోగాలకు ప్రిపేరయ్యాడు. దీంతో ఇటీవల ఎస్‌ఎస్‌సీ వారు నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణుడై సెంట్రల్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్, సీబీఐ సబ్‌ఇన్‌స్పెక్టర్ వంటి ఉన్నత పోస్టులకు ఎంపికయ్యాడు.సాప్ట్‌వేర్ రంగంలో మంచి జీతం వచ్చినా ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే ప్రభుత్వానికి, ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుందన్న లక్ష్యంతో ముందుకెళ్లినట్లు శివ ప్రసాద్ సాక్షి కి తెలిపారు.ఏకాగ్రత, సరైన ప్రణాళిక, కృషి, పట్టుదల తో శ్రమిస్తే విజయం తప్పక లభిస్తుందని ఆయన అన్నారు.తన విజయం వెనుక తల్లిదండ్రుల ఆశిస్సులు, ప్రోత్సాహం, బంధుమిత్రుల సహకారం ఎంతో ఉందన్నారు.
Advertisement
Advertisement