aim
-
ఊహించని మలుపులు
పృథ్వీ కృష్ణ, శ్రీ విద్య జంటగా శ్రావణ భాస్కర్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎయిమ్’. ఎంఎన్ రావు, సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెలలో రిలీజ్ కానుంది. ‘‘ఈ చిత్ర కథలో పలు మలుపులు ఉన్నాయి. పి. గోపాల్ రెడ్డి స్వరపరచిన ఐదు పాటలు బాగుంటాయి. తల్లిదండ్రులకు.. ముఖ్యంగా యువతరానికి నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. -
అభివృద్ధి చేస్తే అద్భుతమే
► ‘అనంత సాగరం’ వద్ద ఆహ్లాదకర వాతావరణం ► ట్యాంక్‌బండ్ తరహాలో అభివృద్ధికి అవకాశాలు అనంతపురం: నగరశివారులోని ‘అనంతసాగరం’ చెరువును మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. పాలకులు చిత్తశుద్ధి చూపితే హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి చేయొచ్చని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. ‘అనంత సాగరం’ జిల్లాలోని అతిపెద్ద చెరువుల్లో ఒకటి. రాయల కాలంలో నిర్మింపబడి చారిత్రక ప్రాధాన్యతనూ సంతరించుకుంది. చెరువు కట్టపై షిరిడీ సాయిబాబాతో పాటు అనేక ఆలయాలు ఉన్నాయి. ఇవి నగరవాసులకు ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతున్నాయి. ప్రతిరోజూ సాయంత్రం ఇక్కడ భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. చుట్టుపక్కల ప్రాంతాల వారు చెరువు కట్టపై మార్నింగ్, ఈవినింగ్ వాక్కు కూడా వస్తుంటారు. నగర వాసులకు పర్యాటక అనుభూతిని, ఆహ్లాదాన్ని పంచుతున్న ‘అనంత సాగరం’ను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పలువురు అంటున్నారు. ► హంద్రీ–నీవా జలాలతో చెరువును నింపితే నగర తాగునీటి అవసరాలు శాశ్వతంగా తీరతాయి. ఆయకట్టు రైతులు పంటలు పండించుకునేందుకు అవకాశం ఉంటుంది. బోటింగ్ కూడా ఏర్పాటు చేయొచ్చు. ► చెరువు కట్టపై ఫ్లడ్‌లైట్లు, బెంచీలు ఏర్పాటు చేయడంతో పాటు పచ్చదనాన్ని పెంపొందిస్తే మరింత ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది. ► జలవనరుల శాఖ రూ.15 కోట్లతో చెరువుకట్ట నుంచి ముసలమ్మకట్ట వరకు రోడ్డు వేస్తోంది. ప్రస్తుతం ఈ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ రోడ్డు ఏర్పాటైతే తాడిపత్రి వైపు నుంచి వచ్చే వాహనాలు ముసలమ్మ కట్ట నుంచి చెరువుకట్ట మీదుగా కలెక్టరేట్ మార్గానా బెంగళూరుకు వెళ్లే అవకాశం ఉంటుంది. దీనివల్ల నగరంలో మరీ ముఖ్యంగా పాతూరులో ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. ► అధికార పార్టీకి చెందిన ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి మధ్య నగరంలో రోడ్ల విస్తరణ పేరుతో ఆధిపత్యపోరు నడుస్తోంది. ట్రాఫిక్ సమస్య పేరుతో ఆక్రమణలు తొలగించాలని ఒకరు, అవసరం లేదని మరొకరు పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో చెరువుకట్ట రోడ్డు తెరపైకి వచ్చింది. ఇది పూర్తయితే ఇప్పట్లో విస్తరణ పనులు అవసరం ఉండదని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
గురి ఉంటేనే... గురువు
‘ఆయన నాకు గురువు’ అన్న నమ్మకం మీకుంటే ఆయన గురువు. ఆయన చెప్పిన మాటలను శిరసావహించి బతుకుతున్నారనుకోండి. అప్పుడు మీలో మార్పు వస్తుంది. ఈ మార్పుకి కారణం కేవలం శిష్యుని యొక్క గురి. అంతే తప్ప గురువు గారి వైభవం కాదు. గురువు తన వైభవంతో, తన ప్రజ్ఞతో మార్చడు. శిష్యుడు తన గురితో మారతాడు. అందుకే మీ గురికి ‘గురువు’ అని పేరు. గురి లేదనుకోండి. సాయంకాలం ఏ నృత్య కార్యక్రమమో చూడ్డానికి వెళ్ళినట్లు, కచ్చేరీలో పాట వినడానికి వెళ్ళినట్లు ఆధ్యాత్మిక ప్రసంగానికి కూడా వెళ్ళి వచ్చేవాడి మనసులో మార్పు ఎందుకు వస్తుంది? వందలమంది వింటున్న ప్రవచనంలో ఎవడో ఒకడు కొన్ని మాటలు పట్టుకుంటాడు. వాడు జీవితాన్ని మార్చుకుంటాడు. అది గురి. వాడు మారినట్లు ప్రవచనకర్తకు కూడా తెలియదు, తెలియవలసిన అవసరం కూడా లేదు. ఆ గురి ఎవరిలో నుంచి బయల్దేరి ఇవతలివాడిని ప్రభావితం చేస్తుందో ఆయన గురువు అవుతాడు. ఎవరి మాటల వల్ల జీవితం మార్పు చెందుతుందో, ఆ మాటల పట్ల మనకు గురి ఉంటే వారిని మాత్రమే గురువని పిలవాలి. ‘‘మా గురువుగారు ‘ఇలా బతకరా’ అని చెప్పారు. నాకది శరణ్యం. అంతకన్నా నా జీవితానికి ఉద్ధారకం లేదు’’ అని విశ్వసించారనుకోండి. అప్పుడు ఆయన గురువవుతారు. కాబట్టి గురువుగారి మాట మీద గురి చేత ప్రభావితమై శిష్యుడు జీవితంలో మార్పు తెచ్చుకుంటాడు. అందుకే మనుష్యజన్మలో వాసనాబలాన్ని పోగొట్టుకోవడం గురువు వాక్కు వల్ల సంభవమవుతుంది. సదాశివ బ్రహ్మేంద్రులు మహా విద్వాంసులు. కామకోటి పీఠానికి ఎవరు వెళ్ళినా ఆయన దగ్గర వాదనలో ఓడిపోయేవారు. అందరితో ప్రతిదానికీ వాదించేవాడు. ఎవరో వెళ్ళి గురువుగారికి చెప్పారు. గురువుగారు పిలిచి ‘‘ఏరా! నీవు మాట్లాడని రోజుండదా?’’ అన్నారు. అంతే - ‘‘గురువు గారూ! ఈ రోజు నుండి ఈ శరీరం పడిపోయే దాకా మాట్లాడను. గురువుగారి ఆజ్ఞ’’ అన్నాడు. అంతే! సదాశివబ్రహ్మం గారు ఇక మాట్లాడలేదు. అదీ గురుశిష్య సంబంధం. అదీ గురువు గారి పట్ల శిష్యుడికి ఉండవలసిన నమ్మకం. ఆ విశ్వాసం వాసనాబలాన్ని పోగొట్టేస్తుంది. గతజన్మలో ఏ వాసనాబలమైనా ఉండనివ్వండి. ‘తప్పురా’ అని గురువన్న ఒక్కమాటకు వదిలిపెట్టేస్తాడు. అంతే! సంస్కారాన్ని పొందడం మనుష్య జన్మలో మాత్రమే సాధ్యం. ఇతర జన్మల్లో సాధ్యం కాదు. కానీ మనుష్యజన్మను పొటమరించి ఉండే ప్రమాదం ఒకటుంది. అది శబ్ద, స్పర్శ, రస, రూప, గంధాలు.. ఐదూ లౌల్యంతో కలిసి మనిషికి ఉంటాయి. లౌల్యం- అంటే ఎంత అనుభవించినా తనివితీరకుండుట.. అప్పటికి తృప్తి పొందినట్లుంటుంది. మళ్ళీ కాసేపాగి ఇంద్రియాలతో మనసు దాన్ని అనుభవిస్తుంటుంది. అనుభవించేది ఇంద్రియాలు. దాని సుఖానుభూతిని మనసు పుచ్చుకుంటుంది. మిగిలినవాటికలా ఉండదు. వాటికి ఏదో ఒక ఇంద్రియంలోనే లౌల్యం ఉంటుంది. అన్ని ఇంద్రియాల్లోనూ ఉండదు. ఉదాహరణకు శబ్దలౌల్యం. వినుట. ఈ లౌల్యం లేళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. వేటగాడు వచ్చి పెద్ద వల వేసి, అక్కడే చెట్టెక్కి కూర్చుని ఒక పాట పాడతాడు. ఆ పాట వినగానే ఎక్కడో గడ్డిపరకలు తింటున్న లేడి తినడం మానేసి, ఆ శబ్దం వచ్చిన వైపు పరుగెడుతుంది. పాట వింటూ వచ్చి, వలలో పడుతుంది. వెంటనే వేటగాడొచ్చి మళ్ళీ పారిపోకుండా దానికాళ్ళు విరగ్గొట్టి తీసికెళ్ళిపోతాడు. కాబట్టి శబ్దలౌల్యం వల్ల లేళ్ళ జాతి నశించిపోతోంది. అలాగే రస లౌల్యం. చేపకు నోటిపై లౌల్యం. చేపలుపట్టేవాడు ఒక గుండుసూది తీసుకువచ్చి ‘యు’ ఆకారంలో వంచి వానపామును దానికి గుచ్చుతాడు. దీనిని నీటిమీద తేలే బెండుముక్కకు కడతాడు. మరొక కొసను ఒక పొడవుపాటి కర్రకు కట్టి అది పట్టుకుని ఒడ్డున కూర్చుంటాడు. చేపకు కడుపు నిండి ఉన్నాసరే, అలా వెడుతూ వెడుతూ.. ఒక్కసారి కొరికిపోదాం అని కొరికి, గాలానికి చిక్కుకుని గిలాగిలా కొట్టుకుంటుంది. వేటగాడు చేపను పైకి లాగేసుకుని, బుట్టలో వేసేసుకుంటాడు. నోటికి ఉన్న లౌల్యానికి చేపల జాతి తగ్గిపోతున్నది. వర్షాకాలం రాగానే దీపపు పురుగులు దీపాన్ని ఏదో తినే పదార్థం అనుకొని ఎగిరివచ్చి, అక్కడ వాలి మరణిస్తుంటాయి. రెక్కలు ఊడి, కింద పెద్దకుప్పగా పడి ఉండడాన్ని చూసి కూడా వేరొక రెక్కల పురుగొచ్చి ఆ దీపం మీద వాలడం మానదు. కంటితో చూసి పొంగిపోయి, లౌల్యం పొందడం వల్ల రెక్కలపురుగు జాతి నశిస్తోంది. ఇలా ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క ఇంద్రియంలో లౌల్యం. కానీ భగవంతుడు ఏం చేశాడంటే... మనిషికి అన్ని ప్రాణులలోని తేజస్సును వాడుకోగల శక్తినిచ్చి, ఐదు ఇంద్రియాల్లోనూ లౌల్యాన్ని పెట్టాడు. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ఉద్యోగాల సాధనలో సత్తాచాటిన యువకుడు
కంభాళాపూర్(పెబ్బేరు): మండల పరిధిలోని కంభాళాపూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో సత్తా చాటాడు.ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా 10కి పైగా ఉన్నతస్థాయి ఉద్యోగాలకు అర్హత సాధించగా నాలుగు ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలను సొంతం చేసుకున్నాడు. వివరాలిలా.. పెబ్బేరు మండలం కంభాళాపూర్ గ్రామానికి చెందిన మేకల చిన్న జోగన్న కుమారుడు ఎం.శివ ప్రసాద్‌కు చిన్నతనం నుంచే చదువు పై శ్రద్ధ, ఆసక్తి ఉన్నాయి. దీంతో పేదరికం తన పట్టుదల ముందు చిన్నబోయింది. ఇటిక్యాల మండలం బీచుపల్లి గురుకుల పాఠశాలలో పదోతరగతి పూర్తి చేసుకున్న శివ ప్రసాద్ ఉన్నత చదువులు చదువుతూనే వివిధ పోటీ పరీక్షలకు సన్నధమయ్యాడు. తన తొలి ప్రయత్నంలోనే ఎఫ్‌సీఐ (పుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా)ఉన్నత ఉద్యోగానికి ఎంపికయ్యాడు.అనంతరం ఎల్ఐసీ లో, తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో ఉన్నత ఉద్యోగానికి ఎంపికై ప్రస్తుతం బ్యాంక్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఒక వైపు బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తూనే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఉద్యోగాలకు ప్రిపేరయ్యాడు. దీంతో ఇటీవల ఎస్ఎస్సీ వారు నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణుడై సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, సీబీఐ సబ్ఇన్స్పెక్టర్ వంటి ఉన్నత పోస్టులకు ఎంపికయ్యాడు.సాప్ట్వేర్ రంగంలో మంచి జీతం వచ్చినా ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే ప్రభుత్వానికి, ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుందన్న లక్ష్యంతో ముందుకెళ్లినట్లు శివ ప్రసాద్ సాక్షి కి తెలిపారు.ఏకాగ్రత, సరైన ప్రణాళిక, కృషి, పట్టుదల తో శ్రమిస్తే విజయం తప్పక లభిస్తుందని ఆయన అన్నారు.తన విజయం వెనుక తల్లిదండ్రుల ఆశిస్సులు, ప్రోత్సాహం, బంధుమిత్రుల సహకారం ఎంతో ఉందన్నారు. -
హరిత తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం
ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ ౖయెటింక్లయిన్‌కాలనీ : రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని టీఎస్ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా రామగుండం కార్పొరేషన్ 38వ డివిజన్లోని వీర్లపల్లి గ్రామంలో ఆదివారం 1200 మొక్కలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అడవులు పెరగాలని, వర్షాలు కురవాలని అన్నారు. దీనికోసం ప్రతిఒక్కరూ విరివిగా మొక్కలు నాటి వాటిని పెంచే బాధ్యత తీసుకోవాలని కోరారు. వాతావరణ కాలుష్యం తగ్గించేందుకు మొక్కల పెంపకం ఒక్కటే మార్గమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో ప్రతీఒక్కరు పాల్గొనాలని సూచించారు. ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వీర్లపల్లి గ్రామంలోని సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు. మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఖాళీ ప్రదేశాలు కనిపించకుండా మొక్కలు నాటాలని కోరారు. మొక్కలు నాటేందుకు ముందుకు వచ్చిన వారికి ఉచితంగా పండ్ల మొక్కలు, నీడనిచ్చే మొక్కలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు, 38వ డివిజన్ కార్పొరేటర్ నారదాసు మారుతి, కుంట సాయి, నాయకులు దీటి బాలరాజు. ఉల్లెంగుల రమేశ్, వేణుగోపాల్‌రావు, శ్రీనివాస్‌రావు, సత్యనారాయణ, పారిజాతం, రజిత తదితరులు పాల్గొన్నారు. -
విశాఖలో విద్యార్థులను మోసం చేసిన AIM సంస్థ